విశాఖ జిల్లా నుంచి కొత్తగా మంత్రి అయ్యేది ఎవరు?

లెక్కలు తారుమారు అవుతున్నాయా? ఎన్నిక ఎన్నికకూ ఈక్వేషన్స్‌ మారుతున్నాయా? రేస్‌లో ముందున్నవారు.. తాజా లెక్కలతో తారుమారు అవుతారా? ఓటు బ్యాంక్‌ కోసం.. అధిష్ఠానం అదే ఊపులో వెళ్తే అమాత్య పదవిపై ఆశలుపెట్టుకున్న వారికి నిరాశ తప్పదా?

ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో కీలకంగా మారిన సమీకరణాలు..!

విశాఖజిల్లా అధికారపార్టీలో పొలిటికల్ హీట్ క్రమంగా పెరుగుతోంది. స్ధానిక సంస్ధల నుంచి ఎమ్మెల్సీ ఎన్నికల వరకు వైసీపీ నిర్ణయాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. సామాజిక న్యాయం ప్రధానాంశంగా ఇక్కడ పదవుల పంపకం చేస్తోంది వైసీపీ హైకమాండ్. టీడీపీని బలహీనపర్చడం.. సొంత ఓటు బ్యాంక్‌ పెంచుకోవడం.. స్థిరం చేసుకోవడం లక్ష్యంగా బీసీలకు పెద్దపీట వేస్తోంది. దీంతో పదవుల పందేరంలో వారికే అగ్రతాంబూలం దక్కుతోంది. ఈ సమీకరణాలే ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఖరారులోనూ కీలకంగా మారాయి.

యాదవ, వెలమ సామాజికవర్గాలకు ఎమ్మెల్సీ..!

విశాఖ జిల్లాలో యాదవ, వెలమ, గవర, మత్స్యకార, తూర్పుకాపు సామాజికవర్గాలు ప్రధానమైనవి. వైసీపీ మొదటి నుంచి యాదవ, వెలమ సామాజికవర్గాలపై ఎక్కువ ఫోకస్ పెట్టింది. చాలా నియోజకవర్గాల్లో ఫలితాలను ప్రభావితం చేసే సామర్ధ్యం వీరికి ఉండటం ఓ కారణం. ఇప్పుడు స్ధానిక సంస్ధల కోటాలో జిల్లాలో ఎన్నికలు జరుగుతున్న రెండు సీట్లను బీసీలకే కేటాయించింది వైసీపీ. యాదవ సామాజికవర్గం నుంచి వంశీకృష్ణ శ్రీనివాస్.. వెలమ సామాజికవర్గానికి చెందిన వరుదు కల్యాణికి అవకాశం కల్పించింది.

బీసీలలో యాదవులకు ఎక్కువ అవకాశాలు..!

అంతకుముందే విశాఖ మేయర్, డీసీఎంఎస్, వీఎంఆర్డీఏ చైర్మన్ పదవులను యాదవ సామాజికవర్గానికే కట్టబెట్టింది. కీలకమైన డీసీసీబీ పదవి వెలమలకు దక్కింది. అందుకే త్వరలో జరిగే మంత్రివర్గ విస్తరణలో జిల్లాలో సామాజిక ఈక్వేషన్స్‌ ఎలా ఉంటాయనేది అంతుచిక్కడం లేదట. ఇప్పటికే జిల్లాలో బీసీలకు ఎక్కువ పదవులు లభిస్తే.. వాటిలో ప్రధానంగా యాదవులకు ఎక్కువ అవకాశం ఇచ్చింది వైసీపీ.

మిగిలిన సామాజికవర్గాల్లో అసంతృప్తి నెలకొందా?

మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాల నాయుడు ప్రభుత్వ విప్‌గా ఉన్నారు. కేబినెట్ విస్తరణ జరిగితే జిల్లా నుంచి అవకాశం లభిస్తుందని ఆశిస్తున్న వారిలో ఎమ్మెల్యేలు ముత్యాలనాయుడు, గొల్ల బాబూరావు, గుడివాడ అమర్నాథ్, కరణం ధర్మశ్రీ పేర్లు గట్టిగానే వినిపిస్తున్నాయి. వీరిలో అమర్, ముత్యాల నాయుడు ముందువరసలో ఉంటారనేది పార్టీవర్గాల్లో జరుగుతున్న చర్చ. అయితే రెండు ఎమ్మెల్సీ స్ధానాలు బీసీలకే కేటాయించడంతో సహజంగానే మిగిలినవర్గాల్లో కొంత అసంతృప్తి నెలకొంది. బహిరంగంగా ఈ అంశాన్ని ప్రస్తావించలేకపోయినా సీనియర్లు సైతం ఇదే అభిప్రాయంతో ఉంటున్నారట.

మంత్రి పదవి కోసం ముత్యాలనాయుడు ఎదురుచూపులు..!

మంత్రివర్గ విస్తరణలో మళ్లీ బీసీలకే అవకాశం కల్పిస్తారా.. లేక కాపులకు ఛాన్స్ వస్తుందా అనేది చర్చ. ప్రస్తుతం అవంతి శ్రీనివాస్ మంత్రిగా ఉన్నారు. అవంతిని మారిస్తే ఆయన స్ధానం అదే సామాజికవర్గానికి లభిస్తుందనే అభిప్రాయం ఉంది. ఈ లెక్కల్లో అమర్నాథ్, ధర్మశ్రీలలో ఒకరి పేరు పరిగణనలోకి తీసుకుంటారని అనుచరులు చెప్పే మాట. వాస్తవానికి మంత్రివర్గంలో స్ధానం అంటూ వస్తే అది ముత్యాల నాయుడికే అనేది ఇన్నాళ్లూ గట్టిగా ఉన్న ప్రచారం. ఇటీవల జరిగిన ప్రాదేశిక ఎన్నికల్లో కోటపాడు జడ్పీటీసీగా ముత్యాల నాయుడు కుమార్తె అనూరాధ గెలిచారు. ఆమెకు జడ్పీ వైస్‌ఛైర్‌పర్సన్‌ పదవి ఖాయమనే ప్రచారం జరిగినప్పటికీ అది లభించలేదు. మంత్రివర్గంలో తనకు అవకాశం ఇస్తారనే ఉద్దేశంతో కుమార్తె పదవి కోసం పెద్దగా ముత్యాల నాయుడు పట్టుబట్టలేదట.

భవిష్యత్‌లో జరిగే మార్పులకు ప్రస్తుత పరిణామాలు సంకేతాలు..!

ఇప్పుడు ఎమ్మెల్సీ స్ధానాలను బీసీలకు కేటాయించడంతో హైకమాండ్ ఆలోచనేంటన్నది ఆసక్తిగా ఉంది. వరుదు కల్యాణి సీఎం నుంచి బీఫాం తీసుకున్న సమయంలో ఎమ్మెల్యే అమర్నాథ్ అక్కడ కనిపించారు. ఈ పరిణామాలను గమనిస్తుంటే త్వరలో జరగనున్న విస్తరణలో ఎవరికి చోటు లభిస్తుందనేది ఉత్కంఠ రేపుతోంది. ఈ పరిణామాలు అనీ ఒక్కొక్కటిగా భవిష్యత్‌లో జరిగే మార్పులకు సంకేతాలుగానే భావించాలంటున్నాయి పార్టీ వర్గాలు. మరి సామాజిక సమీకరణాలు ఎంత వరకు ప్రభావితం చేస్తాయో చూడాలి.

Related Articles

Latest Articles