సినిమా వాళ్లు బలిసి కొట్టుకుంటున్నారు: వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి

సినిమా ఇండస్ట్రీపై వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా వాళ్లు బలిసి కొట్టుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. తమ వాళ్లు పరిశ్రమలో ఉన్నారు కాబట్టే సినిమా వాళ్లకు చంద్రబాబు సపోర్ట్ ఇస్తున్నారని ఎమ్మెల్యే నల్లపురెడ్డి ఆరోపించారు. సినిమా టిక్కెట్ రేట్లు తగ్గిస్తే తప్పేంటని ఆయన ప్రశ్నించారు. పేదల కోసమే తమ ప్రభుత్వం టిక్కెట్ల రేట్లను తగ్గించిందన్నారు. సినీ హీరోలు కోట్లు ఆర్జిస్తూ విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారని.. పేదలు వినోదం కోసం సినిమాకు వెళ్తే రూ.వెయ్యి, రూ.2వేలు ఖర్చు పెట్టాల్సి వస్తోందని ఎమ్మెల్యే నల్లపురెడ్డి పేర్కొన్నారు.

నెల్లూరు జిల్లా కోవూరులో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో పాల్గొన్న వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి టాలీవుడ్‌లో ప్రస్తుతం నడుస్తున్న టిక్కెట్ల రేట్ల అంశం గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా సినిమా వాళ్ల పొట్టలు కొడుతున్నామంటూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా వాళ్లు ఏపీని పట్టించుకోవడం లేదని.. అసలు జగన్ అనే ఒక సీఎం ఉన్నారని ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, హీరోలు పట్టించుకుంటున్నారా అని ఆయన వ్యాఖ్యానించారు. సినిమా వాళ్లు హైదరాబాద్‌లో ఉంటూ తెలంగాణలోనే సినిమాలు తీస్తున్నారని మండిపడ్డారు. అసలు వాళ్లకు ఏపీ గుర్తుందా అని ప్రశ్నించారు. చంద్రబాబే మాఫియా కంటే పెద్ద లీడర్ అని… మళ్లీ ఆయన తమ మీద ఆరోపణలు చేయడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related Articles

Latest Articles