తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు మారనున్నాడా..?

హుజురాబాద్‌ ఉప ఎన్నిక తరువాత ఒక్కసారి తెలంగాణాలో రాజకీయ సమీకరణాలు మారాయి. దుబ్బాక ఉప ఎన్నికతో టీఆర్‌ఎస్‌ అలర్ట్‌ అయినా జీహెచ్‌ఎంసీ ఎన్నికలు వచ్చేసరికి జరగాల్సిన నష్టం టీఆర్‌ఎస్‌ జరిగింది. దుబ్బాక ఎన్నికతో ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవడంతో జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు సింహభాగాన గెలిచి మళ్లీ హైదరాబాద్‌ పీఠంపై గులాబీ జెండాను ఎగరవేశారు. అయితే ఆ తరువాత జరిగిన హుజురాబాద్‌ ఉప ఎన్నిక ఈటల రాజేందర్‌తో పోటీ కారణంగా ప్రత్యేకతను సంతరించుకుంది.

హుజురాబాద్‌ లో గెలిచేందుకు అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టినా ఈటల రాజేందర్‌ను ప్రజలు గెలిపించారు. హుజురాబాద్‌ ఉప ఎన్నిక మునుపెన్నడూ చూడనటువంటి ఎన్నికని రాజకీయ విశ్లేషకులు భావించారు. అయితే అనుకున్నట్టుగానే ఈటల గెలుపుతో తెలంగాణ రాజకీయాల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చలు నడుస్తున్నాయి. ఈటల గెలుపు తరువాత బీజేపీకి సీఎం అభ్యర్థి దొరికారనే ప్రచారం కూడా జరిగింది. తాజాగా ఈటల రాజేందర్‌ కూడా అందుకు తగ్గట్టుగానే పావులు కదుపుతున్నారు. ఇదిలా ఉంటే.. బీజేపీ పార్టీలో ముసలం పుట్టిందని.. కొన్ని రోజుల్లో తెలంగాణ బీజేపీ అభ్యర్థిని మారుస్తారంటూ టీఆర్‌ఎస్‌ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ మాటలకు ఈటల రాజేందర్‌ చెప్తున్న విషయానికి సంబంధం లేకుండా పోయిందని, త్వరలోనే బీజేపీ అధ్యక్షుడిని మారుస్తారంటూ కరీంనగర్‌ మేయర్‌ సునీల్‌ రావు చేసిన వ్యాఖ్యలు దీనికి ఆజ్యం పోస్తున్నాయి. బీజేపీలో బండిపై విముఖతతో ఉన్న కొందరినీ తనవైపు తిప్పుకునేందుకు ఈటల ప్రయత్నిస్తున్నారని వార్తలూ వినిపిస్తున్నాయి. తెలంగాణ బీజేపీలోని ముఖ్యనేతలు, కార్యకర్తలను తనవైపుకు తిప్పుకొని హైకమాండ్‌ దృష్టిలో పడి తెలంగాణ బీజేపీ అధ్యక్షపీఠాన్ని ఎక్కేందుకు ఈటల వ్యూహం రచిస్తున్నారని టీఆర్‌ఎస్‌ నేతలు కోడై కూస్తున్నారు. దీనిపై బీజేపీ శ్రేణులు ఏవిధంగా స్పందిస్తారో చూడాలి మరి.

Related Articles

Latest Articles