గ్రేటర్‌ హైదరాబాద్‌ టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడెవరు..?

రాజకీయంగా టీఆర్‌ఎస్‌కు కీలకమైన గ్రేటర్ హైదరాబాద్‌లో.. ఆ పార్టీ అధ్యక్షుడిగా ఎవరికి ఛాన్స్‌ దక్కనుంది? సిటీలో పార్టీని బలోపేతం చేయగల నేత కోసం అన్వేషన మొదలైందా? గ్రేటర్ టీఆర్‌ఎస్‌ సారథ్యానికి రేస్‌లో ఉన్న నాయకులు ఎవరు?

గ్రేటర్‌ టీఆర్‌ఎస్‌ కమిటీపై ఇటీవలే చర్చ!

టీఆర్ఎస్‌ సంస్థాగత నిర్మాణానికి ఈ నెల 2 నుంచి చురుకుగా పనులు మొదలయ్యాయి. గ్రామ, వార్డు కమీటిలతోపాటు జిల్లా, రాష్ట్రస్థాయి కమిటీలను ఈనెలలోనే పూర్తి చేయాలన్నది నేతల నిర్ణయం. ఈ క్రమంలోనే గ్రేటర్ హైదరాబాద్ టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడిగా ఎవరికి ఛాన్స్‌ దక్కుతుందన్న చర్చ మొదలైంది. పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో కూడా కమిటీ ఏర్పాటుపై మాట్లాడారు వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌.

అధ్యక్షులుగా చేసిన సుదర్శన్‌రావు, పద్మారావుగౌడ్‌, శ్రీనివాస్‌, మైనంపల్లి ..!

టీఆర్ఎస్‌కు ఇప్పటి వరకు నలుగురు నాయకులు గ్రేటర్‌ హైదరాబాద్‌ అధ్యక్షులుగా పనిచేశారు. మొదట్లో సుదర్శన్‌రావు, పద్మారావుగౌడ్‌, శ్రీనివాస్‌లు పార్టీ బాధ్యతలు చూడగా.. టీఆర్ఎస్‌ అధికారంలోకి వచ్చాక.. మైనంపల్లి హన్మంతరావు ఆ పదవిలో ఉన్నారు. అప్పట్లో జిల్లా అధ్యక్షులు అక్కర్లేదని అనుకోవడంతో.. కమిటీల ఏర్పాటు ఆగిపోయింది. ఇప్పుడు మళ్లీ కమిటీ కూర్పు వైపు చూస్తుండటంతో గ్రేటర్‌ పార్టీ పీఠం ఎవరికి ఇస్తారనే చర్చ మొదలైంది.

రేస్‌లో శంభీపూర్‌ రాజు, తలసాని కుమారుడు..!

2016 GHMC ఎన్నికల్లో తిరుగులేని అధిక్యంతో మేయర్ పీఠాన్ని టీఆర్ఎస్‌ దక్కించుకుంది. ఇటీవల జరిగిన GHMC ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాలేదు. దీంతో గ్రేటర్ హైదరబాద్‌లో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్న చర్చ జరిగింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని..సారథి ఎంపిక ఉంటుందని టాక్‌. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుకు మరో ఛాన్స్‌ ఇస్తారా లేదా అన్న చర్చ ఉంది. ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు, తలసాని శ్రీనివాసయాదవ్‌ కుమారుడు తలసాని కిరణ్‌యాదవ్‌ పేర్లు కూడా రేస్‌లో ఉన్నట్టు తెలుస్తోంది.

కొత్త పేర్లు తెరపైకి రావచ్చా?

ఒకవేళ మేడ్చల్‌-మల్కాజ్‌గిరి జిల్లాల వారీగా టీఆర్ఎస్‌ అధ్యక్షులను నియమించాలని భావిస్తే మాత్రం.. గ్రేటర్‌ హైదరాబాద్‌ అధ్యక్ష పదవికి కొత్త పేర్లు తెరపైకి వస్తాయని అనుకుంటున్నారు. టీఆర్ఎస్‌ అధికారంలో ఉండటం.. GHMC పగ్గాలు గులాబీ పార్టీ చేతిలోనే ఉండటంతో.. చాలా మంది నాయకులు ఈ పార్టీ పదవిని ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. మరి.. ఎవరికి పట్టం కడతారో చూడాలి.

Related Articles

Latest Articles

-Advertisement-