అస్వస్థతతో అహ్మదాబాద్‌లోని యూఎన్ మెహతా హాస్పిటల్‌లో చేరిన ఆమె.. చికిత్స పొందుతూ కన్నుమూశారు. గత జూన్ 18న హీరాబెన్ శతవసంతంలోకి అడుగుపెట్టారు.
తన కుమారుడు ప్రధాని అయినా.. ఆమె మాత్రం నిరాడంబరమైన జీవితాన్నే గడిపారు. ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందని అంటారు. ప్రధాని నరేంద్ర మోదీ జీవితంలో ఆ మహిళ తల్లి హీరాబెన్.
ఆమె జీవితాంతం కష్టపడింది.. కష్టపడి పని చేసింది.. ఎప్పుడూ ఒకరి నుంచి ఆశించలేదు. పిల్లలకు అలాంటి నడవడికే నేర్పారు.. ఇది వారిని స్వశక్తితో పైకి ఎదిగేలా మార్చింది.. గొప్ప నాయకులను చేసింది.
హీరాబెన్ మోదీకి ఐదుగురు కుమారులు, ఒక కుమార్తె. వీరిలో ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ రిటైర్డ్ అయ్యారు. కుమార్తె వాసంతీబెన్ హస్ముఖ్‌లాల్ మోదీ.
మూడో సంతానంగా జన్మించిన నరేంద్ర మోదీ.. భారత ప్రధానిగా.. నాలుగు సార్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు.
గుజరాత్‌లోని మెహసానాలోని వాద్‌నగర్‌లో 1923 జూన్ 18న జన్మించిన హీరాబెన్‌కు 15 ఏళ్లకే దామోదర్‌దాస్ మూల్‌చంద్ మోదీతో వివాహం జరిగింది.
కుటుంబం ఆర్ధిక కారణాలతో చదువుకోలేకపోయిన ఆమె.. తన పిల్లలకు అటువంటి పరిస్థితి రాకూడదని భావించింది. ఆరుగురు పిల్లల్ని విద్యావంతుల్ని చేయాలని నిర్ణయించింది.
వాద్‌నగర్‌లోనే ప్రధాని మోదీ ఏడో తరగతి వరకూ చదువుకున్నారు. స్కూల్ ఫీజులు కట్టడానికి కూడా ఇబ్బంది పడేవారు. ప్రధానికి కేవలం ఒకే యూనిఫామ్ ఉండేది.. అది చిరిగిపోతే దానిని వేరే రంగు గుడ్డపీలికలతో కుట్టేవారు.
వాద్‌నగర్‌లో హీరాబెన్ చిన్న పిల్లలు, మహిళలకు హోమ్ రెమిడీస్ చికిత్స చేసేవారు.
హీరాబెన్ ఎప్పుడూ తన పనుల్లో బిజీగా ఉండేవారు.. ఆమె దినచర్య పని, కుటుంబం తప్ప మరొకటి కాదని ఆమె స్నేహితురాలు పేర్కొన్నారు.