వైవీ సుబ్బారెడ్డికి టిటిడి చైర్మన్‌ కుర్చీపై ఆసక్తి లేదా?

టిటిడి పాలకమండలి నియామకం ఎందుకు ఆలస్యమైంది? దాని వెనుక ఏదైనా కారణం ఉందా? చైర్మన్ గా వైవి సుబ్బారెడ్డి ప్రమాణస్వీకారం చేస్తారని ప్రచారం జరిగినా, ఎందుకు బ్రేక్ పడింది. కార్పొరేషన్ ల ప్రకటన రోజే…. టిటిడి అంశం కూడా తేలిపోతుందని భావించినా, అంచనాలు ఎందుకు తప్పాయి.

తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి నియామకం ఇవాళో రేపో అంటూ సోషల్ మీడియాలో ఊహాగానాలు చక్కర్లు కొడుతూ ఉంటే… ప్రభుత్వం మాత్రం పాలకమండలి నియామక ప్రకటన నిదానంగానే చేసే అవకాశం కనిపిస్తోంది. గత నెల 21వ తేదీకి వై వి సుబ్బారెడ్డి నేతృత్వంలోని పాలకమండలి గడువు ముగిసి పోయింది. దీంతో మరోసారి వై వి సుబ్బారెడ్డి నేతృత్వంలోనే పాలకమండలి ఏర్పాటవుతుందని భావించారు.

కానీ, చైర్మన్ హోదాపై వై.వి.సుబ్బారెడ్డి ఆసక్తి చూపకపోవడం…, ప్రత్యక్ష రాజకీయాల్లో చురుగ్గా ఉండేందుకు ధార్మిక సంస్థ పదవి అడ్డుగా ఉండటం వంటి అంశాలతో… సుబ్బారెడ్డి ఎంపీ పదవి పైనే ఆసక్తి చూపారని సమాచారం. దీంతో పాలకమండలి నియామకం మొదట్లో బ్రేక్ పడినా… ఆ తర్వాత తిరిగి సుబ్బారెడ్డిని చైర్మన్‌ గా, మరోసారి 37 మంది సభ్యులతో పాలకమండలి నియామకం జరుగుతుందని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఆదివారం రోజున వై.వి.సుబ్బారెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారన్న టాక్‌ కూడా నడిచింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్ చైర్మన్ ప్రకటనలు చేస్తున్న సమయంలోనే టీటీడీ చైర్మన్ పదవి కూడా ప్రకటిస్తారని భావించారు. వైవి వర్గియులు కూడా సోషియల్ మీడియాలో శుభాకాంక్షలు చెప్తూ పోస్టులు పెట్టేశారు.

కానీ, అందరి అంచనాలను తలకిందులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కార్పొరేషన్ చైర్మన్ పదవి ప్రకటనలతో సరిపెట్టింది. అదేరోజు టీటీడీ చైర్మన్ ప్రకటన మాత్రం రాలేదు.ఒకవైపు మహిళలకు పెద్దపీట వేస్తూ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ప్రాధాన్యత ఇస్తూ కార్పొరేషన్ చైర్మన్ ల ప్రకటన చేస్తూన్న సమయంలో టిటిడి పాలకమండలి ప్రకటన చేస్తే అందరి దృష్టి అటు వైపుకి మళ్లే అవకాశం ఉంది. టిటిడికి ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా అందరి దృష్టి పాలకమండలి వైపు మళ్లితే ప్రభుత్వం రెండేళ్లుగా చేస్తున్న కసరత్తు…. బూడిదలో పోసిన కన్నీరులా మారుతుందని ప్రభుత్వ పెద్దలు భావించినట్లు సమాచారం.

టిటిడికి పూర్తిస్థాయిలో పాలక మండలిని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అదేసమయంలో 37 మంది సభ్యుల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన వారికి కూడా అవకాశం కల్పించవలసి ఉంటుంది. అదే సమయంలో మహిళలకు 50 శాతం పదవులు కేటాయించే అవకాశం లేదు. ఎస్సీ ,ఎస్టీ, బీసీలకు పాలకమండలి లో పెద్దగా ప్రాతినిధ్యం ఉండే పరిస్థితి కూడా లేదనే చెప్పాలి. ఇవన్నీ కార్పొరేషన్ చైర్మన్ ల నియామకంలో ప్రభుత్వం పాటిస్తున్న జాగ్రత్తలను దెబ్బతీస్తుందని ప్రభుత్వం భావించినట్లు సమాచారం. దీంతో కార్పొరేషన్ చైర్మన్ ల హడావుడి ముగిసిన తర్వాత టిటిడి అంశం తెరపైకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-