ఒబెసిటీ, డయాబెటిస్‌ బాధితులకు ఇచ్చే పలు ఔషధాల వల్ల అరుదైన కంటి సమస్య వచ్చే ముప్పు ఉందని వెల్లడైంది.

అమెరికాలోని మసాచుసెట్స్‌ ఐ అండ్‌ ఇయర్‌ హాస్పిటల్‌ పరిశోధకుల బృందం చేసిన ఈ అధ్యయనం వివరాలు అమెరికన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ ఆప్తమాలజీ జర్నల్‌లో ప్రచురించారు

మధుమేహం ఉన్న వారికి ఇన్సులిన్‌ ఉత్పత్తిని పెంచి షుగర్‌ లెవల్స్‌ అదుపులో ఉండటానికి ఉపయోగపడేందుకు, ఊబకాయంతో బాధపడుతున్న వారికి బరువు తగ్గేందుకు గానూ ఒజెంపిక్‌, విగోవి వంటి ఔషధాలను వైద్యులు సిఫార్సు చేస్తున్నారు.

సెమాగ్లుటైడ్‌ అనే ప్రొటీన్‌ ఉన్న ఈ మందులు వాడే ఊబకాయ బాధితులకు మిగతా వారి కంటే ‘నాన్‌-ఆర్టెరిటిక్‌ ఆంటీరియర్‌ ఇషెమిక్‌ ఆప్టిక్‌ న్యూరోపతి’ సమస్య వచ్చే అవకాశం ఏడు రెట్లు ఎక్కువ ఉందని పరిశోధకులు గుర్తించారు. 

మధుమేహ బాధితులకు ఈ ముప్పు నాలుగు రెట్లు ఎక్కువ ఉంటుందని పేర్కొన్నారు. ఈ సమస్య వల్ల హఠాత్తుగా ఒక కన్ను చూపు కోల్పోయే ప్రమాదం ఉంటుందని తెలిపారు.

బరువు తగ్గడానికి మాత్రలు తీసుకునే వారిలో 66శాతం మంది గ్యాస్ట్రో పరేసిస్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. 

ఈ మందులు తీసుకుంటున్న వారిలో ఆహారం తీసుకున్న నాలుగు గంటల తరువాత కూడా జీర్ణాశయంలో ఆహారం ఉండటాన్ని పరిశోధకులు పరిశోధనలలో కనుగొన్నారు. ఇదే గ్యాస్ట్రో పరేసిస్ ను సూచిస్తుంది. 

గ్యాస్ట్రో పరేసిస్ సమస్య ఉన్నవారిలో 18 నెలల తరువాత ఈ ప్రమాదం 25 శాతం పెరిగినట్టు పరిశోధనలలో వెల్లడైంది.

బరువు తగ్గడానికి బరువు తగ్గించే మాత్రలు ఎప్పటికీ పరిష్కారం కాదని. ఇందుకోసం జీవనశైలి లో మార్పులు, వ్యాయామం, ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.