ఓవైసీ అక్కడ పోటీకి దిగితే నష్టపోయేది ఎవరు…?

త్వరలోనే ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఇవి ఒకరకంగా వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు సైమీఫైనల్. దీంతో అటూ కాంగ్రెస్, ఇటూ బీజేపీ తమ పట్టును కాపాడుకోనేందుకు శతవిథాలా ప్రయత్నాలు చేస్తున్నాయి. బీజేపీ వరుసగా రెండుసార్లు అధికారంలో రావడంతో ఆపార్టీపై ప్రజల్లో సహజంగానే కొంత వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీనికితోడు కరోనా కట్టడిలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందనే విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో  ప్రధాని మోదీ ఇమేజ్ క్రమంగా దిగజారుతున్నట్లు కన్పిస్తోంది. ఇలాంటి సమయంలోనే ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు రానుండటం ఇరుపార్టీలకు ఛాలెంజ్ గా మారింది.

మోదీ నేతృత్వంలో మూడోసారి కూడా కేంద్రంలో అధికారంలోకి రావాలని బీజేపీ భావిస్తోంది. ఈమేరకు ప్రజల్లో వ్యతిరేకత రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. కొన్ని రాష్ట్రాల్లో ఏకంగా సీఎంలను మార్చివేసి వ్యతిరేకతను తగ్గించే ప్రయత్నం చేస్తుంది. త్వరలోనే ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌, ఉత్తరాఖండ్‌, మణిపూర్‌, గోవా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. పంజాబ్ మినహా మిగిలిన రాష్ట్రాల్లో బీజేపీని అధికారంలో ఉంది. ఇక మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్, దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకోవాల్సిన అవశ్యకత ఉంది.

ఇక్కడ ఓటమిపాలైతే ఆ ప్రభావం వచ్చే పార్లమెంట్ ఎన్నికలపై పడే అవకాశం ఉంది. దీంతో మోదీ-అమిత్ షా ద్వయం ఈ రెండు రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టిసారించినట్లు తెలుస్తోంది. మరోవైపు కేంద్రంలో వరుసగా కాంగ్రెస్ రెండుసార్లు ఓటమిపాలైంది. ఈసారి ఎలాగైనా కేంద్రంలో అధికారంలోకి రావాలని కాంగ్రెస్ భావిస్తుంది. అందుకనుగణంగానే పావులు కదుతుపుతోంది. దీనిలో భాగంగానే సెమిఫైనల్ గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి చెక్ పెట్టాలని భావిస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఐదు రాష్ట్రాలను చుట్టి వస్తున్నారు. ఈ ఎన్నికల్లో సత్తాచాటడం ద్వారా పార్లమెంట్ ఎన్నికలకు సమాయత్తం కావాలని చూస్తున్నారు.

కాంగ్రెస్, బీజేపీ మాదిరిగానే ఎంఐఎం సైతం ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కిందటి మహారాష్ట్ర, బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం పోటీ చేసి కొన్ని స్థానాలను దక్కించుకుంది. ఈ ప్రభావం బీజేపీ పై కంటే విపక్షాలపై పడింది. ముస్లిం ఓటు బ్యాంకు చీలిపోవడంతో బీజేపీకే అడ్వాంటేజ్ గా మారింది. త్వరలో జరుగబోయే గుజరాత్, ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఎంఐఎం పోటీ చేయనుంది. ఇక్కడ ముస్లిం ఓటర్లు అత్యధికంగా ఉన్నారు. వీరి ఓటు బ్యాంకు చీలడం వల్ల విపక్షాల కంటే కూడా బీజేపీకే అధికంగా లాభం చేకూరుతుందనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఆయన నిర్ణయంపై విపక్ష పార్టీల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.  

గుజరాత్ లో బీజేపీ వరుసగా అధికారంలోకి వస్తున్నా ముస్లిం ఓటర్లు మాత్రం కాంగ్రెస్ కే అనుకూలంగా ఉన్నారు. ఇక్కడ ప్రాంతీయ పార్టీలు లేకపోవడంతో వారంతా కాంగ్రెస్ వెన్నంటే ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడ ఓవైసీ పార్టీని స్థాపించి పోటీ చేస్తే ముస్లిం ఓటు బ్యాంకు ఆపార్టీకి మరలే అవకాశం ఉండనుంది. దీని వల్ల కాంగ్రెస్ కంటే బీజేపీకే అడ్వాంటేజ్ గా మారుతుందనే టాక్ విన్పిస్తోంది. ఉత్తరప్రదేశ్లోనూ ముస్లింలు 90స్థానాల్లో నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ వెంట నడిచిన ముస్లిం ఓటర్లు ఆ తర్వాత సమాజ్ వాదీ పార్టీ వైపు మొగ్గుచూపారు. ప్రస్తుతం యూపీలో ప్రియాంక గాంధీ బరిలో ఉండటంతో ఆ ఓటర్లంతా తిరిగి కాంగ్రెస్ వైపు చూస్తున్నారు.  

ఉత్తరప్రదేశ్ లో ఎంఐఎం పోటీ చేస్తే ముస్లిం ఓటు బ్యాంకు చీలే అవకాశం ఎక్కువగా అవకాశం ఉంది. ఇది ఒకరకంగా బీజేపీకి మేలు చేయడమేనని విపక్ష పార్టీలు విమర్శలకు దిగుతున్నాయి. ఓవైపీ మాత్రం పార్టీ విస్తరణలో భాగంగా పోటీ చేయక తప్పడం లేదని అంటున్నారు. ఉత్తర ప్రదేశ్లో వంద స్థానాల్లో పోటీ దిగుతామని ఆయన స్పష్టం చేస్తున్నారు. ఓవైసీ నిర్ణయం వల్ల బీజేపీ కంటే కాంగ్రెస్ పార్టీనే ఎక్కువ నష్టపోయే అవకాశం కన్పిస్తోంది. దీంతో ఎంఐఎం కాషాయానికి అండగా నిలుస్తుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విమర్శలను ఓవైసీ ఎలా తిప్పికొడుతారో వేచిచూడాల్సిందే.

-Advertisement-ఓవైసీ అక్కడ పోటీకి దిగితే నష్టపోయేది ఎవరు...?

Related Articles

Latest Articles