‘సోలో’గానే వస్తున్న జగన్.. ఆ సీన్ రిపీట్ కానుందా?

సీఎం జగన్మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు వెళుతారనే ప్రచారం ఏపీలో జోరుగా సాగుతోంది. అందుకు తగ్గట్టుగానే సీఎం జగన్ మంత్రులకు కీలక సూచనలు చేసినట్లు వార్తలు విన్పిస్తున్నాయి. ఈ పరిణామాలన్నింటినీ ప్రతిపక్ష పార్టీలు నిశితంగా గమనిస్తూనే తగిన వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఇదే సమయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు పొత్తులతో వెళుతారా? లేదంటే సోలోగానే ఎన్నికలకు వెళుతారా? అనే చర్చ ఏపీలో హాట్ టాపిక్ గా మారింది.

ఏపీలో ప్రాంతీయ పార్టీల హవానే కొనసాగుతోంది. వైసీపీ, టీడీపీ పార్టీలు గ్రామస్థాయి నుంచి బలంగా ఉన్నాయి. జనసేన ఇప్పుడిప్పుడే తన బలాన్ని పెంచుకుంటోంది. జాతీయ పార్టీలని చెప్పుకుంటున్న కాంగ్రెస్, బీజేపీ, సీపీఎంలు కనీసం గల్లీస్థాయి పోటీ కూడా ఇవ్వలేక చతికిలబడుతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఓ వెలుగువెలిగిన కాంగ్రెస్ రాష్ట్ర విభజనతో ఏపీలో మొత్తానికి మొత్తం తుడిచిపెట్టుకొని పోయింది. ఏపీ ప్రజలు దాదాపు ఆపార్టీని వెలివెసినట్లే కన్పిస్తుంది.

కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీలో కాంగ్రెస్ కు జీవం వచ్చే పరిస్థితి లేదు. దీంతో ఆపార్టీ పోటీలో ఉన్నా లేనట్లే లెక్క. బీజేపీ పరిస్థితి కూడా ఇంచుమించు అలాగే ఉంది. రాష్ట్ర విభజన తర్వాత కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. యూపీఏ సర్కారు రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి ఐదేళ్లు ప్రత్యేక హోదా ఇచ్చేందుకు సముఖత వ్యక్తం చేసింది. ఏపీకి జరుగుతున్న నష్టాన్ని భర్తీ చేసేలా పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. వాటన్నింటిని అమలు చేయాల్సిన బీజేపీ పుండు మీద కారం చల్లేలా వ్యవహరిస్తోంది.

విశాఖ స్టీట్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని తెరపైకి స్పెషల్ స్టేటస్ అంశాన్ని పక్కకు వెళ్లేలా చేసింది. పోలవరం నిధుల పెండింగ్ నిధులు విడుదల చేయడంలోనూ మీనమేషాలు లెక్కిస్తుంది. రైల్వే జోన్, ఇతర విషయాల్లో కేంద్రంలోని బీజేపీ ఏపీకి మొండిచేయి చూపిస్తోంది. దీంతో ఈ పార్టీని ప్రజలు ఆదరించేందుకు సిద్ధం లేరని తెలుస్తోంది. ఇక వైసీపీకి ఏపీలో అంతో ఇంతో పోటీనిచ్చే పార్టీలు ఏవైనా ఉన్నాయంటే టీడీపీ, జనసేన మాత్రమే.

నవ్యాంధ్రలో వైసీపీ కంటే ముందే టీడీపీ అధికారంలో ఉంది. గ్రామస్థాయిలోనూ టీడీపీ బలంగా ఉంది. అయితే ఇటీవల అధికారం కోల్పోవడంతో నేతలంతా వైసీపీలోకి క్యూ కడుతున్నారు. దీంతో పార్టీ క్రమంగా బలహీనపడుతోంది. ఇక జనసేన గత ఎన్నికల్లో ఒకే ఒక్క సీటు గెలుచుకుంది. ఆ ఎమ్మెల్యే సైతం జగన్ కే జై కొట్టారు. అయినప్పటికీ పవన్ కల్యాణ్ జనాల్లో ఉంటూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో జనసేన ఓ మోస్తారు ఫార్మెమెన్స్ చేసి భవిష్యత్ పై ఆశలను రేపింది.

టీడీపీ గత చరిత్ర చూసుకుంటే అన్న ఎన్టీఆర్ సమయంలో తప్ప ఎప్పుడూ కూడా ఒంటరిగా ఎన్నికలకు వెళ్లిన దాఖలాలు లేవు. చంద్రబాబు ప్రతీసారి ఏదోఒక పార్టీతో అంటకాగుతూనే బరిలో నిలుస్తూ వస్తున్నారు. అవసరానికి పొత్తు పెట్టుకొని ఆ తర్వాత హ్యండివ్వడం బాబుకు అలవాటుగా వస్తోంది. రాబోయే ఎన్నికల్లోనూ బాబు పొత్తులతోనే వెళ్లనున్నారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పటికే జనసేన, బీజేపీలను లైన్లో పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. మహాకూటమిని ఏర్పాటు చేసి సీఎం జగన్మోహన్ రెడ్డి ఢీకొట్టాలని చంద్రబాబు భావిస్తున్నారు.

సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం సింహం సింగిల్ అన్నట్లుగా ఒంటరిగానే బరిలో దిగబోతున్నారట. గత సార్వత్రిక ఎన్నికల్లోనూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోలోగానే ఎన్నికలకు వెళ్లి బంపర్ విక్టరీని సాధించారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక సంక్షేమంపైనే ప్రధానంగా ఫోకస్ పెట్టారు. ఈ పథకాలే తనను మరోసారి గెలిపిస్తాయని జగన్ భావిస్తున్నారు. గతంలో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టీడీపీ మహాకూటమిగా పోటీ చేసి ఓటమిపాలైంది.

నాడు రాజశేఖర్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలే ఆయనను మరోసారి సీఎం చేశాయి. జగన్ సైతం అదే ఫార్ములాను నమ్ముకున్నారు. దీంతో అప్పటి ఎన్నికల రిజల్టే మరోసారి రిపీట్ అవుతుందనే వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏదిఏమైనా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందస్తు వ్యూహం ఏపీలోని ప్రతిపక్ష పార్టీలకు నిద్రలేకుండా చేస్తున్నాయి. అందరు అనుకున్నట్లుగా సీఎం జగన్మోహన్ రెడ్డి ముందస్తుకు వెళితే ఏపీ ప్రజలు ఎలాంటి తీర్పునిస్తారనేది మాత్రం సస్పెన్స్ గా మారింది.

-Advertisement-‘సోలో’గానే వస్తున్న జగన్.. ఆ సీన్ రిపీట్ కానుందా?

Related Articles

Latest Articles