బీజేపీ కార్పొరేటర్లకు తప్పని చిక్కులు..!

భారీ వర్షాలు.. కాలనీల మునక హైదరాబాద్‌లోని కార్పొరేటర్లకు కష్టాలు తెచ్చి పెడతున్నాయా? అధికార పార్టీ ప్రజాప్రతినిధుల పరిస్థితి ఎలా ఉన్నా.. బీజేపీ కార్పొరేటర్లకు చిక్కులు తప్పడం లేదా? బాధితులను ఓదారుస్తున్నా.. లోపల మాత్రం ఆ పార్టీకి ఎక్కడో తేడా కొడుతోందా?

అప్పట్లో గొంతెత్తిన బీజేపీ నేతలు.. ఇప్పుడు మౌనం..!

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పాలిటిక్స్‌ గమ్మత్తుగా మారిపోతున్నాయి. గతంలో నగరంలో ఏవైనా సమస్యలుంటే.. ప్రతిపక్షాలు గట్టిగానే ప్రభుత్వాన్ని నిలదీసేవి. సమస్యల పరిష్కారం కోసం పెద్దఎత్తున ఆందోళనలు చేపట్టిన సందర్భాలూ ఉన్నాయి. ఎన్నికలకు ముందు హైదరాబాద్‌లో భారీ వర్షాలకు ఎదురైన ఇబ్బందులపై ఆ విధంగానే ప్రభుత్వంపై బాణాలు ఎక్కుపెట్టాయి పార్టీలు. అప్పట్లో సర్కార్‌ను నిలదీసిన వాళ్లల్లో బీజేపీ నుంచి కార్పొరేటర్లుగా ఎన్నికయ్యారు. ఇప్పుడు హైదరాబాద్‌లో భారీ వర్షాలకు మళ్లీ కాలనీలు నీట మునిగాయి. అప్పుడు గొంతెత్తిన బీజేపీ నేతలు.. ఇప్పుడు కార్పొరేటర్లుగా మారినా గట్టిగా అడగలేని పరిస్థితి ఉందట. మళ్లీ ఆందోళనలు చేయలేక.. రోడ్డెక్కితే ఓట్లేసిన వారి నుంచి వచ్చే రియాక్షన్‌ ఊహించలేక ఇబ్బంది పడుతున్నారట.

బాధితులకు ఓదార్పే తప్ప హామీలు ఇవ్వలేని పరిస్థితి!

GHMCలో బీజేపీకి 47 మంది కార్పొరేటర్లు ఉన్నారు. గతంతో పోల్చితే మొన్నటి ఎన్నికల్లో బీజేపీ సభ్యుల సంఖ్య పెరిగింది. అప్పట్లో డివిజన్లలో ఏ సమస్యలపై పోరాడారో అవి అలాగే ఉన్నాయి. బీజేపీ నేతలు గెలిచారు కానీ.. కాలనీల సమస్యల పరిష్కారంలో వారి గళం ప్రతిపక్ష పాత్రకే పరిమితం అవుతోంది. ప్రస్తుతం నీట మునిగి కాలనీల్లో పర్యటిస్తూ.. బాధితులను ఓదార్చుతున్నారు. అంతకుమించి హామీ ఇవ్వలేని పరిస్థితి. అలాగని.. తమతో వచ్చి ధర్నా చేయాలని కోరే ధైర్యమూ చేయడం లేదు.

కేంద్రం నుంచి నిధులు తీసుకురమ్మంటారనే భయం?

వాస్తవానికి వరద ముప్పు నుంచి కాలనీలను బయట పడేసేందుకు ప్రభుత్వం పనులు చేపట్టింది. కాకపోతే అవి టెండర్ల దశలో ఉన్నాయి. అక్కడి నుంచి ముందుకు అడుగుపడితే అధికార పార్టీ అయినా.. విపక్ష కార్పొరేటర్లకైనా చెప్పుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. బీజేపీ కార్పొరేటర్లకు ప్రస్తుతం ఏం చేయాలో పాలుపోవడం లేదట. ఒకవేళ గట్టిగా మాట్లాడితే.. కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలని అధికారపక్షం నుంచి కౌంటర్లు పడతాయి. అవి జనాల్లోకి వెళ్లితే.. క్షేత్రస్థాయిలో ఇబ్బందులు తప్పవు. ఇప్పటికే బీజేపీ వాళ్లకు వరద కనిపించడం లేదా అన్న కామెంట్స్‌ డివిజన్లలో వినిపిస్తున్నాయట. మరి.. ఈ సమస్య నుంచి కమలనాథులు ఎలా బయట పడతారో చూడాలి.

Related Articles

Latest Articles

-Advertisement-