పవన్ ఒంటరి.. బీజేపీ స్పందన కరువైందే?

ఏపీలో ఇప్పుడు ఎక్కడ చూసినా పవన్ కల్యాణ్ నామస్మరణే మార్మోగిపోతుంది. సాయిధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరైన సంగతి తెల్సిందే. ఈ సందర్భంగా ఆయన వైసీపీ సర్కారుపై నిప్పులు చెరిగాడు. మీడియా చేస్తున్న అతి, సమాజంలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, సినిమా థియేటర్ల ఇబ్బందులు, నిర్మాతలు, సినీ కార్మికుల కష్టాలను ఏకరువు పెట్టారు. కాగా పవన్ కల్యాణ్ ఏపీ ప్రభుత్వంలోని పెద్దలపై  చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. దీంతో అసలు విషయం పక్కకు వెళ్లిపోయి పవన్ వర్సెస్ వైసీపీ అన్నట్లుగా సీన్ మారిపోయింది.

సినిమా సమస్యలపై ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వం చర్చలు జరిపింది.. వారి సమస్యలు పరిష్కారానికి కృషి చేయనున్నట్లు హామీ ఇచ్చింది. అయితే టికెట్ల ఆన్ లైన్ విధానం, టికెట్ల రేట్ల పెంపుపై సినీపెద్దలు కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం సైతం దీనిపై సీని పెద్దలకు క్లారిటీ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఆ సమయంలోనే మెగాస్టార్ చిరంజీవి సైతం ఇటీవల సినిమా వేడుకలో సినీ కార్మికుల కష్టాలు, నిర్మాతలు తదితర ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లే ప్రయత్నం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సినీ ఇండస్ట్రీని ఆదుకోవాల్సిన అవసరం ఉందని విజ్ఞప్తి చేశారు.

చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వం సీరియస్ గా చర్చిస్తున్న సమయంలో పవన్ కల్యాణ్ ‘రిపబ్లిక్’ సినిమా వేడుకలో వైసీపీ సర్కారును టార్గెట్ చేశారు. ఆయన పరుష పదజాలంతో ప్రభుత్వంలోని పెద్దలపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీంతో వైసీపీ నేతలు రంగంలోకి పవన్ కల్యాణ్ ఆరోపణలను తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. సినిమా ఇండస్ట్రీలోని వైసీపీ మద్దతుదారులు సైతం పవన్ పై వ్యక్తిగతంగా విమర్శలు చేశారు. దీంతో పవన్ కల్యాణ్ అభిమానులు, జనసేన నేతలు మాటలయుద్ధానికి దిగారు. దీంతో ఏపీలో ఇప్పుడు ఎక్కడ చూసిన వైసీపీ వర్సెస్ జనసేన అన్నట్లుగా పరిస్థితులు మారిపోయాయి.

ఇదిలా ఉంటే వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ముందే జనసేనతో బీజేపీ పొత్తుపెట్టుకుంది. ఈక్రమంలోనే ఈ రెండు పార్టీలు కలిసి కార్యాచరణ ప్రకటిస్తూ ముందుకెళుతున్నాయి. బీజేపీ నేతలు సైతం వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ యే తమ  సీఎం అభ్యర్థేనంటూ పలుమార్లు ప్రకటించిన సందర్భాలున్నాయి. అయితే తిరుపతి ఉప ఎన్నిక తర్వాత ఈ రెండు పార్టీల మధ్య కొంత గ్యాప్ వచ్చినట్లు కన్పిస్తోంది. ఉమ్మడి కార్యక్రమాలకు ఈ రెండు పార్టీలు స్వస్తి పలికాయి. ఎవరికీవారు తమ పార్టీ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయా? లేదా అన్న అనుమానాలు క్యాడర్లో వ్యక్తమవుతున్నాయి.

ఇలాంటి ప్రచారం నేపథ్యంలోనే ఏపీ బీజేపీ తాజాగా వ్యవహరిస్తున్న తీరు మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. బీజేపీ భాగస్వామిగా ఉన్న పవన్ కల్యాణ్ ను వైసీపీ నేతలు ఓ రేంజులో టార్గెట్ చేస్తున్నా కమలదళం మాత్రం పట్టించుకోవడం లేదు. రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు మినహా ఎవరూ పవన్ కల్యాణ్ కు మద్దతుగా ఇప్పటివరకూ స్పందించడం లేదు. సినిమా టికెట్లు ప్రభుత్వం అమ్మకం చేపట్టడంపై, సినీ ఇండస్ట్రీ సమస్యలపై ఏమాత్రం పెదవి విప్పడం లేదు. దీంతో బీజేపీ నేతలు ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారనే భావన ప్రజల్లోకి వెళుతోంది. మరోవైపు బీజేపీ-జనసేన కూటమి అభ్యర్థి బద్వేల్ ఉప ఎన్నికల్లో పోటీచేసినా అది పైకి మాత్రమేననని తెలుస్తోంది. దీంతో ఈ రెండు పార్టీలు అసెంబ్లీ ఎన్నికల నాటికి కలిసి పోటీ చేస్తాయా? లేదా అనేది సస్పెన్స్ గా మారింది.

-Advertisement-పవన్ ఒంటరి.. బీజేపీ స్పందన కరువైందే?

Related Articles

Latest Articles