బండా ప్రకాష్ కు మరో పదవి ఇస్తారా…?

టీఆర్ఎస్‌లో చేరిన నాటి నుంచి అనూహ్యంగా పదవులు దక్కించుకుంటున్నారు బండ ప్రకాశ్‌. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ఆయన ఇప్పుడు ఎమ్మెల్సీ అయ్యారు. మరో కొత్త పదవి వరించబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇంతలోనే ఈక్వేషన్లు మారుతున్నట్టు చర్చలు ఊపందుకున్నాయి. ఎందుకలా? ఏంటా సమీకరణాలు?

బండ ప్రకాశ్‌కు మరో పదవి ఇస్తారని ప్రచారం..!

ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక అధికార టీఆర్ఎస్‌లో అందరినీ ఆశ్చర్య పరిచింది. ఖాళీ అయిన ఆరు స్థానాల్లో గుత్తా సుఖేందర్‌రెడ్డి, కడియం శ్రీహరిలకు మరోదఫా ఛాన్స్‌ దక్కగా.. మిగిలిన నలుగురు కొత్తవాళ్లే. వారిలో బండ ప్రకాశ్‌ రాజ్యసభ సభ్యుడు. ఎంపీగా ఇంకా పదవీకాలం ఉండగానే.. ఇప్పుడు ఎమ్మెల్సీని చేశారు. ఈ నిర్ణయం రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. కేవలం ఎమ్మెల్సీగానే ఉంచేయకుండా.. బండ ప్రకాశ్‌కు మరో పదవి ఇస్తారని గులాబీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కేబినెట్‌లోకి తీసుకుంటారని నిన్న మొన్నటి వరకు అనుకున్నా.. ఇప్పుడు కొత్త సమీకరణాలు తెరపైకి వస్తున్నాయని టాక్‌. దానిపైనే చెవులు కొరుక్కుంటున్నాయి పార్టీ వర్గాలు.

రాజ్యసభ పదవీకాలం ముగియకుండానే ఎమ్మెల్సీని చేశారు..!

ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు చెందిన బండ ప్రకాశ్‌ కాంగ్రెస్‌ నుంచి టీఆర్‌ఎస్‌లోకి వచ్చారు. ముదిరాజ్‌ సామాజికవర్గం. గులాబీ కండువా కప్పుకొగానే టీఆర్ఎస్‌ జనరల్‌ సెక్రటరీగా అవకాశం ఇచ్చారు. ఆ వెనువెంటనే రాజ్యసభ ఎంపీగా ఛాన్స్‌ కల్పించడంతో అప్పట్లోనే టీఆర్ఎస్‌తోపాటు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌ అయింది. స్వయంగా బండ ప్రకాశ్‌ సైతం ఆశ్చర్యపోయారు. ఆ సర్‌ప్రైజ్‌ నుంచి ఆయన ఇంకా తేరుకున్నారో లేదో కానీ.. ఆ పదవీకాలం ముగియకుండానే ఇప్పుడు ఎమ్మెల్సీని చేశారు సీఎం కేసీఆర్‌.

కేబినెట్‌లోకి తీసుకుంటారని చర్చ..!
మండలి డిప్యూటీ ఛైర్మన్‌ పదవికీ పరిశీలిస్తున్నారా?

ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వడానికి ముందు బండ ప్రకాశ్‌తో సీఎం కేసీఆర్‌ మాట్లాడినట్టు పార్టీ వర్గాల టాక్‌. రాష్ట్రంలో నీ అవసరం ఉంది.. నీకు ఇష్టమైతేనే ఎమ్మెల్సీగా రావాలని ప్రకాశ్‌ను కేసీఆర్ కోరినట్టు సమాచారం. రాష్ట్రంలో అవసరం అంటే కేబినెట్‌లోకి తీసుకుంటారని అనుకున్నారు. అయితే ప్రకాష్ సామాజికవర్గం, జిల్లా సమీకరణాలు ఎంతవరకు ఆయనకు కలిసి వస్తాయన్నది ఇప్పుడు ప్రశ్న. తెలంగాణ శాసన మండలిలో ఛైర్మన్‌, డిప్యూటీ ఛైర్మన్‌ పదవులు ఖాళీగా ఉన్నాయి. వాటిల్లో డిప్యూటీ ఛైర్మన్‌ పదవికి ఆయన పేరును పరిశీలించొచ్చని కొత్త చర్చ మొదలైంది.

సమీకరణాలు ఎక్కడ తేడా కొడుతున్నాయి?

మొదట్లో కేబినెట్‌లో చోటు కోసమే ఎమ్మెల్సీని చేశారని చర్చ జరిగితే.. సడెన్‌గా ఈ ట్విస్ట్‌ ఏంటని బండ ప్రకాశ్‌పై ఎవరికి తోచిన విధంగా వారు చర్చించుకుంటున్నారట. సమీకరణాలు ఎక్కడ తేడా కొడుతున్నాయి.. కొత్త చర్చలో నిజమెంతా అనేది ఆరా తీస్తున్నవారూ ఉన్నారు. మరి.. ఎమ్మెల్సీ తర్వాత ప్రకాశ్‌కు ఏ పదవి వరిస్తుందో చూడాలి.

Related Articles

Latest Articles