హుజురాబాద్ ఉప ఎన్నిక వాయిదా.. ఏ పార్టీకి నష్టం?

హుజూరాబాద్ ఉప ఎన్నిక తెలంగాణలో రాబోయే సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్ గా అన్ని పార్టీలు భావించాయి. నేడో రేపో ఉప ఎన్నికలు ఉంటాయని అందరూ ఉత్కంఠగా ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ ఈసీ బాంబు పేల్చింది. హుజూరాబాద్ ఉప ఎన్నికల బైపోల్ ఇప్పట్లో లేదని కేంద్ర ఎన్నికల సంఘం తేల్చిచెప్పడంతో అంతా ఊసురుమంటున్నారు. మరోవైపు ఉప ఎన్నిక వాయిదా ఏ పార్టీకి కలిసి వస్తుంది? ఇంకేవరికీ మైనస్ అవుతుందనే చర్చ తెలంగాణలో జోరుగా సాగుతోంది. హుజూరాబాద్ ఉప ఎన్నికను ఈటల రాజేందర్, సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. బీజేపీ నుంచి ఈటల రాజేందర్ బరిలో నిలువనుండగా టీఆర్ఎస్ నుంచి గెల్లు శ్రీనివాస్ యాదవ్ బరిలో ఉన్నాడు. ప్రధానంగా వీరిమధ్య పోటీ ఉండబోతుంది. కాంగ్రెస్ సైతం తన శక్తివంచన లేకుండా పోటీ ఇచ్చేందుకు సిద్ధపడుతోంది. ఈ ఎన్నికలో కాంగ్రెస్ కనీసం సెకండ్ ప్లేసులో ఉన్నా నైతికంగా విజయం సాధించినట్లేనని ఆపార్టీ భావిస్తోంది. దీంతో ఈ ఎన్నికను ప్రధాన పార్టీలన్నీ ఛాలెంజ్ గా తీసుకొని ప్రచారం చేపడుతున్నాయి.

ఇప్పటికే ఈటల రాజేందర్ నియోజకవర్గంలో పాదయాత్ర చేపడుతూ దూసుకెళుతున్నారు. గతంలో ఆయన చేసిన అభివృద్ది పనులతోపాటు సానుభూతి పవనాలు ఆయనకు కలిసి వచ్చే అవకాశం ఉందనే టాక్ విన్పిస్తుంది. ఇప్పటికే రేసులో ఈటల రాజేందర్ గెలుస్తాడనే ప్రచారం జరుగుతోంది. అయితే తాజాగా ఉప ఎన్నిక వాయిదా పడటం ఆయనకు ఇబ్బందికరంగా మారనుంది. ప్రజల్లో ఇప్పుడున్న ట్రెండ్ ఎన్నికల నాటికి ఉంటుందా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. దీంతో ఎన్నిక వాయిదా బీజేపీకి మైనస్ అయ్యే అవకాశం ఉందనే టాక్ విన్పిస్తోంది. టీఆర్ఎస్ నుంచి యాదవ సామాజిక వర్గానికి చెందిన గెల్లు శ్రీనివాస్ బరిలో ఉన్నారు. సీఎం కేసీఆర్ హుజూరాబాద్ లో దళితబంధు పథకాన్ని పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నారు. ఇది ఆ పార్టీకి ప్లస్ అవుతుందని అంటున్నారు. ప్రస్తుతం టీఆర్ఎస్ కు ఇంకా సమయం లభించడంతో ఈ నియోజకవర్గంలో ప్రభుత్వం నిధుల వరద పారించే అవకాశం ఉంది. ఇది ఖచ్చితంగా రాబోయే ఎన్నికలపై ప్రభావం చూపనుంది. దీనికితోడు ఇప్పటివరకు ఈటల రాజేందర్ వెంట నడుస్తున్న అనుచరులు రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ వెంట నడిచే అవకాశం లేకపోలేదనే ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాలన్నీ కూడా టీఆర్ఎస్ కు కలిసి వస్తాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

హుజూరాబాద్ ఉప ఎన్నిక వాయిదా కాంగ్రెస్ కొంత రిలీఫ్ ఇచ్చే అవకాశం కన్పిస్తోంది. ఇప్పటివరకు ఆ పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తారనేది ఇంకా ఫైనల్ కాలేదు. ప్రముఖంగా కొండా సురేఖతోపాటు పొన్నం ప్రభాకర్ పేర్లు విన్పిస్తున్నాయి. దీనిపై కాంగ్రెస్ ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా ఆ పార్టీకి సమయం దొరకడంతో కాంగ్రెస్ బలమైన అభ్యర్థిని దింపే అవకాశం ఉండనుంది. ఈ ఎన్నిక కొత్త పీసీసీ చీఫ్ గా నియామకమైన రేవంత్ రెడ్డి సామర్థ్యానికి పరీక్షగా మారనుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎలాంటి వ్యూహాంతో ముందుకొస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనా హుజురాబాద్ ఉప ఎన్నిక వాయిదా అనేది బీజేపీకి గట్టి షాకిచ్చినట్లే కన్పిస్తోంది. పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో ఈసీ ఎన్నికకు క్లియరెన్స్ ఇవ్వగా.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కరోనా సాకుతో వాయిదా వేయడం బీజేపీకి మింగుడుపడటం లేదు. మొత్తానికి హుజూరాబాద్ ఉప ఎన్నిక వాయిదా టీఆర్ఎస్ కు కలిసి రానుండగా.. కాంగ్రెస్ కు కొంత రిలీఫ్ ఇచ్చినట్లు కన్పిస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ తనవైపు వీస్తున్న గాలిని పక్క పార్టీల వైపు మరలకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది మాత్రం ఆసక్తికరంగా మారింది.

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-