ప్రతి ఏటా పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక మంత్రులు వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టడం తెలిసిందే. అయితే, బడ్జెట్‌ను ఎలా తయారు చేస్తారో తెలుసా..
బడ్జెట్ ప్రవేశపెట్టడానికి 6 నెలల ముందు నుంచే పనులు ప్రారంభమవుతాయి. ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఆర్థిక వ్యవహారాల విభాగం వార్షిక బడ్జెట్‌ను తయారు చేస్తుంది.
ప్రభుత్వపు వార్షిక ఆదాయ వ్యయాలతో పాటు వచ్చే ఆర్థిక సంత్సరానికి సంబంధించి ప్రభుత్వ పాలసీలు, ప్రణాళికలు, కార్యక్రమాల ఆదాయ వ్యయాలు ఉంటాయి.
ఆగస్టు నెలలో బడ్జెట్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. అన్ని శాఖలకు సమాచారం ఇచ్చి నిధుల అవసరాన్ని తెలుసుకుంటారు.
అందిన సమాచారం ధ్రువీకరించిన తర్వాత.. రాబోయే ఖర్చులకు సంబంధించిన ఆదాయాన్ని వివిధ విభాగాలకు ఆర్థిక శాఖ కేటాయిస్తుంది. కేటాయింపులకు సంబంధించి అభ్యంతరాలు వస్తే మంత్రివర్గం, ప్రధానితో చర్చిస్తుంది.
వివిధ భాగస్వామ్య విభాగాలతో ఆర్థిక శాఖ ప్రీబడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా వారి సూచనలు, అవసరాలపై చర్చిస్తుంటుంది. అందరి సూచనలు తీసుకుని ధ్రువీకరణ కోసం ప్రధానితో చర్చిస్తుంది ఆర్థిక శాఖ.
తర్వాత ఆర్థిక శాఖ సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్యాక్సెస్ అండ్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమర్స్‌తో సమావేశమౌతుంది. ఎంత రెవెన్యూ వస్తుందో నివేదిక కోరుతుంది. వీటి ద్వారా బడ్జెట్ తయారు చేస్తుంది.
బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు కొద్ది రోజుల ముందు సంప్రదాయంగా కొనసాగుతున్న హల్వా ఉత్సవాన్ని ఆర్థిక శాఖ నిర్వహిస్తుంది. ఈ హల్వా కార్యక్రమంతోనే బడ్జెట్ పత్రాల ప్రింటింగ్ మొదలవుతుంది.
పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక మంత్రి ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెడతారు. ఆ తర్వాత ప్రభుత్వం చేపట్టబోయే కీలక ప్రాజెక్టులపై సుదీర్ఘ ప్రసంగం చేసి,అడిగే ప్రశ్నలకు సమాధానం ఇస్తారు.
ఆ తరువాత బడ్జెట్‌ను రెండు సభల ముందు ఉంచుతారు. ఉభయ సభల ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రపతి ఆమోదం కోసం పంపుతారు.