తెలంగాణలో ‘పీకే’ సత్తా చూపించగలడా?

రాజకీయాలు నిత్యం ఫాలో అయ్యేవారికి ప్రశాంత్ కిషోర్(పీకే) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాజకీయ వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ కు దేశంలో మంచి పేరుంది. ఆయన ఏ పార్టీకి వ్యూహాకర్తగా ఉంటే ఆపార్టీనే అధికారంలోకి వస్తుందనే నమ్మకం ప్రజల్లోకి బలంగా వెళ్లిందంటే పీకే సత్తా ఏంటో అర్థం చేసుకోవచ్చు. అందుకు తగ్గట్టుగానే ప్రశాంత్ కిషోర్ సక్సస్ రేటు కూడా భారీగా పెరుగుతూ పోతుంది. ఒకటి అర విషయాల్లో మినహాయిస్తే ఆయన వ్యూహాకర్తగా ఉన్న పార్టీలు అధికారంలోకి రావడమో లేదంటే తిరిగి నిలబెట్టుకోవడమో చేస్తున్నాయి.

బీహార్ కు చెందిన ప్రశాంత్ కిషోర్ తెలుగు ప్రజలకు కూడా సుపరిచితమే. ఏపీలో జరిగిన గత సార్వత్రిక ఎన్నికల్లో పీకే టీం వైసీపీ తరుఫున పని చేసింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా సలహాలు, సూచనలు అందించడంలో కీలక పాత్ర పోషించారు. ప్రతిపక్ష వ్యూహాలను తిప్పికొట్టడంలో పీకే టీం బలంగా పని చేసింది. గత ఎన్నికల్లో ఫ్యాన్ గాలి జోరుగా వీయడంతో వైసీపీ ప్రభంజనం సృష్టించింది. దీంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత పీకే టీం అక్కడి నుంచి వెనుదిరిగింది.

అవసరమైనప్పుడు మాత్రమే పీకే టీం రంగంలోకి దిగి సీఎం జగన్మోహన్ రెడ్డికి సహకారం అందిస్తుంది. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి రాజకీయ వ్యూహకర్తగా పీకేనే ఉండనున్నారు. ఈమేరకు సీఎం జగన్మోహన్ రెడ్డి పలు సందర్భాల్లో ఆపార్టీ నేతలకు హింట్ ఇచ్చారు. ఇటీవల ఏపీ క్యాబినెట్ సమావేశాల్లో ఆయన మంత్రులతో ఈ ప్రస్తావన చేసినట్లు వార్తలు వచ్చాయి. త్వరలోనే పీకే టీం రంగంలోకి దిగుతుందని వారితో కలిసి పని చేయాలని సూచించినట్లు ఆదేశించారు. ఇదిలా ఉంటే పీకే టీంకు తెలంగాణ ఎన్నికలు పరీక్షగా మారబోతున్నాయి.

ఏపీ ఎన్నికల తర్వాత ప్రశాంత్ కిషోర్ ఢిల్లీ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో వ్యూహాకర్తగా పని చేశారు. ఢిల్లీలో కేజ్రీవాల్ కు, తమిళనాడులో స్టాలీన్ కు, పశ్చిమబెంగాల్లో మమత బెనర్జీ తరుఫున రాజకీయ వ్యూహాలు అమలు చేశారు. ప్రతిపక్షాల ఎత్తులను చిత్తుచేస్తూ ఆయన వ్యూహాకర్తగా ఉన్న పార్టీలను అధికారంలోకి తీసుకురాగలిగారు. ముఖ్యంగా పశ్చిమబెంగాల్లో మమతపై ఉన్న వ్యతిరేకతను పక్కకు నెట్టి తృణమూల్ కాంగ్రెస్ ను అధికారంలోకి తేవడంలో ఆయన వ్యూహాలు బాగా పని చేశాయి. దీంతో పీకేపై అందరికీ గురి కుదిరింది.

తెలంగాణలో వైఎస్ఆర్టీపీ తరుఫున పీకే వ్యూహాకర్తగా వ్యవహారిస్తున్నారు. ఆయన టీం వైఎస్ షర్మిలకు సలహాలు, సూచనలు ఇస్తుంది. ఈనెల 20న నుంచి షర్మిల పాదయాత్ర తెలంగాణలో మొదలుకానుంది. ఆమె వెంట పీకే టీం నడువబోతుంది. అయితే తెలంగాణలో వైఎస్ఆర్టీని అధికారంలోకి తీసుకురావడం అనేది పీకే సామర్థ్యానికి పరీక్షగా మారబోతుంది. తెలంగాణలో సీఎం కేసీఆర్ బలమైన నేతగా ఉన్నారు. కేసీఆర్ వ్యూహాలు ముందు మహామహా నేతలే కుదేలవుతుంటారు. అలాంటి పీకే ఆయన్ను తట్టుకోగలరా? అన్న సందేహాలు కలుగుతున్నాయి.

మరోవైపు టీఆర్ఎస్ కు ధీటుగా బీజేపీ, కాంగ్రెస్ పోటీపడుతున్నారు. ప్రస్తుతం ఈ రెండు పార్టీలు రెండో స్థానం కోసం కుస్తీలు పడుతున్నాయి. ఏ అవకాశం దొరికినా అధికారంలోకి వచ్చేందుకు ఈ రెండు పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక వైఎస్ షర్మిల ఇప్పుడిప్పుడే తెలంగాణలో తనకంటూ ఓ బలం ఏర్పరుచుకుంటోంది. ఆమెను తెలంగాణ ప్రజలు రాజన్న కూతురిగా ఆదరిస్తున్నారు. అయితే ఆమె ఏపీ మూలాలున్న వ్యక్తిగా ఆమెను ప్రతిపక్షాలు ఫోకస్ చేస్తుండటం ఆపార్టీకి మైనస్ గా మారుతోంది.

ఈ వ్యతిరేకతను షర్మిల ఎలా అధిగమిస్తుందనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఆపార్టీని అధికారంలోకి తీసుకురావడానికి పీకే టీం ఎలా వ్యూహాలు అవలంభిస్తుందనేది ఆసక్తిని రేపుతోంది. ఇప్పుడిప్పుడే తెలంగాణలో ఎదుగుతున్న షర్మిల పార్టీకి పీకే టీం ఎన్ని సీట్లు వచ్చేలా చేస్తుందనేది ఉత్కంఠగా మారింది. వైఎస్ఆర్టీపీ అధికారంలోకి రావడం ఏమోగానీ ఆ పార్టీకి తెలంగాణలో కొన్ని సీట్లు వచ్చేలా చేసినా పీకే వ్యూహాలు ఫలించినట్లే అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మరీ పీకే టీం షర్మిలకు ఎలాంటి విజయాన్ని కట్టబెడుతుందో వేచిచూడాల్సిందే..!

-Advertisement-తెలంగాణలో ‘పీకే’ సత్తా చూపించగలడా?

Related Articles

Latest Articles