హుజురాబాద్‌లో టీఆర్ఎస్‌, బీజేపీ లెక్కలేంటి?

హుజురాబాద్‌ ఉపఎన్నికలో హోరాహోరీగా తలపడుతున్న టీఆర్ఎస్‌, బీజేపీ లెక్కలేంటి? ఎవరు ఏం అంశాలపై ఎక్కువ నమ్మకం పెట్టుకున్నారు? వారి అంచనాలు పోలింగ్‌ నాటికి వర్కవుట్‌ అవుతాయా?

ఇన్నాళ్టి ప్రచారంలో బీజేపీ, టీఆర్ఎస్‌ సాధించింది ఏంటి?

గడియారం గిర్రున తిరుగుతోంది. హుజురాబాద్‌లో పోలింగ్‌కు నెల రోజుల సమయం కూడా లేదు. పార్టీల వ్యూహాల స్పీడ్‌ పెరిగింది. ఎత్తులు పైఎత్తులు వేస్తున్నాయి. నాలుగు నెలలుగా హుజురాబాద్‌ నియోజకవర్గంలో ప్రచారం హోరెత్తిస్తోన్న ఈ రెండు పార్టీలు.. ఇప్పుడు మరిన్ని శక్తులను మోహరిస్తున్నాయి. షెడ్యూల్‌ రాకమునుపు జరిగిన ప్రచారం ఒక ఎత్తు అయితే.. షెడ్యూల్‌ వచ్చాక వేయాల్సిన రణతంత్రపు వ్యూహాలు మరోఎత్తు. అయితే ఇన్నాళ్టి ప్రచారంలో బీజేపీ, టీఆర్‌ఎస్‌ సాధించింది ఏంటి? ఏ అంశాలపై ఫోకస్‌ పెట్టి పైచెయ్యి సాధించారు అన్నది ప్రశ్నగా ఉంది.

సొంత కేడర్‌ను నమ్ముకున్న ఈటల?

హుజురాబాద్‌ నుంచి గెలుస్తుండటంతో ఈటల రాజేందర్‌కు స్థానికంగా ఆయనకు అనుచర వర్గం ఉంది. నియోజకవర్గ ప్రజలకు ఆయన్ని కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఇప్పుడు ఈటలకు బీజేపీ శ్రేణులు తోడయ్యాయి. ఈటల టీఆర్ఎస్‌లో ఉన్నంత సేపూ.. ఆయన వెంట తిరిగిన కేడర్‌లో చాలామంది జారుకున్నారు. దీంతో సొంత కేడర్‌నే ఎక్కువ నమ్ముకున్నారట మాజీ మంత్రి. ఆయన ప్రచారంలో వెంట నడుస్తోంది కూడా వారేనట. ఈ ఉపఎన్నిక తనవాళ్లు ఎవరో.. తనవాళ్లు కానివారు ఎవరో స్పష్టత వచ్చిందని.. ఉన్న కొద్దిమంది బలంతోనే గట్టిగా పోరాడతామని చెబుతున్నారు ఈటల. ప్రజల మద్దతు ఉన్నందున గెలుపు ఈజీ అనే దీమాతో ఉంది ఈటల శిబిరం. గ్రామస్థాయిలో ఉన్న కేడర్‌.. గెలుపు తీరాలకు చేరుస్తుందని లెక్కలు వేసుకుంటున్నారట. అయితే అధికారపార్టీ ప్రలోభాలకు లొంగకుండా అనుచరులను కాపాడుకోవడమే ఈటలకు పెద్ద సవాల్‌.

టీఆర్ఎస్‌ సీనియర్‌ నేతలు హుజురాబాద్‌లో మకాం..!
నేతలనే గులాబీ పార్టీ నమ్ముకుందా?

షెడ్యూల్‌ రాకముందే అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ను ఖరారు చేసింది టీఆర్ఎస్‌. అందరికంటే ముందుగానే నామినేషన్ దాఖలు చేసింది. ఈటల రాజీనామాను ఆమోదించిన మరుక్షణం ఫీల్డ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన గులాబీ శ్రేణులు సిట్టింగ్‌ స్థానాన్ని నిలబెట్టుకునే విధంగా ఎన్నికల వ్యూహం రచిస్తున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు.. పార్టీ సీనియర్ నేతలు హుజురాబాద్‌లోనే మకాం వేశారు. టీఆర్ఎస్‌కు చెందిన స్థానిక ప్రజాప్రతినిధులు ఈటల శిబిరంలోకి వెళ్లకుండా గాలం వేశారు. కుల సంఘాలు.. ప్రజా సంఘాలను వదల్లేదు. తమ ఫ్రేమ్‌లోకి వచ్చిన వారు జారిపోకుండా.. కారు గుర్తుకే ఓటు వేసేలా నిఘా పెట్టారు. వారికో నేతను అటాచ్‌ చేశారు. ప్రజల మూడ్‌ ఏంటో కానీ.. టీఆర్ఎస్‌లో కీలక నాయకులు అనుకున్నవారంతా ప్రస్తుతం హుజురాబాద్‌లో కనిపిస్తున్నారు. దీంతో హుజురాబాద్‌లో గెలిచేందుకు అధికార పార్టీ నేతలను నమ్ముకుందని చెవులు కొరుక్కుంటాయి గులాబీ శ్రేణులు.

నామినేషన్ల ఘట్టం ముగియగానే ప్రచారం పీక్‌కు వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. దుబ్బాక, నాగార్జున సాగర్‌ ఉపఎన్నికకంటే భిన్నంగా రెండు పార్టీలు వ్యూహ రచన చేస్తుండటంతో ఉత్కంఠ పెరిగిపోతోంది. ఇలాంటి తరుణంలో టీఆర్ఎస్‌, బీజేపీలు వేసుకుంటున్న లెక్కలు ఎంత వరకు వారికి కలిసి వస్తాయో చూడాలి.

-Advertisement-హుజురాబాద్‌లో టీఆర్ఎస్‌, బీజేపీ లెక్కలేంటి?

Related Articles

Latest Articles