బీజేపీ సీఎంలని ఎందుకు మారుస్తోంది?

భారతీయ జనతా పార్టీలో ఇప్పుడు మోడీ శకం నడుస్తోంది. అయితే రాష్ట్ర స్థాయిలో పార్టీ కాస్త బలహీనంగా కనిపిస్తోంది. ప్రధాని మోడీ ప్రస్తుతం దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నేత. మరోవైపు, రాష్ట్రాలలో అధికారం నిలబెట్టుకోవడానికి కష్టపడాల్సి వస్తోంది. అందుకే ఇప్పుడు మోడీ, షా జోడీ వాటిపై ఫోకస్‌ పెట్టింది. రోగం ముదరకుండా జాగ్రత్త పడుతోంది. ఏకంగా ముఖ్యమంత్రులనే మారుస్తూ ట్రీట్‌మెంట్‌ మొదలు పెట్టింది.

మోడీ హయాంలో సీఎంల ఎంపిక తాజా రాజకీయ ట్రెండ్‌కు భిన్నం. ముఖ్యమంత్రి సెలక్షన్‌లో కులమే మెయిన్‌. దాని ఆధారంగానే పీఠం దక్కుతుంది. ఐతే, హర్యానా, జార్ఖండ్‌లో అందుకు బిన్నంగా జరిగింది. హర్యానాలో బలమైన జాట్‌ కులానికి సీఎం పదవి దక్కలేదు. అలాగే జార్ఖండ్‌లో గిరిజనేతరనుకి సీఎం చాన్స్‌ ఇచ్చారు. వారిద్దరూ ప్రధాని మోడీకి సన్నిహితులు.

హర్యానాలో అధికారం కోసం చిన్న ప్రాంతీయ పార్టీతో జతకట్టాల్సి వచ్చింది. అదే సంవత్సరం జరిగిన జార్ఖండ్‌ ఎన్నికల్లో బీజేపీ సీఎం రఘువర్‌ దాస్‌ ఘోర పరాజయం పాలయ్యారు. ఇవి ప్రమాద వశాత్తు జరిగినవి కావు. మోడీ శకంలో బీజేపీలో పెరుగుతున్న హైకమాండ్‌ కల్చర్‌ ఫలితం ఇది. రాష్ట్ర స్థాయిలో కూడా మోడీ నామ జపమే. ఆ పార్టీ భారీ ప్రచార యంత్రాంగం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల గొప్పతనాన్ని మోడీకి మాత్రమే ఆపాదిస్తూ వచ్చాయి. గతంలో వీటిలో కొన్నయినా సీఎంల ఖాతాల్లోకి వెళ్లేవి. ఇప్పుడు అదేమీ లేదు..అంతా మోడీలా ఉందనే భావన నెలకొంది.

అయితే మరి ఇప్పుడు బీజేపీ ఆ పద్దతిని వదులుకుంటుందా? అంటే అలా జరగకపోవచ్చు. ఎందుకంటే సెంట్రలైజేషన్‌ అనేది మోడీ, షా అధికారానికి సంబంధించిన ముఖ్య ప్రణాళిక. బిజెపిలోని వర్గ పోరును తగ్గించడానికి ఇది వీలు కల్పిస్తుంది. మరిరాష్ట్ర స్థాయిలో బలహీనతలను ఎలా అధిగమిస్తారు. దీనికోసం ఆ పార్టీ వ్యూహం మార్చింది. సంక్షేమ కార్యక్రమాల మీద ఆధారపడే సీఎంల వైపు చూడట్లేదు. ముస్లిం వ్యతిరేక వక్చాతుర్యం గల యోగి ఆదిత్యనాథ్‌ లాంటి వారికి దారులు తెరుస్తోంది. అస్సాంలో హిమంత బిస్వాస శర్మ కూడా ఈ కోవకే చెందుతాడు. మధ్యప్రదేశ్ లో శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ మోడీ ప్రధాని కాక ముందు సంక్షేమం కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరువయ్యారు. కాని ఇప్పుడు ఆయన ఆదిత్యానాథ్‌ తరహా ఇమేజ్‌ కోసం ప్రయత్నించాల్సి వస్తోంది.

ఉన్నట్టుండి గత శనివారం గుజరాత్‌ ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ తన పదవికి రాజీనామా చేశాడు. రెండో సారి ముఖ్యమంత్రిగా పూర్తి కాలం ముగియటానికి 14 నెలల ముందే ఆయన సీఎం పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది. 2016లో అప్పటి ముఖ్యమంత్రి ఆనందిబెన్‌ పటేల్‌ కూడా సరిగ్గా ఇప్పుడు రూపానీ ఉన్న స్థానంలో ఉంది. గుజరాత్ సీఎంగా ఆయన ఐదేళ్ల పాటు కొనసాగారు. అమిత్‌ షా మనిషిగా ఆయనకు పేరుంది.

రూపానీ రాజీనామాకు కారణాలేమిటన్నది చాలా ముఖ్యం. కోవిడ్‌ 19 సెకండ్‌ వేవ్‌ సంక్షోభాన్ని ఎదుర్కోవటంలో గుజరాత్‌ ప్రభుత్వ ఘోర వైఫల్యం వాటిలో ఒకటి. రూపానీ జైన్‌ కమ్యూనిటీకి చెందినవాడు. గత కొన్ని సంవత్సరాలుగా ఆయన గుజరాత్ రాజకీయాలలో అత్యంత వివాదాస్పద అంశాలను హ్యాండిల్‌ చేయటంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్ల కోసం పటిదార్లు ఉద్యమిస్తున్నారు. ప్రభుత్వంలో ప్రధాన పాత్ర తమదే ఉండాలంటున్నారు.

2014లో మోడీ ప్రధాని అయ్యాక ఆయన స్థానంలో ఆనందిబెన్‌ ని ముఖ్యమంత్రిని చేయటాన్ని ఎవరూ ఊహించలేదు. తరువాత మూడేళ్లకు అంటే 2017 అసెంబ్లీ ఎన్నికల ముందు ఆమెను సరిగ్గా ఈ కారణంతోనే తప్పించారు. పటీదారా్‌ ఉద్యమాన్ని హ్యాండిల్‌ చేయటంలో విఫలమయ్యారని బీజేపీ పెద్దలు ఆమెపై వేటు వేశారు. అయితే ఇప్పుడు రూపానీ స్థానంలో వచ్చే వారు పటీదార్‌ కమ్యూనిటీకి చెందినవారే అవుతారని దాదాపు అన్ని పార్టీల్లో చర్చ జరిగింది. ఉప ముఖ్యమంత్రి, మాస్‌ లీడర్ నితిన్‌ పటేల్‌ వంటి పెద్ద నేతలను కాకుండా మోడీ, షాలు భూపేంద్ర పటేల్‌ను ఎంపికచేశారు. ఈ ఎంపిక రాష్ట్ర-స్థాయి రాజకీయాలతో వ్యవహరించడానికి మోడీ-షా విధానంలోని కొన్ని అంశాలను పునరుద్ఘాటిస్తుంది. అదే సమయంలో ఈ సంవత్సరం చేసిన కొన్ని ప్రయోగాలను కూడా ఇది ప్రదర్శిస్తుంది.

వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మోడీ,షాలు ఆధిపత్య కులమైన పటీదార్ల డిమాండ్‌కు ఒప్పుకోవాల్సి వచ్చింది. 2019లో జార్ఖండ్‌లో మాదిరి సిట్టింగ్‌ సీఎంతో ఎన్నికలకు వెళ్లకుండా తాజా ముఖాన్ని ప్రజల ముందు పెట్టింది. బీజేపీ ఇలాంటి ప్రయోగాలు గత కొన్ని నెలల్లో నాలుగు రాష్ట్రాలలో చేసింది.
కోవిడ్‌ మహమ్మారితో ఆర్థిక వృద్ధి మందగించింది. అలాగే మహమ్మారిని ఎదుర్కోవటంలో వైఫల్యం అంశాలు వచ్చే ఎన్నికలపై చూపే ప్రభావాన్ని తగ్గించటానికి బీజేపీ చేస్తున్న ప్రయత్నాల్లో ఇది ఒకటి. రాష్ట్ర నాయకత్వాన్ని మార్చటం ద్వారా మోడీ తన ఇమేజ్‌ని నిలబెట్టుకునే అవకాశం దక్కుతుంది.

గుజరాత్‌ కొత్త సీఎం భూపేంద్ర సింగ్.. పటీదార్ సామాజికవర్గానికి చెందిన నేత. పటీదార్‌ కమ్యూనిటీకే చెందిన మాజీ సీఎం ఆనందీబెన్ పటేల్‌కు భూపేంద్ర సింగ్ సన్నిహితుడు. ఇక 2022 డిసెంబర్‌లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 182 నియోజకవర్గాలకు గాను 71 నియోజకవర్గాల్లో పటీదార్ ఓట్లే కీలకం. రాష్ట్ర జనాభాలో పటీదార్లు 15 శాతం ఉన్నారు. ఈ లెక్కలన్నిటిని దృష్టిలో పెట్టుకునే భూపేంద్ర పటేల్‌ను ఎంచుకోవచ్చు.

రూపానీ మాస్ లీడర్ కాదు. 2017లో రూపానీ సారధ్యంలో ఎన్నికలకు వెళితే 99 స్థానాలు వచ్చాయి. సాధారణ మెజార్టీ కన్నా ఏడే ఎక్కువ. 2012 కంటే 16 తక్కువ. ఇప్పుడు మరోసారి రూపానీతో ప్రయోగం చేసే పరిస్థితి లేదు. ఇప్పటి నుంచి 2024 వరకు మోదీ, షాల పరీక్షా సమయం. ప్రతి ఎన్నికా వారికి ఓ అగ్ని పరీక్షే. ఈ నేపథ్యంలో సొంత రాష్ట్రంలో పరిస్థితి అటు ఇటు అయితే దాని ప్రభావం దేశ వ్యాప్తంగా ఉంటుంది. పైగా గుజరాత్‌లో బీజేపీ 1998 నుంచి అధికారంలో ఉంది. ప్రజలు మార్పు కోరుకునే అవకాశం కూడా ఉంది. అందుకే 2022లో అసెంబ్లీ ఎన్నికల ముందు సీఎంను మారుస్తారన్న వార్తలు చాలా రోజులుగా వినిపిస్తున్నాయి. అయితే, గుజరాత్‌లో సీఎంగా ఎవరున్నా పెత్తనమంతా ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌ షాలదే అన్నది ఓపెన్‌ సీక్రెట్‌.

Related Articles

Latest Articles

-Advertisement-