టీఆర్‌ఎస్‌లో ఆ సీనియర్ నేతకు మళ్ళీ పదవీయోగం ఉందా…?

టీఆర్‌ఎస్‌లోని ఆ సీనియర్ నేతకు మళ్లీ పదవీయోగం ఉందా? ఎమ్మెల్సీగా మరోసారి అవకాశం దక్కించుకుంటారా? ప్రస్తుతం రాజకీయ ప్రత్యర్థులపై ఆయన ఫైర్‌ కావడం వెనక కారణం అదేనా? ఎమ్మెల్సీ పదవిపై అధిష్ఠానం హామీ దక్కిందా లేదా?

కడియం శ్రీహరికి మరోసారి ఎమ్మెల్సీ ఇస్తారా?

తెలంగాణ శాసనమండలిలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు ఆరు ఖాళీ అయ్యాయి. షెడ్యులు ప్రకారం ఇదే నెలలో ఎన్నికలు జరగాల్సి ఉన్నా కరోనా కారణంగా కేంద్ర ఎన్నికల సంఘం వాయిదా వేసింది. ఈ కోటాలో గతంలో ఎమ్మెల్సీలుగా ఎన్నికై పదవీకాలం ముగిసిన నాయకుల్లో మాజీ డిప్యూటీ సీఎం.. టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు కడియం శ్రీహరి కూడా ఉన్నారు. దీంతో ఆయనకు మరోసారి ఎమ్మెల్సీ పదవీయోగం ఉందా లేదా అని గులాబీ శిబిరంలో చర్చ జరుగుతోంది. ఆయనకు ఉన్న ప్లస్సు మైనస్సులపై ఎవరు ఈక్వేషన్లు వారు వేసుకుంటున్నారట.

ప్రస్తుతం కడియం చేతిలో ఎలాంటి పదవి లేదు

2014 సార్వత్రిక ఎన్నికల్లో వరంగల్ లోక్‌సభ స్థానం నుంచి పోటి చేసి ఎంపీగా ఎన్నికయ్యారు కడియం శ్రీహరి. అయితే అనూహ్య రాజకీయ పరిణామాలతో ఎంపీ పదవికి ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ వెనువెంటనే డిప్యూటీ సీఎంగా అనుకోని పదవి వరించింది. ఎమ్మెల్సీగా శాసనమండలిలో అడుగుపెట్టారు శ్రీహరి. టీఆర్‌ఎస్‌ రెండోసారి అధికారంలోకి వచ్చాక కేబినెట్‌లో చోటు దక్కలేదు. దాంతో ఎమ్మెల్సీగానే ఉండిపోయారాయన. ఇప్పుడు చేతిలో ఎలాంటి పదవి లేదు. అధిష్ఠానం ఫ్రేమ్‌లో ఉన్నారో లేదో కూడా తెలియదు. ఒకవేళ పార్టీ పెద్దల దృష్టిలో ఉన్నట్టయితే మళ్లీ ఎమ్మెల్సీని చేస్తారా లేదా అన్న ప్రశ్నలు పార్టీ సర్కిళ్లలో వినిపిస్తున్నాయి.

గవర్నర్‌ కోటాతో కలిసి ఏడు స్థానాల కోసం నేతల లాబీయింగ్‌

ప్రస్తుతం తెలంగాణ శాసనమండలిలో గవర్నర్‌ కోటాతో కలిపి ఏడు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి. వీటిల్లో టీఆర్‌ఎస్‌ ఎవరికి ఛాన్స్ ఇస్తుంది అన్నది ఉత్కంఠ రేపుతోంది. పార్టీలో చాలామంది ఆశావహులు ఉన్నారు. ఎవరిస్థాయిలో వారు లాబీయింగ్‌ చేస్తున్నారు కూడా. పార్టీ అవసరాలు, సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకుని ఎమ్మెల్సీలుగా అవకాశం ఇవ్వొచ్చన్న చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. పార్టీ నాయకత్వంపట్ల విధేయతతోపాటు పార్టీ భవిష్యత్ అవసరాలకు ఎంతవరకు ఉపయెగపడతారన్న అంశాలను వడపోస్తున్నట్టు తెలుస్తోంది. ఆ క్రమంలోనే కడియం పేరు చర్చకు వస్తోంది.

ఈటలపై విమర్శల దాడి పెంచిన కడియం

ప్రస్తుతం టీఆర్‌ఎస్‌లో ఈటల ఎపిసోడ్‌ సెగలు రేపుతోంది. ఈటలను విమర్శించడంలో నేతలు క్యూ కడుతున్నారు. ఈ జాబితాలో ఎమ్మెల్సీ పదవులు ఆశిస్తున్నవారు కూడా ఉన్నట్టు చెబుతున్నారు. ఇదే కోవలో కడియం శ్రీహరి సైతం ఈటలపై విమర్శలు ఎక్కుపెట్టడం ఆసక్తిగా మారింది. ఈటల కమ్యూనిస్ట్‌ కాదు ఫ్యూడలిస్ట్‌ అని ఆయన విరుచుకుపడ్డారు. సోషలిస్ట్‌ అంటూనే అక్రమాలకు పాల్పడ్డారని విమర్శల డోస్‌ కూడా పెంచారు. ఈ స్థాయిలో శ్రీహరి మాటల దాడి చేయడం వెనక కారణం ఏమై ఉంటుందా అని ఆరా తీసినవారు.. ఎమ్మెల్సీ పదవి దగ్గర ఆగుతున్నారట.

పార్టీ పెద్దల దృష్టిలో పడేందుకు నేతల ఫీట్లు

మొత్తానికి కూటి కోసం కోటి విద్యలన్నట్టు.. ఎమ్మెల్సీ పదవి కోసం.. అధిష్ఠానం దృష్టిలో పడేలా గులాబీ పార్టీ నాయకుల ఫీట్లు ఉన్నాయని కొందరి టాక్‌. మరి.. అంతిమంగా ఎవరికి పదవీయోగం ఉంటుందో.. ఎవరికి పిలుపు వస్తుందో చూడాలి.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-