హుజురాబాద్ ప్రచారానికి జాతీయ నాయకులు వస్తారా.?

హుజురాబాద్‌లో బీజేపీ తరఫున ప్రచారానికి జాతీయ నాయకులు వస్తారా.. లేదా? EC ఆంక్షలు చూశాక కమలనాథులు మార్చిన వ్యూహం ఏంటి? అనుకున్నదొక్కటీ.. అయ్యిందొక్కటా? బీజేపీ శిబిరంలో జరుగుతున్న చర్చ ఏంటి?

బీజేపీ నేతల దూకుడికి ఈసీ ఆంక్షలు బ్రేక్‌..!

ఉపఎన్నిక షెడ్యూల్‌ రాకమునుపే హుజురాబాద్‌లో ప్రచారం ప్రారంభించింది బీజేపీ. నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగిశాక.. ప్రచారాన్ని మరో అంకానికి తీసుకెళ్లే పనుల్లో ఉన్నారు కమలనాథులు. రాష్ట్రస్థాయి నాయకులు.. సీనియర్‌ నేతలు.. పార్టీ కేడర్‌ ఇప్పటికే నియోజకవర్గంలో మోహరించాయి. వీటన్నింటికీ తోడుగా జాతీయ నాయకులు, కేంద్రమంత్రులను హుజురాబాద్‌కు తీసుకొచ్చి ప్రచారం చేయించాలని ప్రణాళికలు వేసుకుంది బీజేపీ. సెప్టెంబర్‌ 17 నిర్మల్‌ సభతో శ్రేణుల్లో కొంత ఊపు వచ్చిందని.. ఇప్పుడు ఢిల్లీ నేతలు వస్తే ఇంకా హుషారు వస్తుందని అనుకున్నారు. కానీ.. కమలనాథుల దూకుడికి బ్రేక్‌లు వేసింది కేంద్ర ఎన్నికల సంఘం. కరోనాను దృష్టిలో పెట్టుకుని ప్రచారానికి కఠిన ఆంక్షలు పెట్టింది ఈసీ. అవి చూశాక కాషాయ శిబిరం కాస్త నిరుత్సాహ పడిందట.

వెయ్యి మందితో ఢిల్లీ నేతల సభలంటే తేలిపోతాయా?

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా మొదలుకొని.. పలువురు కేంద్రమంత్రులు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేసీ నడ్డాను తీసుకురావాలని పార్టీలో పెద్ద చర్చ జరిగిందట. వీరంతా వస్తే బీజేపీ ప్రచారం తారాస్థాయికి చేరుకుంటుందని లెక్కలేసుకున్నారు నాయకులు. కానీ.. ఈసీ ఆంక్షల వల్ల ఢిల్లీ పెద్దలు వచ్చే పరిస్థితి లేదట. బండి సంజయ్‌ ప్రజా సంగ్రామ యాత్రను మొదటి విడత ముగింపు సభను హుజురాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించాలని అనుకున్నా.. అప్పటికే ఉపఎన్నిక షెడ్యూల్‌ రావడంతో వేదికను హుస్నాబాద్‌కు మార్చుకున్నారు. EC ఆంక్షల ప్రకారం.. వెయ్యి మందితోనే సభలు పెట్టుకోవాలి. రోడ్‌ షోలకు అనుమతి లేదు. ఢిల్లీ స్థాయిలో పార్టీ నేతలు ప్రచారానికి వస్తే.. భారీగా జనసమీకరణ చేస్తారు. కానీ.. ఇప్పుడా పరిస్థితి లేదు. భారీ జన సమీకరణ లేకుండా.. వారి ప్రచారం పేలవంగా సాగితే అది ప్రతికూల ప్రభావం పడుతుందని బీజేపీ నేతలు ఆందోళన చెందుతున్నారట.

రోడ్‌ షోలకు అనుమతి లేకపోవడంతో జాతీయ నేతలు రాకపోవచ్చు..!

ఎన్నికల ప్రచారంలో బీజేపీ జాతీయ నేతలతోపాటు.. అమిత్‌షా వంటి వారు రోడ్‌ షోలకు ప్రాధాన్యం ఇస్తారు. ఇప్పుడు రోడ్‌ షోలకే అనుమతి లేకపోవడంతో.. హస్తిన నుంచి నేతల రాకపోకలు ఉండొచ్చని టాక్‌. ఇప్పుడు ప్రచార బాధ్యతంతా తెలంగాణ బీజేపీ నేతలదే. అందుకే EC ఆంక్షలకు లోబడి ప్రచారం ఎలా చేయాలి? ఓటర్ల అటెన్షన్‌ తీసుకొచ్చేలా ప్రచారం ఉండాలంటే ఎలా? అనేదానిపై నాయకులు కుస్తీ పడుతున్నారట. ఇది ఒక్క బీజేపీకి వచ్చిన సంకటమే కాదు.. కాంగ్రెస్‌దీ అదే పరిస్థితి. అధికార టీఆర్ఎస్‌కూ ఇబ్బందే. ఒకవేళ కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లలో వేటికైనా భారీ బహిరంగ సభకు EC అనుమతిస్తే.. వెంటనే బీజేపీ నుంచి జాతీయ నేతలను రంగంలోకి దించాలనే యోచన ఉందట.

మాటలతోనే ప్రచార వేడి రగిలిస్తారా?

ఆర్భాటపు ప్రచారానికి అవకాశం లేకపోవడంతో.. మాటలతోనే ఉపఎన్నికల వేడి రగిలించేందకు దృష్టి పెట్టినట్టు సమాచారం. రాజకీయంగా, అభివృద్ధి పరంగా.. స్థానికంగా సమస్యలేంటి? వాటిని ఏ విధంగా ప్రచారంలోకి తీసుకురావాలి? అనేదానిపై ఒకింత కసరత్తు చేస్తున్నారట. మరి.. కమలనాథుల ప్లాన్‌ ఏ మేరకు వర్కవుట్‌ అవుతుందో చూడాలి.

-Advertisement-హుజురాబాద్ ప్రచారానికి  జాతీయ నాయకులు వస్తారా.?

Related Articles

Latest Articles