టాలీవుడ్ హీరోల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన వైసీపీ ఎమ్మెల్యే

నెల్లూరు జిల్లా కోవూరు వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో పలు జిల్లాలు వరదలతో అతలాకుతలం అవుతుంటే టాలీవుడ్ హీరోలు స్పందించకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రజల అభిమానం వల్లే హీరోలు అయిన వాళ్లు.. ఇప్పుడు ప్రజలు కష్టాల్లో, బాధల్లో ఉంటే స్పందించకపోవడం బాధాకరమన్నారు. చిరంజీవి, వెంకటేష్, మహేష్ బాబు, ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్.. ఇలా ఒక్కరు కూడా వరద ప్రజల గురించి ఒక్క స్టేట్‌మెంట్ ఇవ్వలేదని ఎమ్మెల్యే నల్లపురెడ్డి ఆరోపించారు.

Read Also: ట్రెండింగ్‌లో త్రివిక్రమ్ ట్వీట్.. ట్విస్ట్ ఏంటంటే..?

గతంలో ప్రజలకు ఎప్పుడైనా అనుకోని విధంగా కష్టాలు వస్తే సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్‌ఆర్ వెంటనే స్పందించి రోడ్డు మీదకు వచ్చి జోలె పట్టి సహాయం చేసేవారని నల్లపురెడ్డి గుర్తుచేశారు. అందుకే ఎన్టీఆర్, ఏఎన్‌ఆర్ సినిమా ఇండస్ట్రీకి రెండు కళ్లు అని అభిప్రాయపడ్డారు. ఇప్పుడున్న హీరోలు సినిమాల్లో నటిస్తూ కోట్లకు కోట్లు సంపాదిస్తున్నారని.. వారిని హీరోలను చేసిన ప్రజలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఇప్పటికైనా హీరోలు స్పందించి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏదో ఒక సాయం చేయాలని నల్లపురెడ్డి పిలుపునిచ్చారు. హీరోలు సంపాదించిన దాంట్లో కొంచెమైనా ప్రజలకు సాయం చేయాలని ఆయన హితవు పలికారు. మరోవైపు నిర్మాతలు, దర్శకులు కూడా స్పందించాలని తాము కోరుతున్నామని నల్లపురెడ్డి పేర్కొన్నారు.

Related Articles

Latest Articles