అమరావతి భవిష్యత్‌పై నీలి నీడలు…!

ఏపీ రాజధానిగా అమరావతిని అంతర్జాతీయ స్థాయి నగరంగా చూడాలన్నది నాటి సీఎం చంద్రబాబు స్వప్నం. ప్రపంచ ప్రఖ్యాత నగరాలను పరిశీలించి రాజధాని నిర్మాణానికి ప్లాన్‌ చేశారు. అయితే నిర్మాణం పనులు మాత్రం అనుకున్న స్థాయిలో ముందుకు సాగలేదు. కానీ రాజధాని ప్రాంతంలో అభివృద్ధి ప్రక్రియ మాత్రం మొదలైంది. పెద్ద పెద్ద కంపెనీలను పెట్టుబడులకు ఆహ్వానించారు. వాటిలో కొన్ని ముందుకు వచ్చాయి. మరికొన్ని వచ్చే క్రమంలో ఉన్నాయి. ఈ లోగా రాజధాని భూ సేకరణలో అవకతవకల అంశం తెరమీదకు వచ్చింది. రైతుల భూములను కొందరు తక్కువ ధరకు కొట్టేశారని వైసీపీ అరోపించింది.

2019లో వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి నేతృత్వంలో భారీ మెజార్టీతో వైసీపీ సర్కార్‌ ఏర్పడింది. అధికారంలోకి రాగానే అమరావతి అభివృద్ధి ప్రక్రియ అటకెక్కింది. మూడు రాజధానుల అంశం ముందుకు వచ్చింది. సమీకృత అభివృద్ధి. పరిపాలన వికేంద్రీకరణ కోపం ఈ ప్రతిపాదన తీసుకువచ్చినట్టు ప్రభుత్వం ప్రకటించింంది. ఈ చట్టానికి 2020 జులై 31 న గవర్నరు ఆమోదముద్ర పడింది. దాంతో, అమరావతిని కేవలం శాసనరాజధానికే పరిమితం కాగా, విశాఖపట్నం కార్యనిర్వాహక రాజధానిగా, కర్నూలు న్యాయ రాజధానిగా ఉంటాయి.

మరోవైపు, ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ న్యాయస్థానలలో అనేక రిట్‌ పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిని విచారించేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన ప్రత్యేక ధర్మాసనాన్ని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఏర్పాటు చేసింది. జస్టిస్‌ జెకె.మహేశ్వరి, జస్టిస్‌ ఎవి.శేషసాయి, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తి సభ్యులు. గత ఏడాది జనవరి నుంచి ఈ ధర్మాసనం వాటిని విచారిస్తోంది. ఉన్నత న్యాయస్థానం తీర్పు వచ్చేవరకు ఎటువంటి చర్యలు చేపట్టవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ వరకు స్టేటస్‌ కో కొనసాగాలని ధర్మాసనం తీర్పిచ్చింది. ఈ నేపథ్యంలోనే గత ఏడాది అక్టోబర్ లో కొందరు హైకోర్టు న్యాయమూర్తులు, ఓ సుప్రీంకోర్టు న్యాయమూర్తిపై సీఏం జగన్‌ ఫిర్యాదు చేస్తూ సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తికి లేఖ రాశారు. అప్పట్లో ఆ వార్త జాతీయ మీడియాను కూడా ఆకర్షించటంతో పాటు పెద్ద చర్చకు దారితీసింది.

అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగినట్లు జగన్ ప్రభుత్వం శాసనసభలలో ఆరోపించింది. తరువాత ఓ వ్యక్తి ఈ భూ కుంభకోణంపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ప్రభుత్వ పోలీసు యంత్రాంగం విచారణ చేసి భూములు కొనుగోలు చేసినకొందరు వ్యక్తులు మోసాలకు పాల్పడ్డారని వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. దాంతో ఆ ఎఫ్‌ఐఆర్‌లను కొట్టివేయాలని వారు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ అనంతరం ఈ ఏడాది జనవరిలో రద్దుచేస్తూ న్యాయస్థానం తీర్పిచ్చింది. ఐతే, చంద్రబాబును ప్రజల ముందు దోషిగా నిలబెట్టాలని ఏపీ సర్కార్ గట్టి పట్టుదలతో ఉంది. అందుకే ఈ అంశంపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కానీ అక్కడా జగన్‌ సర్కార్‌కు ఎదురుదెబ్బ తప్పలేదు.

మరోవైపు, రాజధాని వికేంద్రీకరణను అమరావతి ప్రాంత రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఆందోళన బాటపట్టారు. ఈ ఉద్యమానికి టీడీపీ మద్దతు పలికింది. విపక్షాలు..ప్రజా సంఘాలు కూడా వారి వెంట నడిచాయి. ఆందోళనలో పాల్పంచుకున్నాయి. రెండు సంవత్సరాల నుంచి ఈ ఉద్యమం కొనసాగుతోంది.

దాంతో పాటు ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్‌చేస్తూ అమరావతి రైతులతో సహా పలువురు న్యాయస్థానాలను ఆశ్రయించారు. దీనిపై ఏపీ హైకోర్టు, సుప్రీంకోర్టులోనూ కేసులు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర కేబినెట్‌ మూడు రాజధానుల బిల్లులను ఉపసంహరించుకోక తప్పలేదు. ఈ మేరకు ఈ నెల 22న అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బిల్లు వాపస్‌పై ప్రకటన చేశారు.ఐతే తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకుంది. దీంతో ఆందోళనలకు తెరపడుతుందని బావించారు. కానీ బిల్లు ఉపసంహరణ తాత్కాలికమే అని తెలియటంతో మళ్లీ నిరసన బాటపట్టారు.

మూడు రాజధానుల అంశంపై ఏపీ ప్రభుత్వం వెనక్కి తగ్గటం తాత్కాలికమే. సీఎం వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి స్వయంగా ఈ విషయం చెప్పారు. దాంతో అమరావతి భవిష్యత్‌పై అనేక సందేహాలు వ్యక్తమవతున్నాయి. టీడీపీ హయాంలో ఇక్కడ కొంత అభివృద్ధి జరిగింది. కానీ అభివృద్ధి ప్రక్రియ ఇంకా చాలా వుంది. తాజా పరిణామాలతో ఆ ప్రక్రియ కూడా ఆగిపోయింది. 2019లో వైసీసీ ప్రభుత్వం ఏర్పడే నాటికి అమరావతిలో తాత్కాలిక స‌చివాలయం, తాత్కాలిక అసెంబ్లీ, తాత్కాలిక హైకోర్టు భ‌వ‌నాలు మిన‌హా మిగిలిన ప‌నుల‌న్నీ నిర్మాణ ద‌శ‌లో ఉన్నాయి.

ఇప్పటికే పూర్తి కావాల్సిన అధికారుల భ‌వనాలు, ఎమ్మెల్యేల క్వార్టర్ల నిర్మాణం ఆగిపోయింది. సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణం కూడా అర్థాంత‌రంగా ముగిసినట్టే క‌నిపిస్తోంది. ఇంకా చాలా నిర్మాణ పనులు జరుగుతున్నాయి. కానీ ప్రస్తుతం రాజధాని పనులు ఏ కోశానా ముందుకు సాగట్లేదు. దాదాపుగా 95 శాతంపైగా పూర్తయిన ఐఏఎస్‌ అధికారుల భవనాలు, ఎన్‌జీఓల భవనాలు, ఎంఎల్‌ఏ, ఎంఎల్‌సీ భవనాలు అంగుళం కూడా పురోగతి లేకుండా పోయింది.

రాజధాని వికేంద్రీకరణే ప్రభుత్వ విధానమని సీఎం స్వయంగా ప్రకటించారు. అద్భుతాలు జరిగితే తప్ప జగన్‌ హయాంలో రాజధాని అమరావతి నుంచి విశాఖకు వెళ్లటాన్ని ఎవరూ ఆపలేరు. అయితే అందుకోసం ఆయన వ్యూహాత్మకంగా కొంత సమయం తీసుకోవచ్చు. రాజకీయ పరిస్థితులు అనుకూలించినపుడు ఆయన తిరిగి దానిని తెరమీదకు తేవచ్చు. నిజానికి, మోడీ లాంటి వారే రాజకీయ పరిస్థితులకు తలొగ్గాల్సి వచ్చింది. విధానం మార్చుకోవాల్సి వచ్చింది. నూతన వ్యవసాయ చట్టాల వల్ల రాజకీయంగా నష్టం జరుగుతుందని గ్రహించారు కాబట్టే వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకున్నారు. ఇటీవలి ఉప ఎన్నికల్లో ఓటమి…రాబోయే యూపీ ఎన్నికల దృష్ట్యా అది తప్పలేదు. కాబట్టి రాజకీయ పరిస్థితులను బట్టి ప్రభుత్వ విధానాలు మారతాయి.

ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రధాన రాజధానిని అమరావతి నుంచి విశాఖకు మార్చాలని జగన్‌ అనుకుంటున్నారు. అమరావతిని తరలిస్తే రాష్ట్రంలో ఓడిపోయే పరిస్థితి ఉంటే తప్ప జగన్‌ ఈ విషయంలో వెనకడుగు వేయడు. ఆ పరిస్థితే వస్తే జగనే కాదు ఏ నాయకుడూ ఆ సాహసం చేయడు. కానీ అమరావతి సెంటిమెంట్‌ ఎన్నికలను ప్రభావితం చేయగలిగినంత రాజకీయ ప్రభావం చూపలేదు. రాజకీయంగా అధిక మూల్యం చెల్లించాల్సి వస్తేనే జగన్‌ పునరాలోచించే అవకాశం ఉంటుంది.

ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో వైసీపీకి గణనీయంగా సీట్లు సాధించింది. దక్షిణ కోస్తాలో కొంత నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అయితే ఆ నష్టాన్ని కూడా తగ్గించుకునే అవకాశం జగన్‌ ముందు ఉంది. జగన్‌ ప్రభుత్వ విధానం మూడు రాజధానులు అయినప్పటికీ దానికి ఆయన కాలపరిమితి పెట్టలేదు. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది. ఈ లోగా అమరావతి అభివృద్ధిపై దృష్టి పెడితే మంచింది. అభివృద్ధి ముందు రాజధాని సెంటిమెంట్‌ బలహీనపడుతుంది. ఎందుకంటే ఒక ప్రాంతంలో ప్రజలు కోరుకునేది వ్యాపారాభివృద్ధి, ఉద్యోగావకశాలు.. ఆర్థిక పరిపుష్టి..పెట్టుబడులు. ఇవి ఉంటే చాలు క్యాపిటల్‌ గురించి పెద్దగా ఆలోచించరు. అప్పుడు అమరావతి నుంచి రాజధానిని విశాఖకు తరలించటం జగన్‌కు సులభం అవుతుంది. రాజకీయ నష్టం కూడా ఉండదు. కానీ జగన్‌ మొదటి నుంచీ అమరావతిని నిర్లక్ష్యం చేశాడు. ఎలా చూసినా ఈ నిర్లక్ష్యం న్యాయం తగదు. కాబట్టి ఇప్పటికైనా అమరావతి అభివృద్ధికి ఉపక్రమిస్తే అది అయనకే మంచిది!!
-Dr.Ramesh Babu Bhonagiri

Related Articles

Latest Articles