టీఆర్ఎస్ జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టిందా..?

టిఆర్ఎస్ జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించనుందా? ఢిల్లీలో పార్టీ కార్యాలయ నిర్మాణం తర్వాత ఆ దిశగా అడుగులు పడే ఛాన్స్ ఉందా ? అనువైన రాజకీయ పరిస్థితుల కోసం గులాబీ పార్టీ ఎదురు చూస్తోందా ?

టిఆర్ఎస్ ఢిల్లీలో పార్టీ కార్యాలయ నిర్మాణానికి రెడీ అవుతోంది. సెప్టెంబర్ 2 న సీఎం కేసీఆర్ ఢిల్లీలో పార్టీ ఆఫీసు నిర్మాణానికి భూమి పూజ నిర్వహిస్తారు. పార్టీకి చెందిన ముఖ్యనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. టిఆర్ఎస్ ప్రస్థానంలో ఢిల్లీలో పార్టీ కార్యాలయ నిర్మాణం ఒక మైలు రాయి అని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

మరోవైపు జాతీయ రాజకీయాల్లో టిఆర్ఎస్ క్రియాశీలక పాత్ర పోషించడానికి ఈ కార్యాలయం వేదిక కాబోతుందా అన్న రాజకీయ విశ్లేషణలు మొదలయ్యాయి. టిఆర్ఎస్ పార్టీ వర్గాలు మాత్రం జాతీయ రాజకీయాల అంశంపై ఇపుడే ఏం చెప్పలేం అన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ పెడరల్ ఫ్రంట్ ఆలోచనను తీసుకువచ్చారు. గతంలో ఫెడరల్ ఫ్రంట్ ఆలోచనపై ప్రాంతీయ పార్టీల నేతలతో సమాలోచనలు జరిపారు. నేరుగా కేసీఆర్ వారిని కలసి జాతీయ రాజకీయాలపై అప్పట్లో చర్చించారు. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఆలోచనకు జాతీయ స్థాయిలో పాజిటివ్ గా చర్చ జరిగింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బిజెపికి స్పష్టమైన మెజారిటీ వచ్చింది. దీంతో ఆ తర్వాత ఫెడరల్ ఫ్రంట్ పై పెద్దగా చర్చ జరగలేదు.

తాజాగా జాతీయ స్థాయిలో కొన్ని విపక్ష పార్టీలు బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా జట్టు కడుతున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు సమయం ఉండగానే, జాతీయ స్థాయిలో ఏకతాటిపైకి వచ్చే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో టిఆర్ఎస్ రానున్న కాలంలో జాతీయ స్థాయిలో ఎటువంటి పాత్ర పోషించే అవకాశం ఉందనే అంశంపై విశ్లేషణలు కొనసాగుతున్నాయి. రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరగవచ్చు. ఢిల్లీలో పార్టీ కార్యాలయంలో పూర్తి అయిన తరువాత టిఆర్ఎస్ ఎటువంటి అడుగులు వేస్తుందో తెలియాలంటే కొంత కాలం ఆగాల్సిందే .

Related Articles

Latest Articles