కాస్ట్ విషయంలో క్లారిటీ లేని నేత ఎవరు..?

ఎవరికైనా ఓకే కులం ఉంటుంది. కానీ, ఆ నేతకు రకరకాల కులాలు ఉంటాయి. ఆయన ఉన్న చోట పదవులు ఏ కులానికి రిజర్వ్‌ అయితే, ఆయనా అదే కులానికి మారిపోతారు. వివిధ కులాల పేర్లతో పదవులు పొందిన ఆ నేత తాజాగా ఇంకో కులం కోటాలో ఏకంగా ఎమ్మెల్సీ ఛాన్స్‌ కొట్టేశారు. ఇంతకీ ఎవరా నేత? ఏమా కత?

ఆ నేతకు తన కులంపై క్లారిటీ లేదట. ఆయనిప్పుడు కాపు కోటాలో ఎమ్మెల్సీ అవుతున్నారు. రిజర్వేషన్లకు అనుకూలంగా క్యాస్ట్ మార్చుకుని పదవులు పొందుతున్న ఆనేత క్యాస్ట్ విషయం హాట్ టాపిక్ గా మారింది. కాపుల్లో ఉన్న ఉప కులాలను ఆయన పదవుల కోసం అనుకూలంగా మార్చు చేసుకుంటున్నారనే చర్చ నడుస్తోంది.

తూర్పుగోదావరి జిల్లాలో అనంత ఉదయ భాస్కర్ అంటే తెలియని వారు ఉండరు. ఈయనకు తన క్యాస్ట్ పై క్లారిటీ లేదు. సమయానికి, పదవులకు అనుకూలంగా క్యాస్ట్ మార్చుకుంటారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అనంత ఉదయ్ భాస్కర్ తాజాగా తూర్పుగోదావరి జిల్లా స్థానిక సంస్థల నుండి ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నిక కాబోతున్నారు. బరిలో ఒక్కరే నిలబడటంతో నామినేషన్ల పరిశీలన అనంతరం ఉదయ్ భాస్కర్ ఏకగ్రీవంగా ఎన్నిక అయినట్టే. ప్రస్తుతం కాపు కోటాలో ఎమ్మెల్సీ కాబోతున్నారు. ఈయనే గతంలో తూర్పు కాపుగా చెప్పుకుని బి.సి. రిజర్వు స్థానం నుండి అడ్డతీగల జెడ్.పి.టి.సి గా ఎన్నికయ్యారు. తరువాత ఎస్టీ రిజర్వు స్థానం అడ్డతీగల ఎం.పి.పి.గా కూడా ఎన్నికయ్యారు. ఇది చూసిన జనం కాపు సామాజిక వర్గంలో అన్ని ఉప కులాలు ఈయనవేనా అని ఆశ్చర్యపోతున్నారు. ఈయన పదవి కోసం చొక్కా మార్చినట్టు క్యాస్ట్ మార్చేసుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది.

అనంత బాబు 2001వ సంవత్సరంలో జడ్పిటిసి గా తన రాజకీయ జీవితాన్ని తూర్పు ఏజెన్సీ అడ్డతీగల మండలం నుండి ప్రారంభించారు. 2001-06 ఈ మధ్యకాలంలో అడ్డతీగల జడ్పిటిసిగా, 2006-11 మధ్య అడ్డతీగల మండల పరిషత్ అధ్యక్షుడిగా పనిచేస్తూ 2009వ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేశారు. అనంతరం జరిగిన పరిణామాల్లో కుల దృవీకరణ పత్రం విషయంలో అనంతబాబు నామినేషన్ తిరస్కరించారు. 2014 ఎన్నికల్లో ఎస్టీ రిజర్వ్‌డు స్థానం నుండి వైసిపి నుండి నామినేషన్ వేసినా, మళ్లీ నిరాశ ఎదురైంది. రంపచోడవరం ఎస్టీ రిజర్వు స్థానం నుండి అనంతబాబు పోటీ చేయడానికి అనర్హుడని హైకోర్టు ప్రకటించింది. అప్పుడే అనంతబాబు అసలు కులాన్ని కోర్టు నిర్థారించింది. ఆయన పెద్ద కాపుగా ఓ.సి కేటగిరీకి చెందిన వ్యక్తిగా తేలింది. దీంతో తూర్పు మన్యంలో అనంతబాబు రాజకీయ జీవితం ముగిసిందని అందరూ భావించారు.

2019 ఎన్నికలకు ముందు సాధారణ ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్న నాగులపల్లి ధనలక్ష్మిని పార్టీలోకి తీసుకురావడమే కాకుండా, ఎన్నికల్లో రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద మెజార్టీతో గెలవటంలో కీలకపాత్ర పోషించారు. ఇప్పుడు ఏపీ స్థానిక సంస్థల కోటాలో ఆయన ఎమ్మెల్సీ అవుతున్నారు. అయితే ఆయన ఏ కోటాలో ఎమ్మెల్సీ అవుతున్నారనే ఆసక్తి అందరిలో ఆసక్తి ఏర్పడింది. చివరికి పార్టీ ప్రకటించిన జాబితా ప్రకారం ఆయన కాపు కోటాలో ఎమ్మెల్సీ అవుతున్నారని తేలింది. దీంతో ఆయన జడ్పీటీసీ పదవి ఒక కులంతో, ఎంపీపీ మరో కులంతో ఎన్నికై ఇప్పుడు మూడో కులంతో ఎమ్మెల్సీ అవుతున్నారనే టాక్‌ నడుస్తోంది.

Related Articles

Latest Articles