హుజురాబాద్‌లో ఓటరు మదిలో ఏముంది?

హుజురాబాద్‌లో గాలి ఎటువైపు వీస్తుందో ఎవరికీ అంతుబట్టటం లేదు. ఓటరు నాడి పట్టుకోవటంలో పార్టీలు విఫలమయ్యాయి. నిజానికి ఈ ఎన్నికలు ఇద్దరు నేతల మధ్య జరుగుతున్న యుద్ధంగా ఓటరు భావిస్తున్నాడు. అందుకే ఎటువైపు వెళ్లాలో తేల్చుకోలేకపోతున్నాడు. అయితే నియోజకవర్గంలో వివిధ వర్గాల వారిని కలిసి వారితో సంభాషించినపుడు.. ఓటరు మదిలో ఏముందో కొంతైనా అర్థమవుతుంది. ఈ ఎన్నికలు ఎందుకు వచ్చినా.. కారణం ఏదైనా.. ఈటల రాజేందర్‌ స్థానిక నేత. ఆయనకు స్థాన బలం సహజం. మరోవైపు టీఎస్‌ఆర్‌ సంక్షేమ పథకాలు శక్తివంతమైనవి. ఈ రెండు అంశాల మీదే హుజూరాబాద్‌ ఓటరు ఈనెల 30న తీర్పు ఇవ్వబోతున్నాడు.

‘ఈటల రాజేందర్‌ వల్లే తమ గ్రామం అభివృద్ధి చెందింది. ఆయనకు మరో అవకాశం ఇవ్వటం న్యాయం’. ఓ సాధారణ చిరు వ్యాపారిని అడిగినపుడు వచ్చిన సమాధానం ఇది.

‘కేసీఆర్‌ మాకు పెన్షన్‌ ఇస్తున్నారు. దళిత బంధు డబ్బు ఇప్పటికైతే అందలేదు.. కానీ అందరికీ అందుతుందన్న నమ్మకం ఉంది. రైతులు కూడా కేసీఆర్‌ పథకాల నుంచి లబ్ధి పొందుతున్నారు’. ఇది ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ది పొందుతున్న ఓ సాధారణ మహిళను కదిలిస్తే వచ్చిన సమాధానం.

‘ఈటల రాజేందర్‌ అంటే అందరికీ మంచి అభిప్రాయమే ఉంది. అయితే ఆయన ఇండిపెండెంట్‌గా పోటీ చేసి ఉంటే బాగుండేది. ఈటల నిప్పులాంటి మనిషే అయితే, అధికార పార్టీని ఎదుర్కోవాలనే దమ్ము నిజంగా ఉంటే స్వతంత్రంగా పోరాడాల్సింది. తనను తాను కాపాడుకునేందుకే ఆయన బీజేపీలో చేరారు’. ఇది రాజకీయ అవగాహన కలిగిన ఓ యువకుడి విశ్లేషణ.

రాజేందర్‌పై జనం సానుభూతితో ఉన్నారు. ఆయన పార్టీ మారినప్పుడు మేం కూడా మారాం. ఆయనకు అండగా ఉండటానికి కారణం ఆయన చేసిన పనులే. ఆయన ఎప్పుడూ అందుబాటులో ఉండేవారు.. ఎవరైనా ఆయన వద్దకు పనిమీద వెళితే… అయితే అవుతుంది… కాదంటే కాదని స్పష్టంగా చెప్పేవారు’. ప్రజాప్రతినిధిగా ఈటల పనితీరుపై సంతృప్తిగా ఉన్నవారు చేసిన వ్యాఖ్యలు ఇవి.

‘నియోజకవర్గంలో ఈటల పనితీరుకు కృతజ్ఞత చూపాల్సిందే. రాష్ట్రంలోని మిగతా గ్రామాల కన్నా మా గ్రామం చాలా మెరుగని నమ్ముతున్నాం. పార్టీ మారినంత మాత్రాన ఆయనను పక్కన పెట్టలేం’. ఇది ఓ సాధారణ ఓటరు అభిప్రాయం.

నిజం చెప్పాలంటే ఇప్పుడు హుజురాబాద్‌లో జరుగుతున్న పోరు ఈటల వర్సెస్‌ కేసీఆర్‌. ఈటల ఎన్నికల సభ నిండా బీజేపీ జెండాలు రెపరెపలాడాయి. అయినా ఇవి బీజేపీ సాధారణ ఎన్నికల సభలకు భిన్నంగా ఉన్నాయి. హుజూరాబాద్ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షా అంటే పెద్ద ఆకర్షణ లేదు.. ఈటల మాత్రమే ఇక్కడ ప్రధాన ఆకర్షణ. “ఒక్క నియోజకవర్గంలోనే వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసిన పరిస్థితి గతంలో ఎన్నడూ లేదు. వేల కోట్లు వెచ్చించి ప్రజలను మభ్యపెట్టి ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి లేదు. ఇది దాదాపు ఆరు నెలలుగా జరుగుతోంది. ఇన్ని దావత్‌లు, హామీలు, భారీ ఎత్తున ఖర్చు. కానీ చివరికి ధర్మం, న్యాయం గెలుస్తుంది తప్ప డబ్బు సంచులతో కూడిన దుష్ట శక్తులు కాదని హుజూరాబాద్ ప్రతి ఒక్కరికీ నిరూపించబోతోంది”.. ప్రతి ఎన్నికల సభలో ఈటల రాజేందర్‌ దాదాపు ఇవే మాటలు చెప్పారు. ఈటల నియోజకవర్గంలో అందరికీ అందుబాటులో ఉండే నేత. ప్రతి ఒక్కరితో వ్యక్తిగత అనుబంధాన్ని కలిగిన నేత. ఇది ఆయన బలం. అయితే.. ఈటల స్థానిక ప్రయోజనాన్ని ఎదుర్కోవడానికి టీఆర్‌ఎస్ సంక్షేమ పథకాలపై ఆశలు పెట్టుకుంది. ఏడేళ్లు మంత్రిగా ఉండి కూడా నియోజకవర్గానికి ఆయన ఏమీ చేయలేదని ప్రచారం చేసింది. మరి దీనిని హుజురాబాద్‌ ప్రజలు దీనిని విశ్వసిస్తారా?

మరోవైపు ఈటలపై గెలుపుకు టీఆర్‌ఎస్‌ పక్కాగా ప్లాన్‌ చేసింది. గత నాలుగు నెలలుగా హుజురాబాద్‌లోని వివిధ వార్డుల్లో టీఆర్ఎస్ ఇంఛార్జీలు, యువజన నాయకులు మకాం వేశారు. ప్రతి గ్రామానికి ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది. ప్రతి 100 మంది ఓటర్లకు ఒక వ్యక్తి ఇన్‌ఛార్జ్‌గా ఉంటాడు. ఇప్పుడు యుద్ధం నెక్ టు నెక్, ఎవరు గెలిచినా తక్కువ తేడాతో మాత్రమే విజయం సాధిస్తారని టీఆర్‌ఎస్‌ వర్గాలు చెబుతున్నాయి. హుజురాబాద్‌లో బీజేపీకి అంతగా ఉనికి లేదు. 2018 ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థి కేవలం 1,683 ఓట్లను మాత్రమే సాధించారు, ఇది నోటా ఓట్ల (2,867) కంటే కూడా తక్కువ. అయితే రాజేందర్ చేరికతో బీజేపీకి బలం చేకూర్చింది. 2009 నుంచి టీఆర్‌ఎస్‌ తరఫున రాజేందర్‌ గెలుస్తూ వస్తున్నారు. ఈ సారి కూడా ఆయన గెలుపు తధ్యమని.. ఆయనకు 60శాతం వరకు విజయావకాశాలు ఉన్నాయని ఆ పార్టీ నేతలు అంటున్నారు.

దాదాపు 20 ఏళ్లుగా ఈటల అంటే కారు గుర్తు. నియోజకవర్గ ప్రజలకు ఇది అలవాటైపోయింది. అదే ఇప్పుడు ఆయనకు సమస్యగా మారింది. చాలా మంది కారు గుర్తుకు ఓటు వేయవచ్చని బీజేపీ ఆందోళన చెందుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకునే ఆ పార్టీ కార్యకర్తలు డమ్మీ ఈవీఎం మెషీన్లను తీసుకువెళుతున్నారు. ఇకపై ఈటలది కారు గుర్తు కాదని ప్రతి గ్రామంలో వివరిస్తున్నారు.

ఈ ఎన్నికల్లో నగదు పంపిణీ కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. బీజేపీ, టీఆర్‌ఎస్ రెండూ పోలింగ్‌కు ముందు ప్రతి ఓటరుకు రూ.5వేల చొప్పున అందిస్తున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. న్యూట్రల్‌ ఓటర్లు టీఆర్ఎస్, బీజేపీ రెండింటి నుంచి డబ్బు అందుకుంటున్నారని స్థానికులు చెబుతున్నారు.

హుజురాబాద్ మొత్తం ఓటర్లలో 50 శాతం బీసీలే. అయితే టీఆర్‌ఎస్‌, బీజేపీ అభ్యర్థులు ఇద్దరూ ఈ సామాజిక వర్గానికి చెందినవారే. అయితే ఇక్కడ జరిగేది ముక్కోణ పోటీనే అయినా కాంగ్రెస్‌ అభ్యర్థి వెంకట్ బల్మూర్‌కి అవకాశం కనిపించటం లేదు. పైగా ఆయనను కాంగ్రెస్ పార్టీ చాలా ఆలస్యంగా అభ్యర్థిగా ప్రకటించింది. ఆయన అభ్యర్థిత్వాన్ని ముందుగా ప్రకటించి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదని ఆ పార్టీ కార్యకర్తలు అంటున్నారు. కౌశిక్ రెడ్డి అయితే కనీసం గెలుపు అవకాశాలను సజీవంగా ఉంచేవాడన్నది వారి అభిప్రాయం. ఈ పరిస్థితుల్లో కౌశిక్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లోకి వెళ్లకుండా కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసి ఉంటే తప్పకుండా గెలిచేవాడన్నది చాలా మంది మనసులోని మాట.

Read Also: ఓ వైపు బెట్టింగ్‌లు..మరోవైపు ప్రలోభాలు!

Related Articles

Latest Articles