కుప్పంలో టీడీపీ ఓటమికి కారణం ఏంటి…?

టీడీపీ కంచుకోట బద్ధలైంది. 35 ఏళ్లుగా కుప్పాన్ని తన అడ్డాగా చేసుకున్న చంద్రబాబుకు వరసగా కుప్పం ప్రజలు షాక్‌ ఇస్తున్నారు. అసలు ఎందుకు ఈ వరస ఓటములు? పట్టు తప్పడానికి కారణం ఏంటి? అన్నింటికీ ఆయనే కారణమా?

చంద్రబాబు చేసిన.. చేస్తున్న తప్పులే ఓటమికి కారణమా?

రాజకీయాల్లో గెలుపోటములు సహజం. కానీ.. అదే కంచుకోటకు బీటలు వారితే మాత్రం ఆలోచించాల్సిన విషయం. ప్రస్తుతం అలాంటి పరిస్థితే టీడీపీ అధినేత చంద్రబాబుకు ఎదురైంది. ఒకటి కాదు రెండు కాదు ఏడుసార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన నియోజకవర్గం. స్వయంగా వచ్చి నామినేషన్ వేయకపోయినా.. చంద్రబాబును అసెంబ్లీకి పంపిస్తున్న కుప్పం ప్రజలు ఆయనకు వరసగా షాక్‌ ఇస్తున్నారు. చంద్రబాబుపై ఉన్న వ్యతిరేకత వల్ల వచ్చిన ఫలితాలా? లేక మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యూహమా అంటే ఎక్కువ భాగం అందులో టీడీపీ అధినేత చేసిన.. చేస్తున్న తప్పులే అనే మాట ఎక్కువగా వినిపిస్తుంది.

పంచాయతీ, పరిషత్‌ ఎన్నికల్లోనూ బాబుకు షాక్‌..!

గత అసెంబ్లీ ఎన్నికల్లో మొదటి రెండు రౌండ్స్‌లో ముందంజలో ఉన్న చంద్రబాబుకు వైసీపీ షాక్‌ ఇచ్చింది. పంచాయతీ ఎన్నికల్లో సైతం మైండ్‌ బ్లాంక్‌ అయ్యేలా చేసింది. మంత్రి పెద్దిరెడ్డి డైరెక్షన్‌లో కుప్పంలో టీడీపీ రికార్డ్‌ను ఊడ్చేసింది వైసీపీ కేడర్‌. మొత్తం 89 పంచాయతీలలో వైసీపీ 74, టీడీపీ 14, కాంగ్రెస్‌ ఒకటి గెలిచాయి. దీంతో వైసీపీ నేతల్లో కాన్ఫిడెన్స్‌ పెరిగిపోయింది. చంద్రబాబు కంచుకోటను బద్దలు కొడతామని.. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో సీన్‌ రిపీట్‌ చేస్తామని సవాల్‌ విసిరారు వైసీపీ నేతలు. వీటిని చంద్రబాబు అండ్‌ కో పట్టించుకోలేదు. పైగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సమంలో పోటీ చేయకూడదని పార్టీ నిర్ణయం తీసుకుంది. అయినప్పటికీ కుప్పంలో స్థానిక టీడీపీ నేతలు బరిలో దిగారు. అన్నిచోట్లా పోటీ చేశారు. 66 ఎంపీటీసీల్లో 63, నాలుగు జడ్పీటీసీ స్థానాలను, నాలుగు ఎంపీపీలను వైసీపీ గెల్చుకుంది. టీడీపీ సానుభూతి పరులు ముగ్గురే ఎంపీటీసీలుగా గెలిచారు.

కుప్పం మున్సిపల్‌ పోరులోనూ అదే సీన్‌..!

ఇలా కుప్పంలో జైత్రయాత్ర కొనసాగిస్తూ.. కుప్పం మున్సిపల్‌ పోరులోనూ వైసీపీ చరిత్ర రాసింది. టీడీపీ ఎలా గెలుస్తుందో చూస్తామని సవాల్‌ చేసి మరీ మున్సిపల్‌ పీఠాన్ని వైసీపీ కైవశం చేసుకుంది. మొత్తం 25 వార్డుల్లో 19 చోట్ల వైసీపీ గెలిచింది. టీడీపీకి దక్కింది ఆరు వార్డులే. పంచాయతీ, పరిషత్‌ ఎన్నికలను లైట్‌ తీసుకున్న చంద్రబాబు.. మున్సిపాలిటీని మాత్రం సీరియస్‌గా తీసుకున్నారు. మూడు రోజులు కుప్పంలో ప్రచారం చేశారు. ఆయన తనయుడు లోకేస్‌ సైతం రెండు రోజులు తిరిగారు. పార్టీ కీలక నేతలంతా కుప్పంలోనే ఉన్నా ఫలితాలు మాత్రం టీడీపీకి షాక్‌ ఇచ్చాయి.

బాబు ప్రతినిధుల తీరుపై ఐదేళ్లుగా కుప్పం తమ్ముళ్లు ఆగ్రహం..!

ఒక రకంగా ఇది చంద్రబాబుకు కోలుకోలేని దెబ్బగా లోకల్‌ టాక్‌. ఇంతిలా బాబు ఇమేజ్‌ కుప్పంలో డ్యామేజ్‌ కావడానికి టీడీపీ అధినేత సొంత తప్పిదాలే కారణం అంటున్నారు. తన ప్రతినిధులుగా కుప్పంలో చెలామణి అయిన మాజీ ఎమ్మెల్సీ గౌరివాణి శ్రీనివాసులు, పీఏ మనోహర్‌లపై గత ఐదేళ్లు తీవ్రస్థాయిలో తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారు పార్టీలో ఉండకూడదని పలుమార్లు కేడర్‌ గొంతు చించుకున్నా చంద్రబాబు పట్టించుకోలేదు. చెప్పిన మాట చంద్రబాబు వినక .. ఆ ఇద్దరు నేతలు మారక.. మున్సిపల్ పోరులో చాలా మంది కీలక నేతలు పార్టీకి దూరంగా ఉండిపోయారు.

తనకోసం నిలబడే వారిని కుప్పంలో బాబు తయారు చేసుకోలేదా?

చంద్రబాబుకు కుప్పంలో తనకంటూ సొంత వారు లేకపోవడం పెద్ద మైనస్‌గా చెబుతున్నారు. కుప్పంలో వైసీపీ దొంగ ఓట్లు వేసింది.. డబ్బులు పంచారు.. వ్యవస్థలను వాడుకున్నారు అని టీడీపీ విమర్శలు చేసింది. ఇదే పరిస్థితి హుజురాబాద్‌లోనూ ఉన్నా.. తనకంటూ సొంత వర్గాన్ని ఏర్పాటు చేసుకున్న ఈటల రాజేందర్‌ను అక్కడి ప్రజలు గెలిపించారు. మరి.. అదే ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి.. 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబుకు సొంత నియోజకవర్గంలో ఎందుకు ఆ పరిస్థితి అనేది ఆలోచించాల్సిన అంశంగా టీడీపీలో చర్చ మొదలైంది. ఎంత మంది వచ్చినా ఎన్ని ప్రలోభాలు పెట్టినా నేతకే అండగా ఉండాలనే ఆలోచన కిందిస్థాయిలో లేకపోవడానికి కారణం స్వయంకృతమే అంటున్నారు. కొంతమంది టీడీపీ కేడర్‌ వైసీపీతో చివరి వరకు పోరాడినా.. అది సరిపోలేదని.. అర్థం అవుతోంది. దేశ రాజకీయాలను శాసించాను అని చెప్పుకొనే చంద్రబాబు సొంత నియోజకవర్గంలో తన కోసం నిలబడేవారిని తయారు చేసుకోలేదు.

సీఎం జగన్‌ ఒక్కసారి కూడా కుప్పానికి వెళ్లలేదు..!

ఇంకా చెప్పాలంటే వైసీపీ అధికారంలోకి వచ్చాక సీఎం జగన్‌ కుప్పానికి ఒక్కసారి కూడా వెళ్లలేదు. చంద్రబాబు ఒకటికి ఐదుసార్లు పర్యటించారు. అయినా కుప్పం ఓటర్లు సీఎం జగన్‌కే జై కొట్టారు. చంద్రబాబును కుప్పంలో ఓడిస్తామని ప్రతి ఎన్నికల ముందు సవాల్‌ చేసి మరీ సత్తా చాటుతున్నారు మంత్రి పెద్దిరెడ్డి. వారిలో అంత కాన్పిడెన్స్‌ రావడానికి చంద్రబాబు చేసిన.. చేస్తున్న తప్పిదాలే కారణం అన్నది మరోసారి రుజువైందని చెబుతున్నారు.

Related Articles

Latest Articles