అఫ్ఘన్ ఇష్యూ అమెరికా ప్రతిష్టను దెబ్బతిస్తుందా?

అమెరికా పేరు చెబితేనే అదొక భూతలస్వర్గమని అని అందరూ చెబుతుంటారు. స్వేచ్ఛ, సమానత్వానికి అమెరికన్లు దిక్సూచిగా నిలుస్తుంటారు. శక్తి, సంపద, రక్షణ వ్యవస్థ వంటి విషయాల్లో అమెరికా అన్ని దేశాల కంటే ముందంజలో ఉంటుంది. దీంతో అమెరికాకు ప్రపంచ పెద్దన్న పాత్ర పోషించే అవకాశాన్ని ప్రపంచ దేశాలిచ్చాయి. అయితే ఇటీవల కాలంలో అమెరికా అవలంభిస్తున్న తీరుతో ఆదేశ ప్రతిష్ట మసకబారుతోంది. దీంతో అమెరికాకు ప్రపంచాన్ని లీడ్ చేసే అవకాశం లేదని ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి.

ముఖ్యంగా అప్ఘనిస్తాన్ నుంచి అమెరికా బలగాల ఉపసంహరణ అమెరికా ప్రతిష్టను దెబ్బతీసింది. అమెరికా కారణంగానే తాలిబన్లు అప్ఘనిస్తాన్ ను ఆక్రమించారనే విమర్శలు ప్రపంచ దేశాల నుంచి విన్పిస్తున్నాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గతంలో ‘అమెరికా ఫస్ట్’ అనే నినాదంతో ప్రపంచాన్ని వదిలేశారు. ఆయన స్థానంలో వచ్చిన జో బైడెన్ సైతం ప్రపంచ దేశాల సంగతి మాకేందుకు అంటూ తమ సైన్యాన్ని ఉన్నఫళంగా వెనక్కి రప్పిస్తున్నాడు. ట్రంప్ పాలనలో విసిగిపోయిన అమెరికా ప్రజలకు, విదేశీప్రతినిధులకు బైడెన్ గెలుపు ఊరటనిచ్చింది. అయితే బైడెన్ సైతం ట్రంప్ మాదిరిగానే వ్యవహరిస్తుండటంతో అమెరికన్ల పరిస్థితి పెనం నుంచి పోయ్యిలో పడిన చందంగా మారింది. అమెరికా అధ్యక్షుడు బైడెన్ తీసుకుంటున్న నిర్ణయాలతో తమ అంచనాలు తప్పాయంటూ సాక్ష్యాత్తు స్వీడన్ మాజీ ప్రధాని కార్ల్ బిల్డ్ వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

అఫ్గన్లో తాలిబన్లకు అమెరికా అవకాశం కల్పించేలా వ్యవహారించడంపై ప్రపంచ దేశాలు మండిపడుతున్నారు. స్వీడన్, ఫ్రాన్స్, జర్మనీ, చెక్ రిపబ్లికన్ తోపాటు చాలాదేశాలు అమెరికాను బహిరంగగానే తప్పుబడుతున్నాయి. ఇప్పటివరకు ప్రపంచ పెద్దన్న పాత్ర పోషిస్తున్న అమెరికా ఇప్పుడు తప్పుడు నిర్ణయాలు తన ప్రతిష్ఠను తానే దిగజార్చుకుంటుందని మండిపడుతున్నారు.రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అప్ఘానిస్తాన్లో యుద్ధం కోసం జర్మనీ బలగాలు అక్కడికి వెళ్లాయని గుర్తుచేస్తున్నారు. ఇప్పటి వరకు తిరుగులేకుండా అక్కడ ఉండేవాళ్లు. కానీ అమెరికా నిర్ణయంతో మోహం చాటేసుకొని రావాల్సి వచ్చిందని జర్మనీ నేతలు అంటున్నారు. నాటో స్థాపించినప్పటి నుంచి చూస్తే అప్ఘనిస్తాన్ నుంచి అమెరికా దళాలు వైదొలగడం అతిపెద్ద ఓటమని జర్మనీ చాన్స్ లర్ కు పోటీ చేస్తున్న ఆర్మిన్ లాస్చెట్ అన్నారు. ప్రపంచానికి నాయకత్వం అమెరికా చేజార్చుకుందని చెక్ రిపబ్లిక్ అధ్యక్షుడు మిలోస్ జెమాన్ సైతం సంచలన వ్యాఖ్యలు చేశారు.

ప్రపంచ వ్యవహారాల్లో సరైన రీతిలో వ్యవహరించే విషయంలో గత సంవత్సరం ప్యూ రీసెర్చ్ సెంటర్ నిర్వహించిన సర్వేలో ట్రంప్ పై 10 శాతం నమ్మకం ఉంటే బైడెన్ పట్ల 79 శాతం ఉన్నట్లు తేలింది. అయితే క్రమంగా అమెరికా తీసుకుంటున్న నిర్ణయాలతో చాలా యూరోప్ దేశాలు ఈ సర్వేను తిరస్కరిస్తున్నాయి. ట్రంప్ పదవి నుంచి వైదొలిగితే తమకు పాతరోజులు వస్తాయని భావించామని.. కానీ ఇక పాత రోజులు రావనే భావనను యూరోపియన్ దేశాలు వ్యక్తం చేస్తున్నాయి.

అమెరికా నిర్లక్ష్యం కారణంగా ప్రపంచానికి ఉగ్రవాదం పెనుసవాలుగా మారుతుందని ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇలాంటి తరుణంలో అమెరికా ఉగ్రవాదులకు అవకాశం కల్పించేలా వ్యవహారిస్తుందని అన్ని దేశాలు నిలదీస్తున్నాయి. అమెరికా ప్రపంచ దేశాలతో స్నేహభావం మరిచిపోతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో బైడెన్ పై ఉన్న నమ్మకం రోజురోజుకు సన్నగిల్లుతుందని యూరోపియన్ దేశాలు స్పష్టం చేస్తున్నాయి. అప్ఘన్లో అమెరికా వ్యవహరించిన తీరుతో ఇప్పటివవరకు అమెరికాకు దగ్గరైన యూరోపియన్ యూనియన్ దేశాలు క్రమంగా దూరంగా జరుగుతున్నాయి. దీంతో అమెరికా ఇప్పుడు ప్రపంచ పెద్దన్నగా ఉండే అర్హత లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Related Articles

Latest Articles

-Advertisement-