మరపురాని తాపీ ధర్మారావు రచనా మొరమరాలు!

(సెప్టెంబర్ 19న తాపీ ధర్మారావు జయంతి)

చూడక నమ్మినవారు ధన్యులు అంటారు. కానీ, చూస్తేనే కదా అసలు విషయం తెలిసేదని వాదించేవారూ ఘనులే. హేతువును అన్వేషించడంలోనే ఆనందించేవారు ఇలాంటి ఘనులు. ఆ కోవకు చెందినవారు సుప్రసిద్ధ రచయిత తాపీ ధర్మారావు. తెలుగునేలపై హేతువాదులుగా పేరొందిన రచయితల్లో ధర్మారావు స్థానం ప్రత్యేకమైనది. ఆయన ముక్కుసూటి తనం చాలామందికి నచ్చక పోవచ్చు. కానీ, ఆయన కలం బలం తెలిసినవారు మాత్రం ధర్మారావును అభిమానించకుండా ఉండలేరు. ప్రతీ విషయానికీ ఏదో ఒక హేతువు ఉంటుందని నమ్మిన తాపీవారు ‘దేవాలయాలపై బూతుబొమ్మలెందుకు?’ అన్న అంశంపై పరిశోధన చేసి మరీ ఓ రచన చేశారు. ఆ రోజుల్లో ఆ పుస్తకం సంచలనం సృష్టించింది. ఆస్తికులు కూడా ఆయన రచనలో వెలుగు చూసిన నిగూఢసత్యాలను చదివి ఆనందించారు. ఆయన కలం నుండి వెలువడిన “పెళ్ళి-దాని పుట్టుపూర్వోత్తరాలు, ఇనుపకచ్చెడాలు, పాతపాళీ-కొత్తపాళీ, ఆల్ ఇండియా అడుక్కుతినేవాళ్ళ మహాసభ, సాహిత్య మొరమరాలు” తెలుగు పాఠకలోకాన్ని విశేషంగా ఆకర్షించాయి. టాల్ స్టాయ్ రాసిన ‘అన్నాకరేనా’ను తెలుగులో అనువదించిందీ తాపీవారే. ఇక ఆయన జీవితగాథగా వెలువడిన ‘రాళ్ళు-రప్పలు’ సైతం పాఠకులను మురిపించింది. తెలుగు సాహితీవనంలో తనవైన గుబాళింపులు వెదజల్లిన తాపీ ధర్మారావు చిత్రసీమలోనూ తన కలం బలంతో మురిపించడం విశేషం!

తాపీ ధర్మారావు నాయుడు 1887 సెప్టెంబర్ 19న ఒరిస్సాలోని బర్హంపురంలో ఓ తెలుగు కుటుంబంలో జన్మించారు. శ్రీకాకుళం, పర్లాకిమిడి, విజయవాడలో ధర్మారావు విద్యాభ్యాసం సాగింది. పర్లాకిమిడిలో చదివే రోజుల్లో వ్యావహారిక భాషావేత్త గిడుగు రామమూర్తి పంతులు శిష్యరికం చేశారు. గురువు బాటలోనే పయనిస్తూ జనం భాషలోనే రచనలు సాగించారు ధర్మారావు. వీరి ఇంటిపేరు ‘బండి’ లేదా ‘బండారు’ అని అంటారు. వీరి తండ్రి పేరు అప్పన్న. ఆయన తాత లక్ష్మయ్య కొంతకాలం మిలిటరీలో పనిచేసి, తరువాత తాపీ పనిలో మంచి పేరు సంపాదించారు. అలా ఆయన తాపీ లక్ష్మయ్యగా పేరొందారు. ముత్తాత లక్ష్మయ్య పేరు ముందు చేరినదే తరువాతి కాలంలో ధర్మారావు ఇంటిపేరుగా మారింది. కల్లికోట రాజావారి కళాశాలలో ధర్మారావు గణితం బోధించారు ధర్మారావు. మిత్రులతో కలసి ‘వేగుచుక్క గ్రంథమాల’ను స్థాపించారు. 1911లో ధర్మారావు ‘ఆంధ్రులకొక మనవి’ పేరుతో ఓ రచన చేశారు. అదే ఆయన తొలి రచన. పలు పత్రికలను కూడా నిర్వహించారు. “కొండెగాడు, సమదర్శిని, జనవాణి, కాగడా” వంటివి తాపీవారి సంపాదకత్వంలోనే వెలుగు చూశాయి. రంగస్థలంలోనూ తాపీ ధర్మారావుకు మంచి ప్రవేశం ఉంది. ఆయన రచనలతో పలు నాటకాలు జనాన్ని ఆకట్టుకున్నాయి. ప్రముఖ తెలుగు చిత్ర దర్శకుడు చిత్రపు నరసింహారావు పిలుపు మేరకు చిత్రసీమలో అడుగు పెట్టారు ధర్మారావు. ఆయన రచన చేసిన తొలి చిత్రం చిత్రపు నరసింహారావు దర్శకునిగా 1937లో రూపొందిన ‘మోహినీ రుక్మాంగద’. ఏకాదశీ వ్రత విశిష్టతను తెలిపే కథతో ఈ చిత్రం తెరకెక్కింది. తొలి సినిమాలోనే ధర్మారావు బాణీ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది.

గూడవల్లి రామబ్రహ్మం దర్శకత్వాన 1938లో రూపొందిన సంచలన చిత్రం ‘మాలపిల్ల’లో తాపీ ధర్మారావు రాసిన సంభాషణలు ఆ రోజుల్లో ప్రజల నాలుకలపై నాట్యం చేశాయి. గూడవల్లి రామబ్రహ్మం దర్శకత్వంలోనే తెరకెక్కిన మరో సంచలన చిత్రం ‘రైతుబిడ్డ’లోనూ తాపీ వారి మాటలు జనాన్ని మైమరిపించాయి. 1940లో వచ్చిన ‘ఇల్లాలు’ చిత్రం మంచి విజయం సాధించింది. అందులో తాపీవారు మాటలతో పాటు కొన్ని పాటలూ పలికించారు. 1943లో రూపొందిన ‘కృష్ణప్రేమ’లో నాటి మేటి నటి టంగుటూరి సూర్యకుమారి నారద పాత్ర పోషించడం విశేషం! అందులో ఆమె నోట తాపీ వారి పాట పలికి పరవశింప చేసింది. “గోపాలుడే…వేణుగోపాలుడే…”, “జేజేలయ్యా జోహారు కృష్ణా…”, “నీ మహిమలెన్న తరమా…”- వంటి కృష్ణభక్తిని చాటే పాటలు ధర్మారావు కలం పలికించగా, సూర్యకుమారి గానం చేశారు. ఎల్.వి.ప్రసాద్ దర్శకత్వంలో కె.ఎస్.ప్రకాశరావు నిర్మించిన ‘ద్రోహి’లోనూ తాపీ వారి పలుకు, పాట రెండూ మురిపించాయి. ఇందులోని “చక్కలి గింతలు లేవా… చక్కని ఊహలు రావా…”, “ఎందుకీ బ్రతుకు…”, “ఇదేనా నీ న్యాయం…” వంటి పాటలు తాపీవారి కలం నుండి జాలువారినవే! ఏయన్నార్ హీరోగా రూపొందిన ‘కీలుగుర్రం’ చిత్రానికి తాపీ ధర్మారావు మాటలు-పాటలు సమకూర్చారు. “కాదు సుమా కలకాదు సుమా…”, “ఆహా అహో ఆనందమూ…”, “ఎంత కృపామతివే…”, “తెలియవశమా… పలుక తరమా…” వంటి పాటలు ఈ నాటికీ జనాన్ని పులకింప చేస్తూనే ఉన్నాయి. యన్టీఆర్ తొలి జానపద చిత్రం ‘పల్లెటూరి పిల్ల’కు కూడా తాపీ ధర్మారావు మాటలు రాశారు. తరువాత ఏయన్నార్ ‘పరమానందయ్య శిష్యుల కథ’, ‘రోజులు మారాయి’ చిత్రాలకు కూడా తాపీ ధర్మారావు రచన చేశారు. ‘రోజులు మారాయి’ చిత్రంలో ఆయన రాసిన “ఇదియే హాయి కలుపుము…”, “మారాజు వినవయ్యా…”, “చిరునవ్వులు విరిసే…”, “ఎల్లిపోతుంది ఎల్లి…” పాటలు కూడా ఆకట్టుకున్నాయి. 1973 మే 8న తాపీ ధర్మారావు కన్నుమూశారు.

‘రోజులు మారాయి’ చిత్రానికి దర్శకత్వం వహించిన తాపీ చాణక్య, ధర్మారావు తనయుడే . తరువాతి రోజుల్లో చాణక్య “పెద్దరికాలు, ఎత్తుకు పైఎత్తు, భాగ్యదేవత, గంగ-మంగ” వంటి హిట్ మూవీస్ కు దర్శకత్వం వహించారు. యన్టీఆర్ హీరోగా రూపొందిన “కలసివుంటే కలదు సుఖం, రాముడు-భీముడు, వారసత్వం, సి.ఐ.డి.,” వంటి విజయవంతమైన చిత్రాలు కూడా చాణక్య దర్శకత్వంలో రూపొందినవే. హిందీలో “రామ్ ఔర్ శ్యామ్, బిఖ్రే మోతీ, మన్ మందిర్, జాన్వర్ ఔర్ ఇన్సాన్” వంటి సినిమాలకూ చాణక్య దర్శకుడు. తమిళంలో “పుదియ పదై, ఎంగవీట్టు పెన్” వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ తో పాటు ఎమ్జీఆర్ హీరోగా “ఎంగవీట్టు పిళ్ళై, నాన్ ఆనయిట్టాల్, ఒలి విలక్కు, పుదియ భూమి” వంటి విజయవంతమైన చిత్రాలు రూపొందించారు చాణక్య. కొన్ని చిత్రాలకు తాపీ చాణక్య స్క్రీన్ ప్లే కూడా రాసుకున్నారు. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు.

-Advertisement-మరపురాని తాపీ ధర్మారావు రచనా మొరమరాలు!

Related Articles

Latest Articles