బద్వేల్ పై జగన్ గురి.. ఆపార్టీల డిపాజిట్లు గల్లంతేనా?

కడప జిల్లాలోని బద్వేల్ ఉప ఎన్నికకు రోజులు దగ్గరపడుతున్నాయి. దీంతో అక్కడ రాజకీయవేడి రాజుకుంటోంది. ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి దాసరి సుధ గెలుపు లాంఛనమే అని అంతా భావిస్తున్నారు. అయినప్పటికీ  సీఎం జగన్మోహన్ రెడ్డి బద్వేల్ పై ప్రత్యేకంగా గురిపెట్టారు. వైసీపీకి వ్యతిరేకంగా పోటీ చేస్తున్న కాంగ్రెస్, బీజేపీలకు డిపాజిట్లు రాకుండా చూడాలని సీఎం జగన్మోహన్ రెడ్డి వైసీపీ శ్రేణులను ఆదేశించినట్లు తెలుస్తోంది. దీంతో ఈ ఉప ఎన్నికలో వైసీపీ ఏమేరకు మెజార్టీ సాధిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

బద్వేల్ ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య ఆకస్మిక మృతితో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆయన మృతి వైసీపీకి తీరనిలోటుగా మారింది. ఆ స్థానంలో ఆమె భార్య దాసరి సుధను ఎమ్మెల్యే అభ్యర్థిగా సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించారు. ఇప్పటికే ఆమె నామినేషన్ దాఖలు చేసి ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఆమెకు వైసీపీ శ్రేణులు అండగా నిలుస్తున్నాయి. ప్రజలు సైతం ఆమెకు నీరాజనాలు పడుతున్నారు. దీంతో ఆమెకు భారీ మెజార్టీ వచ్చే అవకాశం ఉందంటూ స్థానికంగా ప్రచారం జరుగుతోంది.

కడప జిల్లాలో వైసీపీ బలంగా ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి టీడీపీ మాత్రమే అంతో ఇంతో పోటీనిచ్చింది. మిగిలిన పార్టీలు అసలు లెక్కలోకి రాకుండా పోయాయి. అలాంటిది ఈ ఉప ఎన్నిక నుంచి టీడీపీ తప్పుకుంది. దీంతో వైసీపీ అభ్యర్థి గెలుపు మరింత ఈజీగా మారింది. బద్వేల్ నుంచి తొలుత జనసేన పోటీ నుంచి తప్పుకోగా ఆదారిలోనే టీడీపీ నడిచింది. అయితే జనసేన మిత్రపక్షం బీజేపీ పోటీలో నిలబడటం విశేషం. ఆపార్టీకి పెద్దగా బలం లేకపోయినా బద్వేల్ లో అభ్యర్థిని ప్రకటించి ప్రచారం చేస్తోంది.

కాంగ్రెస్ సైతం రేసులో ఉంది. రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ ఏపీలో తుడిచిపెట్టుకుపోయింది. అయినప్పటికీ ఆ పార్టీ ప్రతీ ఎన్నికలోనూ తన అదృష్టాన్ని పరిక్షించుకుంటోంది. అయితే ఈ రెండు పార్టీలకు తగిన గుణపాఠం చెప్పేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికను వైసీపీ నేతలు లైట్ తీసుకోవద్దని సీఎం జగన్ ఆదేశించినట్లు సమాచారం. ప్రతీరోజు బద్వేల్ నియోజకర్గ ఇన్ ఛార్జులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తూ సలహాలు, సూచలనలు చేస్తున్నారు. వారి నుంచి ఫీడ్ బ్యాక్ సైతం తీసుకుంటున్నారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, బద్వేల్ లో తాము ప్రారంభించిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లో చర్చ జరుగుతుందా? లేదో తెలుసుకుంటున్నారట. అలాగే పంచాయతీ, మండలాల నుంచి నేతల సహకారం ఎలా అందుతుందనే నివేదికలను సైతం సీఎం జగన్ తెప్పించుకుంటున్నారు. బద్వేల్ బాధ్యతను పూర్తిగా మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డికి అప్పగించారు. ఆయన తనకు నమ్మకమైన నేతలను మండల ఇన్ ఛార్జులుగా నియమించారు.

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు డిపాజిట్లు రాకుండా చేయాలని నేతలను ఆదేశించినట్లు తెలుస్తోంది. దీంతో ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు ఘోర పరాజయం తప్పదనే ప్రచారం స్థానికంగా జరుగుతోంది. దీంతో ఈ రెండు పార్టీలు ఏమేరకు వైసీపీకి పోటీ ఇస్తాయనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఈ ఈ రెండు పార్టీలు కనీసం డిపాజిట్లు దక్కించుకోని పరువు నిలుపుకుంటాయా లేదా అన్న చర్చ జోరుగా సాగుతోంది.

-Advertisement-బద్వేల్ పై జగన్ గురి.. ఆపార్టీల డిపాజిట్లు గల్లంతేనా?

Related Articles

Latest Articles