కాళ్లు, పాదాలు, చేతులు, వేళ్లు తరచుగా తిమ్మిరి పడుతుండడాన్ని మీరు గమనించారా? దీనిపై పెద్దగా ఆందోళన చెందాల్సిన పనేం లేదు. 

ఎక్కువ‌సేపు కూర్చొని పని చేయడం, గాయం మొదలైన వివిధ కారణాల వల్ల కూడా ఈ పరిస్థితి తలెత్తుతుంది. అయితే, కండ‌రాల తిమ్మిరి స‌మ‌స్య త‌గ్గేందుకు నిపుణులు కొన్ని చిట్కాలు చెప్పారు.

డీహైడ్రేష‌న్ వ‌ల్ల కాళ్లు తిమ్మిరెక్కుతాయి. ఈ స‌మ‌స్య నుంచి బ‌య‌ట‌ప‌డాలంటే రోజులో ఎక్కువ మొత్తంలో నీళ్లు తాగాలి. శ‌రీరాన్ని ఎప్పుడూ హైడ్రేట్‌గా ఉంచుకోవాలి.

వాపు నుంచి తిమ్మిర్ల వ‌ర‌కూ ఏ నొప్పినైనా త‌గ్గించుకోవాలంటే ఐస్‌తో మ‌సాజ్ చేయాలి. ఓ గుడ్డలో ఐస్‌ముక్కలు వేసి నొప్పి ఉన్నచోట గ‌ట్టిగా రుద్దుతూ మ‌సాజ్ చేయాలి. ఇలా చేస్తూ ఉంటూ తిమ్మిర్లు, నొప్పి త‌గ్గిపోతుంటాయి.

కాళ్లు తిమ్మిరెక్కిన‌ప్పుడు లేదా ప‌ట్టేసిన‌ప్పుడు అలాగే కూర్చుండొద్దు. నొప్పి ఉన్న కాలును స్ట్రెచ్ చేస్తూ ఉండాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల తిమ్మిరి, నొప్పి త‌గ్గిపోతుంది.

కాలు తిమ్మిరెక్కిన‌ లేదా నొప్పి క‌లిగిన‌చోట ఆయిల్‌తో మ‌సాజ్ చేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల కండ‌రాలు రిలాక్స్‌ అవుతాయి. కండ‌రాల తిమ్మిరిని ఎదుర్కోవ‌డంలో ఇది చాలా ప్రభావవంతంగా ప‌నిచేస్తుంది.

తిమ్మిరి లేదా నొప్పిగా ఉన్న కాలును పైకి ఎత్తి ఉంచాలి. దాన్ని నొప్పి త‌గ్గేవ‌ర‌కూ అలాగే ఉంచాలి. త‌గినంత విశ్రాంతి ఇస్తే నొప్పి దానికంత‌ట అదే త‌గ్గిపోతుంది.

ఫ్యాషన్ పేరుతో కొందరు బిగుతు దుస్తులు వేసుకుంటారు. కానీ మీ శరీరానికి సౌకర్యం కూడా చాలా ముఖ్యం. రక్తప్రసరణ స్తంభించిపోయేలా బిగుతైన దుస్తులు ధరిస్తే దీర్ఘకాలంలో కూడా ప్రమాదమే.

కూర్చున్నప్పుడు, నిలుచున్నప్పుడు, పడుకున్నప్పుడు తరచుగా మీ శరీర భంగిమ మార్చడం మంచిది. కింద కూర్చున్నప్పుడు ఒక కాలిపై ఇంకో కాలి భారం పడుతున్నప్పుడు తిమ్మిరి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

 మీ చేతులు, కాళ్లు, అరికాళ్లలో తిమ్మిర్లు వస్తున్నాయంటే మీరు కచ్చితంగా బీ -కాంప్లెక్స్ విటమిన్ లోపాలతో బాధపడుతున్నట్టు లెక్క. అలాగే పొటిషియం, కాల్షియం, సోడియం వంటి ఖనిజ లవణాల లోపం కారణంగా కూడా తిమ్మిరి వస్తుంది.

డయాబెటిస్ ఉన్న వారు, అధిక చెడు కొలెస్ట్రాల్ ఉన్న వారు, నరాల బలహీనత ఉన్న వారిలో కూడా తిమ్మిర్లు రావొచ్చు. వైద్యుడి సలహా మేరకు సంబంధిత పరీక్షలు చేయించుకుని మందులు వాడాలి.  

శరీరం తిమ్మిర్ల బారిన పడుతుంటే మీలో శారీరక చురుకుదనం తగ్గుతోందని కూడా గమనించాలి. అధిక బరువు ఉన్న వారు, డయాబెటిస్ ఉన్న వారు తరచుగా తిమ్మిర్ల బారిన పడుతుంటారు. అందువల్ల వారు శారీరక శ్రమ పెంచాలి.