సాధారణంగా చెమట ఆరోగ్యానికి మంచిదే. కానీ రాత్రిపూట విపరీతమైన చెమటలు పడితే మాత్రం ప్రమాదకరమైన వ్యాధులకు సంకేతమని నిఫుణులు సూచిస్తున్నారు.
చెమట పట్టడంతో పాటు ముఖ్యంగా బరువు తగ్గటం, జ్వరం, నొప్పి, ఆయాసం, విరేచనాల వంటి వాటితో ముడిపడి ఉన్నట్టయితే తప్పకుండా ఆలోచించాల్సిందే.
థైరాయిడ్ గ్రంథి అతిగా పనిచేయటం వల్ల రాత్రిపూట చెమటలు రావొచ్చు. ఇందులో ఆకలి ఎక్కువగా వేయటం, బరువు తగ్గటం, గుండె దడ, అలసట, విరేచనాలు, చేతులు వణకటం, శరీరం వేడిగా అనిపించటం వంటి లక్షణాలూ ఉంటాయి.
రక్తంలో గ్లూకోజు మోతాదులు బాగా పడిపోయినా చెమటలు పట్టొచ్చు. ముఖ్యంగా మధుమేహుల్లో దీన్ని చూస్తుంటాం. ఎక్కువసేపు ఆకలితో ఉన్నప్పుడు వీరిలో చెమటలు పడుతుంటాయి.
కొన్నిరకాల ఇన్ఫెక్షన్లూ రాత్రి చెమటలకు కారణం కావొచ్చు. వీటిల్లో అన్నింటికన్నా ముఖ్యమైంది క్షయ. ఇందులో జ్వరం, దగ్గు కూడా ఉంటాయి.
ఎముకల ఇన్ఫెక్షన్ (ఆస్టియోమైలైటిస్), గుండె కవాటాల ఇన్ఫెక్షన్ (బ్యాక్టీరియల్ ఎండోకార్డయిటిస్) వంటివీ రాత్రి చెమటలకు దారితీయొచ్చు.
హెచ్ఐవీలో బరువు తగ్గటం, జ్వరంతో పాటు రాత్రిపూట చెమటలూ పడతాయి.
జీర్ణాశయంలోని ఆమ్లం పైకి గొంతులోకి ఎగదన్నుకొని రావటం (జీఈఆర్డీ) మూలంగానూ చెమటలు పట్టొచ్చు. ఇందులో ఛాతీలో మంట, నొప్పి వంటివీ ఉంటాయి.
హాడ్కిన్స్, నాన్-హాడ్కిన్స్ లింఫోమా వంటి కొన్నిరకాల క్యాన్సర్ల తొలిదశలో రాత్రిపూట చెమటలు పడుతుంటాయి. వీటిల్లో చెమటలతో పాటు స్వల్పంగా జ్వరం కూడా కనిపిస్తుంటుంది.
హైపర్హైడ్రోసిస్ కారణంగా కూడా చెమటలు పడతాయి. ఇదేమీ తీవ్రమైన సమస్య కాదు గానీ చికాకు పెడుతుంది. చెమటను తగ్గించే మందులు వేసుకోవటం, వదులైన దుస్తులు ధరించటం, తేలికైన చెప్పులు వేసుకోవటం వంటివి దీనికి మేలు చేస్తాయి.