బద్వేల్‌ ఉపఎన్నికలో విపక్షాలకు వైసీపీ ఆఫర్‌..!

బద్వేల్‌ ఉపఎన్నికల్లో వైసీపీ విపక్షాలకు ఓ ఆఫర్‌ ఇచ్చింది. సంప్రదాయాలను గౌరవిస్తూ బద్వేలులో పోటీకి దిగకుంటే మంచిదన్నది ఆ ఆఫర్‌ సారాంశం. ముందే అభ్యర్థిని ప్రకటించిన టీడీపీ.. ఆ ఆఫర్‌ను స్వీకరించి పోటీ, ప్రచారం జంఝాటాలు లేకుండా గౌరవంగా తప్పుకొంటుందా? లేక తిరుపతిలాగే సై కొడుతుందా?

2019లో బద్వేలులో వైసీపీకి 44 వేల ఓట్ల మెజారిటీ..!

అనారోగ్యంతో ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య మృతి చెందడంతో కడప జిల్లా బద్వేలులో ఉపఎన్నిక అనివార్యమైంది. అక్టోబర్‌ 30న ఇక్కడ ఉపఎన్నిక నిర్వహించడానికి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ ప్రకటించింది. బద్వేల్‌ ఉపపోరుపై ఇప్పటి వరకు పెద్దగా చడీచప్పుడు లేదు. రాష్ట్రంలో వైసీపీ బలంగా ఉండటంతో విపక్షపార్టీలు అక్కడ పెద్దగా దృష్టి పెట్టిందీ లేదు. పైగా ఇది సీఎం జగన్‌ సొంత జిల్లాలో జరుగుతున్న ఉపఎన్నిక. 2019 ఎన్నికల్లో బద్వేల్‌లో వైసీపీకి 44 వేల ఓట్ల మెజారిటీ దక్కింది.

సంప్రదాయలను గుర్తు చేసిన వైసీపీ..!

ప్రస్తుత ఉపఎన్నికల్లో దివంగత ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య భార్య సుధ వైసీపీ నుంచి బరిలో దిగుతున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన ఓబుళాపురం రాజశేఖరే మరోసారి టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. బీజేపీ-జనసేన, కాంగ్రెస్‌ పోటీ చేస్తాయో లేదో ఇంకా చెప్పలేదు. సంప్రదాయాలను అనుసరించి బద్వేల్‌లో పోటీ లేకపోతే బాగుంటుందని వైసీపీ అభిప్రాయపడింది. కానీ.. టీడీపీ అభ్యర్థిని ప్రకటించడంతో పోటీ అనివార్యంలా కనిపిస్తోంది. నామినేషన్ల దాఖలకు ఇంకా సమయంలో ఉండటంతో ఆలోగా టీడీపీ మనసు మార్చుకుంటుందా లేదా అన్నది ఒక చర్చ. టీడీపీ విత్‌ డ్రా అయితే మిగతా పక్షాల మాటేమిటి?

తిరుపతి ఉపఎన్నికల్లో సంప్రదాయాలకు చెల్లు..!

2019 జనరల్‌ ఎలక్షన్స్‌ తర్వాత ఏపీలో తిరుపతి లోక్‌సభకు ఉపఎన్నిక జరిగింది. వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్‌ అకాల మరణంతో బైఎలక్షన్‌ వచ్చింది. తిరుపతిలో ఏ పక్షమూ సంప్రదాయాలను పాటించలేదు. వైసీపీ, టీడీపీ, బీజేపీ-జనసేన ఉమ్మడిగా, కాంగ్రెస్‌ అభ్యర్థులు పోటీ పడ్డారు. ఆ బైఎలక్షన్‌లో వైసీపీ గెలిచింది. అయితే వైసీపీ అనుకున్నంత మోజారిటీ రాలేదు. టీడీపీకి కూడా ఓట్లు గణనీయంగానే పోలయ్యాయి. అప్పుడే సంప్రదాయాలను పట్టించుకోని టీడీపీ, బీజేపీలు ఇప్పుడు బద్వేలు ఉపపోరులో పట్టించుకుంటాయా? అసలే ఏపీలో వైసీపీ, టీడీపీ మధ్య రాజకీయం ఉప్పు నిప్పులా ఉంది. ప్రభుత్వంపై అసంతృప్తి పెరిగిందని టీడీపీ, బీజేపీ ప్రచారం చేస్తున్నాయి. మొన్నా మధ్య అయితే టీడీపీ నేతలు అసెంబ్లీ రద్దు- మధ్యంతర ఎన్నికలకు డిమాండ్‌ చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉపఎన్నిక బరి నుంచి విపక్షాలు అంత తేలిగ్గా తప్పుకొంటాయా?. అయితే ఎంత పోరాడినా విపక్షాలకు గెలుపు సాధ్యమా అనే సందేహాలు ఉన్నాయి. వైసీపీ ఇచ్చిన ఆఫర్‌ను పట్టుకుని గౌరవంగా బరి నుంచి తప్పుకుంటాయా లేక సై అంటాయో చూడాలి. బద్వేల్‌లో గతంలో మూడు దఫాలు టీడీపీ నెగ్గిన సందర్భాలు ఉన్నాయి.

2019లో టీడీపీకి వచ్చిన 50 వేల ఓట్లకు గండి?

ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ బాగా దెబ్బతింది. పంచాయతీ, మున్సిపల్‌, పరిషత్‌ ఎన్నికల్లో వైసీపీదే హవా. ఇప్పుడు కాదూ కూడదని బద్వేలులో టీడీపీకి పోటీకి సిద్ధపడితే.. వైసీపీ ఉపఎన్నికపై మరింత ఫోకస్‌ పెడుతుంది. 2019లో ఇక్కడ టీడీపీకి వచ్చిన 50 వేల ఓట్లకు గండికొట్టే ప్రయత్నం చేయొచ్చు. ఉపపోరులో గౌరవప్రదమైన ఓట్లు రాకపోతే టీడీపీ శ్రేణులు ఇంకా డీలా పడే అవకాశం ఉంది. అది టీడీపీకే నష్టం. అందుకే అలాంటి ప్రయోగాలకు పోకుండా.. కేడర్‌లో ధైర్యం సన్నగిల్లకుండా.. అధికారపార్టీ ఇచ్చిన ఆఫర్‌తో సేఫ్‌ ఎగ్జిట్‌కు తెలుగుదేశం మొగ్గు చూపుతుందో లేదో చూడాలి. అలాగే తిరుపతిలో చావుదెబ్బతిన్న బీజేపీ- జనసేన కూటమి.. కాంగ్రెస్‌ పార్టీలు ఏం చేస్తాయో చూడాలి.

-Advertisement-బద్వేల్‌ ఉపఎన్నికలో విపక్షాలకు వైసీపీ ఆఫర్‌..!

Related Articles

Latest Articles