హుజురాబాద్‌లో కాంగ్రెస్‌ పోటీ ఎవరికి లాభం.. ఎవరికి నష్టం?

హుజూరాబాద్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పోటీ ఎవరికి లాభం.. ఎవరికి నష్టం? అధికార TRSని ఢీకొట్టడం సాధ్యమా..? ఈటలను కాదని కాంగ్రెస్‌ పైచెయ్యి సాధించడం ఈజీయేనా? కొండా… కాంగ్రెస్‌కి కొండంత అండ ఇవ్వగలరా?

కొండా సురేఖ అభ్యర్థి అయితే కాంగ్రెస్‌ ఓటు చెదిరిపోదని లెక్కలు..!

హుజురాబాద్‌ ఉపఎన్నిక కాంగ్రెస్‌కి సవాల్‌. ప్రస్తుతం అక్కడున్న పరిస్థితిలో కాంగ్రెస్‌ గెలిచే అవకాశాలు తక్కువ. గెలవలేనప్పుడు గౌరవప్రదమైన ఓటు బ్యాంకైనా సాధించి తీరాలి. పైగా టీఆర్‌ఎస్‌ నుంచి బీజేపీలోకి వెళ్లిన ఈటల రాజేందర్‌తోపాటు అధికార టీఆర్‌ఎస్‌ బలం, బలగాల ముందు కాంగ్రెస్‌ ఎంత వరకు నిలబడుతుందన్నది ప్రశ్న. కేడర్‌ను కాపాడుకోవాలంటే.. బలమైన అభ్యర్థిని బరిలో దించాలి. అందుకే పీసీసీ చీఫ్‌ రేవంత్‌.. మాజీ మంత్రి కొండా సురేఖను బరిలో నిలపాలని అనుకున్నారు. ఈ ఎత్తుగడవల్ల కాంగ్రెస్‌ ఓటు చెల్లాచెదురు కాబోదని వారి ఆలోచన. పైగా పార్టీ గట్టి ఫైట్‌ ఇచ్చే అవకాశం ఉంటుంది. లేదంటే అసలుకే ఎసరు వస్తుందని లెక్కలేసుకుంటున్నారు.

వరంగల్‌పైనే ఎక్కువ ఆశలు పెట్టుకున్న కొండా సురేఖ..!

బలమైన అభ్యర్దిని బరిలో దించగలిగాం అనే చర్చ జరిగితే అదే సగం విజయంగా గాంధీభవన్‌ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. అయితే.. వరంగల్‌లో కొండా సురేఖ చేసిన కామెంట్స్‌తో పార్టీ కొంత ఇరుకున పడింది. ఉపఎన్నికల కోసమే హుజురాబాద్.. తర్వాత వరంగల్ అనే రీతిలో కొండా ఆలోచనలు ఉన్నాయి. కానీ.. వచ్చే ఎన్నికల్లో కూడా హుజురాబాద్‌లోనే కొండా సురేఖ పోటీ చేస్తారని కాంగ్రెస్‌ భావించిందట. ఈ విషయంలో కొండా ఆలోచన మరోలా ఉంది. ఇప్పటికే పరకాల వెళ్లి తప్పుచేశాం.. మళ్లీ అది రిపీట్‌ కావొద్దని అనుకుంటోందట. కాంగ్రెస్‌కి కొండా సురేఖ బలమైన అభ్యర్థే కానీ.. లోకల్.. నాన్ లోకల్ సమస్య వచ్చే ప్రమాదం లేకపోలేదు.

ఈటల, టీఆర్ఎస్‌ మధ్యే ప్రధాన పోటీ..!

హుజురాబాద్‌లో ఇప్పటికే TRS.. బీజేపీ గ్రౌండ్‌లో ఉన్నాయి. కాంగ్రెస్ కనీసం అడుగు పెట్టలేదు. టీఆర్‌ఎస్‌, బీజేపీలు రెండూ కాంగ్రెస్ కేడర్‌ను లాగే పనిలో పడ్డాయి. దీంతో పార్టీ శ్రేణులు ఎక్కడ చీలిపోతాయో అన్న ఆందోళన నెలకొంది. కొండా అభ్యర్థి అయితే పార్టీ కేడర్‌ చెదిరిపోదు. బీసీ ఓటు కలిసి వస్తుందని అనుకున్నారు. రెడ్డి సామాజికవర్గం ఓటు పూర్తిగా టీఆర్‌ఎస్‌కు మళ్లకుండా గండి కొట్టొచ్చన్నది పార్టీ వ్యూహం. ప్రభుత్వ వ్యతిరేక.. అనుకూల ఓట్ల చుట్టూ ఉపఎన్నిక తిరిగే పరిస్థితి లేదన్నది ఆ పార్టీ ఆలోచన. హుజురాబాద్‌లో ఈటల రాజేందర్.. TRS మధ్యే ప్రధాన పోటీ.

కొండాకు లోకల్‌ నాన్‌లోకల్‌ సెగ..!

కాంగ్రెస్‌ అభ్యర్థిగా కొండా సురేఖ బరిలో దిగుతారా లేదా అన్నది ఇంకా క్లారిటీ లేదు. ఆమె సందిగ్ధంలో ఉండటంతో ఇంకా అనేక సమస్యలు తెరపైకి వచ్చాయి. ప్రత్యర్థి పార్టీలకు అవి అస్త్రంగా మారే ప్రమాదం లేకపోలేదు. ఇప్పటికే లోకల్‌ నాన్‌ లోకల్‌ అంశాన్ని గట్టిగా ప్రశ్నిస్తున్నాయి కూడా. అందుకే కాంగ్రెస్‌ అనుసరించే వ్యూహం.. అభ్యర్థి ప్రకటనలో తీసుకునే జాగ్రత్తలపై అంతా ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.

-Advertisement-హుజురాబాద్‌లో కాంగ్రెస్‌ పోటీ ఎవరికి లాభం.. ఎవరికి నష్టం?

Related Articles

Latest Articles