వైఎస్ సంస్మరణ సభకు వెళ్లిన బీజేపీ నేతలను పార్టీ ఎందుకు ప్రశ్నించలేదు?

వైఎస్‌ఆర్‌ సంస్మరణ సభకు వెళ్లిన కాంగ్రెస్‌ నేతలపై ఆ పార్టీలో చర్చ.. రచ్చ జరుగుతోంది. సభకు హాజరైన బీజేపీ నేతలపై కాషాయ శిబిరంలో ఎలాంటి ఉలుకు.. పలుకు లేదు. కానీ.. సంస్మరణ సభకు వెళ్లినవారి తీరుపై మాత్రం ప్రైవేట్ సంభాషణల్లో గట్టిగానే చర్చ జరుగుతోంది. వాటిపైనే ఇప్పుడు ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు.

రాజకీయ భవిష్యత్‌ కోసం కర్చీఫ్‌ వేశారా?

హైదరాబాద్‌లో వైఎస్‌ఆర్‌ సంస్మరణ సభ ముగిసినా.. ఆ కార్యక్రమానికి వెళ్లిన వివిధ పార్టీల నేతలపై చర్చ మాత్రం ఆగడం లేదు. షర్మిల పార్టీ కోసమే సభ పెట్టారన్నది రాజకీయ పక్షాల అనుమానం. అందుకే కాంగ్రెస్‌ దూరంగా ఉంటే.. బీజేపీ చప్పుడు చేయలేదు. కానీ.. బీజేపీలో ఉంటూ.. కీలక బాధ్యతలు నిర్వహిస్తూ కూడా సంస్మరణ సభకు వెళ్లారు కొందరు కమలనాథులు. వారిపైనే ఇప్పుడు చర్చ మొదలైంది. రాజకీయ భవిష్యత్‌ కోసం.. ఆ కొందరు ముందు జాగ్రత్త పడ్డారనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

వైఎస్‌ఆర్‌ సంస్మరణ సభకు వెళ్లినా బీజేపీ పట్టించుకోలేదు!

బీజేపీ నేతలు, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్‌, గ్రేటర్‌ హైదరాబాద్‌ మాజీ మేయర్‌ బండ కార్తీక్‌రెడ్డి వైఎస్‌ఆర్‌ సంస్మరణ సభకు వెళ్లారు. కాంగ్రెస్‌ పార్టీలో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై జరిగినంత చర్చ బీజేపీలో వీళ్లపై జరగకపోయినా.. ఎందుకు వెళ్లారు అన్నదే ప్రశ్న. దీనిపై వారిని బీజేపీ పెద్దలు అడిగింది లేదు. వివరణ కోరిందీ లేదు. పైగా సభకు అంతగా రాజకీయ ప్రాధాన్యం లేదని చెబుతున్నారు. ఆ మీటింగ్‌కు వెళ్లిన వారంతా మరుసటి రోజు నుంచే బీజేపీ కార్యక్రమాల్లో మునిగిపోయారు. శ్రీశైలంగౌడ్‌.. సంగ్రామయాత్రలో తళుక్కుమంటే.. హుజురాబాద్‌ ప్రచారంలో కనిపించారు జితేందర్‌రెడ్డి.

బీజేపీ నేతల్లో కొత్త పోకడలేంటని కాషాయ దళంలో ప్రశ్నలు!

సీఎం కేసీఆర్‌ దళితుల అంశంపై అఖిలపక్ష మీటింగ్‌ పెడితే.. బీజేపీ నుంచి ఎవరూ వెళ్లకూడదని అనుకున్నా.. అప్పటికి బీజేపీలో ఉన్న మోత్కుపల్లి గీత దాటారు. దీనిపై బీజేపీలో చర్చ జరిగింది. ఇంతలో మోత్కుపల్లి బీజేపీని వదిలి వెళ్లిపోయారు. వైఎస్‌ఆర్‌ సంస్మరణ సభపై మాత్రం బీజేపీలో అలాంటి వాతావరణం కనిపించలేదు. రాజకీయ పార్టీ పరంగా షర్మిల పార్టీని బీజేపీ వ్యతిరేకిస్తోంది. సంస్మరణ సభ షర్మిల పార్టీకి లబ్ధి చేకూర్చడానికి పెట్టిందే అన్నది కమలనాథుల అనుమానం. అయినప్పటికీ ఎక్కడా ఓపెన్‌ కాలేదు. ఆ సంస్మరణ సభకు బీజేపీ నేతలు వెళ్లినా అభ్యంతరం చెప్పలేదు.. ప్రశ్నించలేదు. దీంతో బీజేపీకి ఏమైంది అని పార్టీ వర్గాలు ప్రశ్నిస్తున్నాయట. బీజేపీలో ఈ కొత్త పోకడలేంటని అంతర్గత సంభాషణల్లో నిలదీస్తున్నారట. పార్టీకి ఒక లైన్‌ అనేది లేకపోతే రానున్న రోజుల్లో ఇలాంటి పరిణామాలు కొత్త పుంతలు తొక్కుతాయని ఆందోళన చెందుతున్నారట.

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-