మద్యపానం మనిషి ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం..! లివర్‌ చెడిపోవడం, గుండె సమస్యలు, పక్షవాతం లాంటి ఎన్నో ప్రాణాంతక రుగ్మతలకు మద్యపానమే ప్రధాన కారణంగా చెప్పవచ్చు..! 

అయితే మద్యం అతిగా సేవిస్తేనే ఆరోగ్యానికి హాని జరుగుతుందని, మితంగా తాగితే సమస్య ఉండదని, పైగా మేలు జరుగుతుందని కొందరు చెబుతుంటారు..! 

కానీ అది మంచి పద్ధతి కాదని తాజా అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి..!

మద్యపానం వల్ల సాధారణంగా మనిషిలో రక్తపోటు (బీపీ) పెరుగుతుంది. ఈ అధిక రక్తపోటు క్రమంగా ప్రాణాంతక గుండెపోటు, బ్రెయిన్‌స్ట్రోక్‌కు దారితీస్తుంది. 

అతిగా మద్యం సేవించేవాళ్లకేగాక మితంగా తాగేవాళ్లకు కూడా ఈ ప్రమాదం పొంచి ఉందని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. 

రోజుకు ఒక్క పెగ్గు మాత్రమే మద్యం తీసుకునే వాళ్లు అధిక రక్తపోటు బారినపడుతున్నారని పరిశోధకులు చెబుతున్నారు. 

అమెరికా, దక్షిణకొరియా, జపాన్‌ దేశాల్లో 19 వేల మందిపై చేసిన ఏడు అధ్యయనాల్లో ఈ విషయం స్పష్టమైందని తెలిపారు.

ఇక మితంగా తాగితే ఆరోగ్యానికి మేలు జరుగుతుందనడంలో వాస్తవం లేదని అధ్యయనాలు వెల్లడించాయి. 

అసలు మద్యం అలవాటే లేని వాళ్లతో పోల్చితే మితంగా మద్యం తాగే వారిలో ప్రత్యేకంగా కలిగే ప్రయోజనాలేమీ కనిపించలేదని ఈ అధ్యయనాలకు నేతృత్వం వహించిన సీనియర్‌ అధ్యయనకారుడు మార్కస్‌ విన్సెటీ చెప్పారు. 

అయితే అతిగా మద్యం సేవించే వారితో పోల్చితే, మితంగా మద్యం సేవించే వారిలో రక్తపోటు పెరుగుదల తక్కువగా ఉన్నదని తెలిపారు.