ఎయిరిండియా డీల్‌ లో ఎవరికి ఏమిటి?

ప్రభుత్వ రంగ సంస్థ ఎయిర్ ఇండియాని ప్రైవేట్‌కు అమ్మేయాలని కేంద్ర ప్రభుత్వం చాలా కాలంగా ప్రయత్నిస్తోంది. ఇప్పుడు ఆ ప్రయత్నాలు సఫలమయ్యాయి. ఎట్టకేలకు గత శుక్రవారం ఎయిర్ ఇండియా-AI లో తన వాటాలన్నింటినీ విక్రయించేసింది. దాంతో పాటు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ లిమిటెడ్ -AIXL, ఎయిర్ ఇండియా SATS ..అంటే ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్-AISATSలు కూడా ఇందులోకి వస్తాయి.

ఏడు దశాబ్దాల తరువాత ఎయిర్‌ ఇండియా తిరిగి తన మాతృ సంస్థ టాటాల చేతిలోకి వెళ్లింది. అంటే సొంత గూటికి చేరిందన్నమాట. ఎయిర్‌ ఇండియాని టాటా గ్రూప్ 1932 లో ప్రారంభించింది. అప్పట్లో దాని పేరు టాటా ఎయిర్‌ సర్వీసెస్‌. నాటి టాటా స‌న్స్ అధినేత జేఆర్డీ టాటా దీనిని ప్రారంభించారు. అందుకే ఆయనను భారత విమానయాన పిత అంటారు. 1938లో విదేశాల‌కు విమాన స‌ర్వీసుల‌ను విస్తరించింది.1947 లో స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ప్రభుత్వం అందులో 49 శాతం వాటా కొనుగోలు చేసింది. తరువాత 1953లో భారత ప్రభుత్వం ఆ మిగిలిన వాటాను కూడా కొనేయటంతో ఎయిరిండియా జాతీయమైంది.

భారత ప్రభుత్వం టేకోవర్‌ చేసిన అనతంరం కొన్ని దశాబ్దాల పాటు జాతీయ విమానయాన సంస్థ పౌర విమానయాన రంగంలో ఆధిపత్యం చెలాయించింది. ఐతే, 90 దశకం మొదట్లో మొదలైన ఆర్థిక సరళీకరణలో భాగంగా ప్రైవేట్ సంస్థలు ఈ రంగంలో దిగాయి. దాంతో తీవ్ర పోటీ ఎదురుకావటం..ప్రైవేట్‌ విమానయాన సంస్థల ఆధిపత్యంతో ఎయిర్‌ ఇండియా మునపటి ప్రాధాన్యతను కోల్పోయింది.ఎయిర్‌ ఇండియా విషయంలో ప్రభుత్వం సరళీకరణ మంత్రాన్ని జపించటంలో విఫలమైంది.

2007 వరకు ఎయిర్‌ ఇండియా అంతర్జాతీయ విమానాలను నడిపింది. దాని వల్ల వచ్చిన నష్టాలను తగ్గించేందుకు దేశీయ విమానయాన సంస్థ ఇండియన్ ఎయిర్‌లైన్స్‌లో దానిని విలీనం చేశారు. 2007 నుంచి ఈ విమానయాన సంస్థ ఏనాడూ లాభాల్లో లేదు. దాని పేలవ ప్రదర్శనకు ఇది ఒక ఉదాహరణ.

వాస్తవానికి 2009-10 నుంచి ప్రభుత్వం (పరోక్ష పన్ను చెల్లింపుదారుడు) లక్షా పది వేల కోట్లు దీనిపై ఖర్చు చేసింది. నష్టాలను నేరుగా భర్తీ చేయడానికి, లేదంటే రుణాల పేరుతో ఇంత సొమ్ము వెచ్చించవలసి వచ్చింది. ఆగస్టు 2021 నాటికి ఎయిరిండియా అప్పు 61 వేల 562 కోట్ల రూపాయలు. అంతేకాకుండా ఎయిరిండియాతో ప్రతిరోజు ప్రభుత్వానికి 20 కోట్ల నష్టం వాటిల్లుతోంది. అంటే సంవత్సారానికి 7 వేల 300 కోట్ల రూపాయలు.

చాలా ఏళ్లుగా పదే పదే నష్టాల్లో కూరుకుపోతుప్పుడే దీనిని ఎందుకు ప్రైవేట్‌ పరం చేయలేదు? ఇప్పుడే ఎందుకు అమ్మాల్సి వచ్చింది? అనే ప్రశ్నలు వస్తున్నాయి. పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా ప్రభుత్వ వాటాను తగ్గించడానికి మొదటి ప్రయత్నం 2001 లో నాటి ఎన్‌డీఏ హయాంలో జరిగింది. కానీ, 40 శాతం వాటా ఉపసంహరణ కొసం చేసిన ఆ ప్రయత్నం విఫలమైంది. ఏటేటా ఎయిరిండియా పరిస్థితి దిగజారుతూ వచ్చింది. దాంతో ఏదో ఒక రోజు దానిని ప్రైవేట్‌ వారికి అమ్మేయక తప్పదని ప్రభుత్వంతో సహా అందరికీ స్పష్టంగా తెలిసొచ్చింది. 2018 లో నరేంద్ర మోడీ ప్రభుత్వం మొదటి పదవీకాలంలో ప్రభుత్వ వాటా ఉపసంహరణకు మరొక ప్రయత్నం చేసింది. 76 శాతం వాటాను అమ్మకానికి పెట్టింది. కానీ దీనికి ఏ ఒక్కరి నుంచీ స్పందన రాలేదు.

2020 జనవరిలో మరోసారి ప్రయత్నం మొదలైంది. కరోనా ప్రభావం విమానయానంపై అత్యంత ఘోరంగా చూపింది. ఐనా, ప్రభుత్వం ఎట్టకేలకు ఎయిరిండియాను నూటికి నూరు శాతంతో అమ్మేయటంలో విజయవంతమైంది. అయితే ఇన్నేళ్లూ కానిది ఈ క్లిష్ల సమయంలో ఎలా సాధ్యమైంది? అంటే, ఇన్నాళ్లూ ఎయిర్‌ ఇండియా ప్రైవేటీకరణలో ప్రధానంగా రెండు అడ్డంకులు ఉండేవి. మొదటిది ప్రభుత్వ వాటా. ప్రభుత్వ వాటా ఎంత చిన్నమొత్తంలో అయినా సరే ..అది ఉన్నంత కాలం ప్రైవేట్‌ సంస్థలు ఆసక్తి చూపలేదు. ప్రభుత్వ వాటా కేవలం 24 శాతమే కావచ్చు..కానీ ఇంత పెద్ద మొత్తంలో అప్పుల్లో కూరుకుపోయిన సంస్థను నడపాలంటే వారికి ఆపరేషనల్‌ ఫ్రీడం అవసరం. అందుకే, మునపటిలా కాకుండా ప్రభుత్వం ఈసారి 100 శాతం వాటాని అమ్మకానికి పెట్టింది.

ఇక రెండో అడ్డంకి అప్పులు. ఎయిర్‌లైన్స్‌తో పాటు ఈ అప్పుల భారంలో కొంత కొనుగోలుదారులు కూడా భరించాలని ప్రభుత్వం షరతు పెడుతూ వచ్చింది ఇన్నాళ్లు. ఎంత భరించాలో కూడా ప్రభుత్వమే నిర్ణయించింది. కానీ ఆ ఆలోచన అది పనిచేయలేదు. అయితే ఈ సారి మునపటిలా కాకుండా ఎంత అప్పు కట్టగలుగుతారన్నది బిడ్లర్లకే వదిలేసింది. ఈ రెడ్డు అడ్డంకులు తొలగటంతో ఈసారి బేరం సులభంగా కుదిరింది. అయితే ఈ అమ్మకానికి ఉన్న ప్రాధాన్యత ఏమిటి? అని అంటే, ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వ పాత్రను తగ్గించడంలో ప్రధాని మోడీ నిబద్ధతను ఇది నొక్కి చెబుతుంది. ఎయిర్‌ ఇండియా రోజువారీ నష్టాలకు చెల్లించకుండా పన్ను చెల్లింపుదారులను కాపాడామని ఆయన చెప్పుకోవచ్చు.

డబ్బు పరంగా చూస్తే ప్రస్తుత సంవత్సరం ప్రభుత్వ పెట్టుబడుల లక్ష్యాన్ని సాధించడానికి ఈ ఒప్పందంతో పెద్దగా ఒరిగిందేమీ లేదు. అంతేకాకుండా మొత్తం ఎరయిరిండియా అప్పు 61 వేల 562 కోట్ల రూపాయలో టాటాలు కేవలం 15 వేల 300 కోట్లు మాత్రమే భరిస్తారు. దానికి అదనంగా 2 వేల 700 కోట్ల నగదును ప్రభుత్వానికి చెల్లిస్తారు. అయినా ప్రభుత్వంపై 43 వేల 562 కోట్ల అప్పు భారం మిగిలింది. ఎయిరిండియా భవనాలు వంటి ఆస్తులతో 14 వేల 718 కోట్లు రాబట్టవచ్చు. అప్పటికీ ప్రభుత్వం మరో 28 వేల 844 కోట్ల అప్పుతో మిగిలిపోతుంది. ఇంత మొత్తంలో అప్పు భారంతో ప్రభుత్వానికి బాధ లేదు.. గుదిబండలా మారిన ఎయిరిండియాను వదిలించుకున్న ఆనందమే ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తోంది.

ఏదేమైనా, ఇది టాటాలకు మంచి అవకాశం అంటున్నారు మార్కెట్‌ విశ్లేషకులు. భారతదేశ విమానయాన రంగం ఏటా 20 శాతం వృద్ధి చెందుతోంది. మార్కెట్ సామర్థ్యం ఇంకా పూర్తి స్థాయి వినియోగంలోకి రాలేదు. ఎంత చెడినా ఇప్పటికీ ఎయిరిండియా మార్కెట్‌ షేర్‌ 13 శాతం. టాటా గ్రూపుకు ఏవియేషన్‌లో చాలా మంచి అవకాశాలున్నాయనటంలో సందేహమే లేదు!!

-Advertisement-ఎయిరిండియా డీల్‌ లో ఎవరికి ఏమిటి?

Related Articles

Latest Articles