తిరుపతి ముంపునకు కారణం ఎవరు…?

తిరుపతి ముంపునకు కారణం ఎవరు? వర్షం తగ్గి వారం అవుతున్నా నగరంలో నీరు ఎందుకు లాగడం లేదు? ఇప్పటికీ పలు కాలనీలు నీటిలోనే ఎందుకు నానుతున్నాయి? ఇది ప్రకృతి వైపరిత్యామా లేక ఆ నేత వాస్తు భయమా?

తిరుపతి ప్రజలు గతంలో ఎన్నాడూ చూడని వరద ఇక్కట్లు..!

ప్రపంచ పటంలో తిరుపతికి ఒక ప్రత్యేకత స్థానం ఉంది. కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామివారు స్వయంభూవై వెలసిన పుణ్యక్షేత్రం. నిత్యం దేశ విదేశాల నుంచి భక్తులు తిరుపతి వస్తుంటారు. తిరుపతికి ఉన్న ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీలు నగరంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తోంది. కేంద్ర సర్కార్‌ సైతం స్మార్ట్ సిటీ కింద తిరుపతి అభివృద్ధికి నిధులు కేటాయించింది. ఇలా అభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్న తరుణంలో ప్రకృతి పగబట్టిందా అన్నట్టుగా పరిస్థితులు మారిపోతున్నాయి. భారీ వర్షాలకు తిరుపతి ప్రజానీకం ఎన్నడు చూడని ఇక్కట్లను ఎదుర్కొంటోంది. శేషాచల కొండల నుంచి పోటెత్తిన నీటి ప్రవాహం తిరుపతిని ముంచెత్తుతూ ఉంటే.. చెరువులను ఆక్రమించడంతో అక్కడి నీరు కూడా నగరంలోకి పరుగులు తీస్తోంది. వాన నీరు నిలిచిపోయి వారమైనా.. వరద తగ్గలేదు.

వాస్తు విరుద్ధమని చెప్పడంతో సప్లయ్‌ ఛానల్‌ మూయించిన ఓ నేత..!

తిరుపతి ఇలా కనీవినీ ఎరుగని రీతిలో వరదతో అతలాకుతలం కావడానికి ప్రధాన కారణం పట్టణానికి ఎగువ ప్రాంతంలో ఉన్న చెరువుల్లో నీరును తిరుపతివైపు మళ్లించడమే. పేరూరు చెరువు నుంచి నీటి ప్రవాహం తిరుపతి వైపు దూసుకొస్తోంది. ఫలితంగా నగరంలోని పలు కాలనీలు నీట మునగడమేకాక.. వారం తర్వాత కూడా నీళ్లలోనే నానుతూ ఉన్నాయి. వాస్తవానికి పేరూరు చెరువు నుంచి తుమ్మలగుంట చెరువుకు.. తుమ్మలగుంట నుంచి అవిలాల చెరువుకు గతంలో సప్లయ్‌ ఛానల్స్‌ ఉండేవి. తుమ్మలగుంట గ్రామానికి ఆగ్నేయ ప్రాంతంతో తుమ్మలగుంట చెరువు ఉంది. అది వాస్తు విరుద్ధం అని ఎవరో చెప్పడం దాన్ని నమ్మిన ఆ ప్రాంత ప్రజాప్రతినిధి ఆ సప్లయ్‌ ఛానల్‌ను మూసివేయించారట. తుమ్మలగుంట చెరువుకు పేరూరు చెరువు నుంచి నీరు రాకుండా తిరుపతి వైపు మళ్లించేశారట.

పాత కాల్వ మీదుగా నీటి మళ్లింపును అంగీకరించని స్థానికులు..!

తిరుపతిలో ఇంకా 8 వార్డులు నీటిలోనే ఉన్నాయి. దాదాపు 40 వేల మంది ఇబ్బంది పడుతుండటంతో ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి అధికారులపై మండిపడ్డారు. పేరూరు చెరువు నీళ్లు తిరుపతివైపు రాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించినా ఇప్పటి వరకు ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టలేదు. పేరూరు చెరువు నుంచి నీటి మళ్లింపు చేపట్టాలంటే అధికారులకు ప్రస్తుతం రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి నీటిని పాతకాల్వ గ్రామం మీదుగా స్వర్ణముఖి నదిలోకి మళ్లించడం లేదా తుమ్మలగుంటకు సప్లయ్‌ ఛానల్స్‌ను పునరుద్ధరించడం. అయితే పాతకాల్వ గ్రామం మీదుగా నీటి మళ్లింపు ఆ ప్రాంత ప్రజలు అంగీకరించలేదు. తమ గ్రామాన్ని ముంచేస్తున్నారని హైవేపై అక్కడి ప్రజలు ఆందోళనకు దిగడంతో ఆ ఆలోచనను విరమించుకున్నారు అధికారులు.

ఆ నేత తీరువల్లే తిరుపతి మునిగిపోతోందా?

తుమ్మలగుంట చెరువు మీదుగా నీటి మళ్లింపు చేపట్టాలంటే వాస్తు భయం పట్టుకున్న ఆ ప్రాంత ప్రజాప్రతినిధి అంగీకరించడం లేదట. దీంతో ఆ ఆలోచన గాలికొదిలేశారు. అందుకే ఎగువ ప్రాంతంలోని చెరువు నీరంతా ఇంకా తిరుపతిని ముంచెత్తుతోంది. ఆ గ్రామ వాస్తు.. ఆ నేత వాస్తు భయాలు ఇప్పుడు తిరుపతి ప్రజల పాలిట శాపంలా మారాయట. మళ్లీ వారంపాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఇకనైనా తుమ్మలగుంట, అవిలాల చెరువులకు ఉన్న సప్లయ్‌ చానల్స్‌ పునరుద్ధరించకపోతే తిరుపతికి వరద ప్రవాహం మరింత పెరుగుతుంది. మరి.. అధికారులు ఆ గ్రామ వాస్తుకు ప్రాధాన్యం ఇస్తారో లేక ప్రజల ప్రాణాలను పట్టించుకుంటారో చూడాలి.

Related Articles

Latest Articles