‘ట్రిపుల్ ఆర్’లో అజయ్, అలియాభట్ పారితోషికం ఎంత?

ఒమిక్రాన్ వణికిస్తున్న నేపథ్యంలో జనవరి 7నే బాక్సాఫీస్ బరిలో దూకాల్సిన రాజమౌళి మేగ్నమ్ ఒపస్ ‘ట్రిపుల్ ఆర్’ విడుదల వాయిదా పడింది. ఈ సినిమాలో జూ.యన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించారు. ఈ సినిమా కోసం దాదాపు మూడేళ్ళు ఏ సినిమాలోనూ నటించకుండా వారిద్దరూ పనిచేశారు. ‘ట్రిపుల్ ఆర్’లో నటించినందుకు జూనియర్, చెర్రీ ఎంత పుచ్చుకున్నారు అనే దానిపై పలు కథలు వినిపిస్తున్నాయి. అదలా ఉంచితే ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించిన బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగణ్, అలియా భట్ ఎంత తీసుకున్నారో తెలుసా!?

‘ట్రిపుల్ ఆర్’లో అజయ్ దేవగణ్ కనిపించేది కాసేపే. అయితేనేమి, ఆయన బాలీవుడ్ లో ఓ సినిమాకు ఎంత తీసుకుంటారో, అంతే పారితోషికాన్ని’ట్రిపుల్ ఆర్’లోనూ అందుకున్నారట. అందుతున్న సమాచారం బట్టి ‘ట్రిపుల్ ఆర్’లో అజయ్ దేవగణ్ నటించినందుకు రూ.35 కోట్లు చేజిక్కించుకున్నారట! ఇక అలియా భట్ కు ఆమె బాలీవుడ్ లో ఒక సినిమాలో హీరోయిన్ గా నటించడానికి 9 లేదా 10 కోట్ల రూపాయలు తీసుకుంటుందట. ‘ట్రిపుల్ ఆర్’లో అలియా ప్రధాన నాయిక అయినా, ఆమె పాత్ర చిత్రంలో కనిపించేది పాతిక నిమిషాలేనట! అయనా కూడా ఆమెకు రూ.9 కోట్ల పారితోషికం ముట్టినట్లు వినిపిస్తోంది.

అజయ్ దేవగణ్, అలియా భట్ కు బాలీవుడ్ లో వారు అందుకొనే పారితోషికమే అందించడానికి కారణమేంటి? ‘ట్రిపుల్ ఆర్’ ఉత్తరాదిన అలరించాలంటే, కేవలం ‘బాహుబలి’ డైరెక్టర్ రాజమౌళి చిత్రం అన్న ముద్ర చాలదు. ఉత్తర భారతంలో క్రేజ్ ఉన్న బాలీవుడ్ స్టార్స్ లో అజయ్ దేవగణ్, అలియా భట్ ఇద్దరూ ఉన్నారు. ఇక కుర్రకారు అలియాను చూసి కిర్రెక్కిపోతుంటారు. అందువల్ల వారిద్దరూ ‘ట్రిపుల్ ఆర్’కు ఎస్సెట్ అవుతారనే దర్శకనిర్మాతలు ఆ ఇద్దరికీ అంత పారితోషికాలు ముట్టచెప్పినట్టు తెలుస్తోంది. అజయ్, అలియాకే ఇంత రెమ్యూనరేషన్స్ ఇచ్చిన నిర్మాత, మరి తారక్, చెర్రీకి ఏ స్థాయిలో ఇచ్చి ఉంటారో అన్న దానిపైనా చర్చ సాగుతూనే ఉంది.

Related Articles

Latest Articles