బద్వేల్ బై ఎలక్షన్: రికార్డుపైనే వైసీపీ గురి?

బద్వేల్ ఉప ఎన్నికలో ఎవరు గెలుస్తారనేది చెప్పడం పెద్ద కష్టమేమీ కాదు. ఈ ఎన్నిక ఉత్కంఠగా జరుగుతుందని అంతా భావించారు. అయితే అందరీ అంచనాలను తలకిందులు చేస్తూ ప్రధాన పార్టీలు పోటీ నుంచి తప్పుకున్నాయి. దీంతో అధికారంలో ఉన్న వైసీపీకి ఇక్కడ గెలుపు నల్లేరుపై నడకలా మారింది. అయితే వైసీపీ మెజార్టీపైనే కన్నేసినట్లు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థికి 44వేల ఓట్ల మెజార్టీరాగా దానిని అధిగమించడమే లక్ష్యంగా ఆపార్టీ శ్రేణులు ముందుకు కదులుతున్నాయి.

గత అసెంబ్లీ ఎన్నికల్లో కడప జిల్లాను వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. దీనిలో భాగంగానే బద్వేల్ నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన డాక్టర్ వెంకట సుబ్బయ్య సమీప టీడీపీ అభ్యర్థిపై 44వేల మెజార్టీని సాధించారు. అయితే అనుహ్యంగా ఆయన మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈక్రమంలోనే సదరు ఎమ్మెల్యే భార్యకే సీఎం జగన్మోహన్ రెడ్డి టిక్కెట్ కేటాయించారు. దీంతో వైసీపీ అభ్యర్థిగా డాక్టర్ దాసరి సుధ బరిలో నిలిచి ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు.

బద్వేల్ నియోజకవర్గం కడప జిల్లాలో ఉంది. సీఎం సొంత జిల్లా కావడంతో ఇక్కడ వైసీపీ బలంగా ఉంది. దీంతో ఈ ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థి గెలుపు పెద్దకష్టమేమీ కాదని తెలుస్తోంది. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకుతోడు సానుభూతి పవనాలు కూడా వైసీపీ అభ్యర్థికి ఈ ఎన్నికలో కలిసి రానున్నాయి. మరోవైపు వైసీపీకి అంతో ఇంతో పోటీనిచ్చే టీడీపీ, జనసేన పార్టీలు ఈ సైతం ఈ ఎన్నిక నుంచి తప్పుకోవడంతో వైసీపీ గెలుపు ఏకపక్షంగానే మారింది. ఇదే సమయంలో వైసీపీ రికార్డు మెజార్టీపై కన్నేసినట్లు ప్రచారం జరుగుతోంది.

వైసీపీ అభ్యర్థి దాసరి సుధకు నియోజకవర్గంలో మంచి పేరుంది. గైనకాలజిస్టు చదివిన సుధ డాక్టర్ వెంకట సుబ్బయ్యను వివాహం చేసుకుంది. వీరిద్దరు ప్రైవేటుగా ప్రాక్టీస్ చేస్తూ జిల్లాలోని ప్రజలకు సుపరిచితులయ్యారు. సుధ గైనకాలజిస్టు కావడంతో ఆమె వద్దకు జనాలు ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు. ఆమెకు ఆ పరిచయాలు ఇప్పుడు అనుకూలిస్తాయని వైసీపీ భావిస్తుంది. దీనికితోడు ఆమె గత ఎన్నికల్లోనూ తన భర్తతో కలిసి నియోజకవర్గంలో కలిసి ప్రచారం చేశారు. ఇదికూడా ఆమె కలిసి రానుంది.

బద్వేల్ ఉప ఎన్నికలో వైసీపీకి పెద్ద పోటీ ఏమిలేదు. టీడీపీ, జనసేన పార్టీలు తప్పుకోవడంతో ఆ పార్టీల ఓటుబ్యాంకు కూడా వైసీపీ టర్న్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కన్పిస్తున్నాయి. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, సానుభూతి పవనాలు, ఆమెకు నియోజకవర్గంలో ఉన్న పరిచయాలు అన్ని కలిసి ఆమె రికార్డు స్థాయిలో మెజార్టీని కట్టబెట్టేలా కన్పిస్తున్నాయి. దీంతో గతంలో వైసీపీ నెలకొల్పిన రికార్డు డాక్టర్ సుధ బ్రేక్ చేస్తుందనే ఆకాంక్షను వైసీపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. మరీ ఆమె ఏమేర రికార్డు మెజార్టీని సాధిస్తారో వేచిచూడాల్సిందే..!

-Advertisement-బద్వేల్ బై ఎలక్షన్: రికార్డుపైనే వైసీపీ గురి?

Related Articles

Latest Articles