మధురం పంచిన మల్లాది రామకృష్ణ శాస్త్రి

(సెప్టెంబర్ 12 మల్లాది రామకృష్ణ శాస్త్రి వర్ధంతి)

‘తేనెకన్నా తీయనిది తెలుగు భాష’ అన్న మాట చిన్నప్పటి నుంచీ వింటూనే ఉన్నాం. ఆ తీయదనానికి మరింత తీపు అద్దినవారు మల్లాది రామకృష్ణ శాస్త్రి. ఆయన రచనలు పాఠకులకు మధురానుభూతులు, శ్రోతలకు వీనులవిందు చేశాయి. అందుకే జనం మల్లాదివారి సాహిత్యం చదివి ‘సాహో… మల్లాది రామకృష్ణ శాస్త్రీ’ అన్నారు.

సినిమా రంగంలో ప్రవేశించే నాటికే మల్లాది రామకృష్ణ శాస్త్రి కలం బలం చూపిన రచయిత. స్వస్థలం బందరులో బి.ఏ,, పూర్తి చేశాక, మదరాసులో ఎమ్.ఏ. తెలుగు చదివారు. యడవల్లి సుబ్బావధానుల ద్వారా వేదం, నోరి సుబ్రహ్మణ్య శాస్త్రి ద్వారా మహాభాష్యం అభ్యసించిన మల్లాది మాతృభాష తెలుగుతో పాటు అనేక భారతీయ భాషల్లోనూ పాండిత్యం సంపాదించారు. ఇంగ్లిష్, స్పెయిన్, ఫ్రెంచ్ భాషల్లోనూ రామకృష్ణ శాస్త్రి వారికి ప్రవేశముండేది. చిత్రసీమలో మల్లాదివారు ప్రవేశించే నాటికే సముద్రాల రాఘవాచార్య హవా విశేషంగా వీస్తూ ఉండేది. ఆయనతో కలసి మల్లాదివారు సాహితీచర్చలు సాగించేవారు. అలా ఇద్దరికీ అనుబంధం పెనవేసుకుంది. సముద్రాలవారిని ‘అన్నయ్యా’ అంటూ అభిమానంగా పిలిచేవారు మల్లాది. తరువాతి రోజుల్లో ‘తమ్ముడు రామకృష్ణ సాహిత్యాన్ని’ సముద్రాలవారు సైతం ఎంతగానో అభినందించేవారు.

మల్లాది వారి ‘కృష్ణాతీరం’ తెలుగు సాహిత్యంలో ఓ వెలుగు నింపింది. ఆయన సంకలనం ‘చలవ మిరియాలు’ సాహితీ ప్రియులను పులకింపచేసింది. “గోపిదేవి, కేళీగోపాలం, అ ఇ ఉ ఋ” వంటి నాటకాలు అలరించాయి. ‘చిన్నకోడలు’ (1952) చిత్రంతో చిత్రసీమలో ప్రవేశించిన మల్లాదివారు ఆరంభంలో కొన్ని సినిమాల రచనలో చేయి చేసుకున్నారు. ఇక సముద్రాల వారికి ఎంతో పేరు సంపాదించి పెట్టిన చిత్రాలలో ‘దేవదాసు’ కూడా ఉంది. ఈ సినిమాలోని పాటలు ఈ నాటికీ అలరిస్తూనే ఉన్నాయి. ‘వినోదా’ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి సముద్రాల వారు కూడా భాగస్వామి. అందువల్ల ఇతర చిత్రాల రచనలోనూ, ‘దేవదాసు’ నిర్మాణంలోనూ బిజీగా ఉన్న సముద్రాలవారు మల్లాదివారితోనే ‘దేవదాసు’కు పాటలు రాయించారట! మల్లాదివారు రాసిన పాటలను స్వయంగా అందులో దేవదాసుగా నటించిన అక్కినేని నాగేశ్వరరావు కారులో వెళ్ళి తీసుకువచ్చి, సముద్రాలకు ఇచ్చేవారట. ఆ పాటలను ఆయన సుబ్బరామన్ బాణీలకు అనువుగా కొన్ని పదాలను మార్చి ఇచ్చేవారట. ఈ విషయాన్ని ఓ సందర్భంలో శ్రీశ్రీ బయట పెట్టినారట. అప్పటి నుంచీ ‘దేవదాసు’ పాటలు మల్లాదివారివే అనే ప్రచారం సాగింది. కానీ, మల్లాది వారు మాత్రం ఏ నాడూ ఆ పాటలు తనవేనని చెప్పుకోలేదు. ఇక వినోదా సంస్థవారు యన్టీఆర్ తో నిర్మించిన ‘కన్యాశుల్కం, చిరంజీవులు’ చిత్రాలకు మల్లాదివారితోనే పాటలు రాయించారు. ‘కన్యాశుల్కం’లోని “చిటారు కొమ్మను మిఠాయి పొట్లం… చేతికందదేం గురువా…” పాటను పలికించింది మల్లాదివారే. ఆ రోజుల్లో కుర్రకారు ఆ పాటను భలేగా పాడుకొనేవారు. ‘చిరంజీవులు’లోని అన్ని పాటలూ ఆయన కలం నుండి జాలువారినవే. అందులోని “కనుపాప కరవైన కనులెందుకు…” పాట ఇప్పటికీ మనసులు తడి చేస్తూనే ఉంది. యన్టీఆర్ ‘రేచుక్క’లోని “బలే బలే పావురామ…” పాట సైతం ఆకట్టుకుంది. ‘జయభేరి’లోని “మది శారదాదేవి మందిరమే…”, “రాగమయీ రావే…” గీతాలు ఈ నాటికీ సంగీతప్రియులను పరవశింప చేస్తూనే ఉన్నాయి. ‘రహస్యం’లో్ని “తిరుమల గిరివాసా…దివ్యమందహాసా..”, “శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా…” పాటలు భక్తకోటికి పరమానందం పంచాయి. మల్లాది వారి కలం నుండి జాలువారిన గీతాల సంఖ్య తక్కువే కావచ్చు. కానీ, వాటిలోని సాహిత్య విలువలకు సాహితీప్రియులు నిత్యం జేజేలు పలుకుతూనే ఉన్నారు. అదీ మల్లాదివారి బాణీ… ఆయన పలికించిన వాణి!

Related Articles

Latest Articles

-Advertisement-