ఇంకెన్నాళ్లీ అయోమయం… అసలు ఏవోబీలో ఏం జరుగుతోంది?

ఆంధ్రా ఒడిశా సరిహద్దులో.. శ్రీకాకుళం జిల్లాలోని మాణిక్యపట్నం గ్రామంలో తరచుగా నెలకొంటున్న ఉద్రిక్త పరిస్థితులు.. అక్కడి ప్రజలకు ఇబ్బందికరంగా మారాయి. ఆ ప్రాంతంలో ఉన్నవాళ్లు.. ఆంధ్రాలోనే ఉంటామని చెబుతున్నా.. మాణిక్యపట్నంపై ఒడిశా అధికారులు పట్టు పెంచుకోవాలని చూడడం.. అది తమ రాష్ర పరిధిలోని గ్రామమే అని వాదిస్తుండడం.. పదే పదే ఉద్రిక్తతలకు దారి తీస్తోంది. స్థానికులకు ఈ పరిణామం ఇబ్బందికరంగా పరిణమిస్తోంది.

ఈ మధ్య.. అతి చొరవ తీసుకుని మాణిక్యపట్నం గ్రామ తహసీల్దార్ కార్యాలయానికి సీల్ వేసి.. స్థానికుడైన నాయకుడు గురునాథం అనే వ్యక్తిని గారబంద పోలీసులు అరెస్ట్ చేయడంతో.. కలకలం మొదలైంది. ఈ విషయంపై.. శ్రీకాకుళం కలెక్టర్ తో పాటు.. ఒడిశాలోని పర్లాకిమిడి కలెక్టర్లు స్పందించడంతో.. అప్పటికప్పుడు సమస్య పరిష్కారమైంది. కానీ.. మంత్రి సీదిరి అప్పల్రాజు తాజా పర్యటన సందర్భంగా.. ఒడిశా అధికారులు మళ్లీ వివాదాస్పదంగా వ్యవహరించారు.

మంత్రి మాణిక్యపట్నం పరిసరాలకు వెళ్లిన సమయంలోనే.. సరిహద్దు గ్రామాలకు వెళ్లిన ఒడిశా లోని గజపతి జిల్లా అదనపు మెజిస్ట్రేట్ సంగారాం పండా.. ఆ రాష్ట్ర ఇతర అధికారులు.. మళ్లీ ఆంధ్రాకు చెందిన గిరిజనులను బెదిరించినట్టు వార్తలు వచ్చాయి. విషయం తెలిసిన వెంటనే మంత్రి ఆ ప్రాంతానికి వెళ్లి వారితో మాట్లాడారు. తమ వద్ద ఏవోబీ రికార్డులు సైతం ఉన్నాయని.. ఇలా తెలుగు వాళ్లను ఇబ్బంది పెట్టడం సరికాదని మంత్రి కాస్త ఆగ్రహించినట్టు తెలిసింది.

తమ వద్ద కూడా రికార్డులు ఉన్నాయని ఒడిశా అధికారులు చెప్పినా.. వాటిని చూపించలేదని సమాచారం. ఇదే సమయంలో గిరిజనులు మరోసారి తమ అభిప్రాయాన్ని స్పష్టం చేశారట. తాము ఆంధ్రాలోనే ఉంటామని తేల్చి చెప్పారట. ఇప్పటికే మావోయిస్టులు, పోలీసుల మధ్య జరుగుతున్న పోరుతో తాము ఇబ్బంది పడుతున్నామని.. ఇలా తరచుగా ఒడిశా అధికారులు ఇబ్బంది పెట్టవద్దని వేడుకుంటున్నారట.

ఒక్క మాణిక్య పట్నంలోనే కాదు.. ఆంధ్రా ఒడిశా సరిహద్దులోని మరికొన్ని గ్రామాలు సైతం.. ఈ ఇబ్బందిని ఎదుర్కొంటున్నాయి. సరిహద్దును సరిగ్గా నిర్ణయిస్తే.. ఎవరికీ ఇబ్బంది ఉండదు కదా.. అన్న అభిప్రాయం అక్కడి ప్రజలనుంచి వ్యక్తమవుతోంది. ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు చిత్తశుద్ధితో స్పందిస్తేనే.. తమ సమస్య పరిష్కారం అవుతుందని వారు చెబుతున్నారు.

Related Articles

Latest Articles

-Advertisement-