అధ్వాన్నంగా ఉన్న రోడ్డుకు టోల్ ఛార్జీనా? వైసీపీ ఎమ్మెల్యే రోజా ఫిర్యాదు

చిత్తూరు జిల్లాలోని నగరి-పుత్తూరు జాతీయ రహదారి అధ్వానంగా ఉందని.. అలాంటి రోడ్డుకు టోల్ ఛార్జీ వసూలు చేయడం సరికాదని వైసీపీ ఎమ్మెల్యే రోజా అభిప్రాయపడ్డారు. ఈ మేరకు విజయవాడలోని ఆర్‌అండ్‌బీ ప్రత్యేక కార్యదర్శి కృష్ణబాబుకు టోల్ వసూలు చేయవద్దని ఎమ్మెల్యే రోజా వినతిపత్రం సమర్పించారు. చిత్తూరు జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తిరుపతి-చెన్నై రహదారి పూర్తిగా దెబ్బతిందని, వెంటనే బాగు చేయాలని ఆమె కోరారు.

Read Also: పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు

జాతీయ రహదారిలో నిబంధనల మేరకు పనులు జరగలేదని ఎమ్మెల్యే రోజా ఆర్‌అండ్‌బీ దృష్టికి తీసుకువెళ్లారు. సాధారణ నిర్వహణ పనులు కూడా చేయడం లేదని ఆమె అసహనం వ్యక్తం చేశారు. ఈ అంశంపై ఇప్పటికైనా స్పందించకపోతే ప్రజలు ధర్నాలు, రాస్తారోకోలు చేయాల్సి వస్తుందని రోజా హెచ్చరించారు. అయితే ఈ అంశంపై తాను సంబంధిత అధికారులతో మాట్లాడానని ఆర్‌అండ్‌బీ ప్రత్యేక కార్యదర్శి కృష్ణబాబు తెలిపారు. నగరి-పుత్తూరు జాతీయ రహదారి తమిళనాడు జాతీయ రహదారుల పరిధిలో ఉందని.. దీంతో ఈ సమస్య తమ దృష్టికి రాలేదని వివరణ ఇచ్చారు. తమిళనాడు ప్రభుత్వంతో మాట్లాడి ఈ సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటానని ఆయన ఎమ్మెల్యే రోజాకు హామీ ఇచ్చారు.

Related Articles

Latest Articles