తల్లిని కాబోతున్నాను.. అన్న వార్త ఆడవారికి ఎంత ఆనందాన్ని కలిగిస్తుందో మాటల్లో చెప్పడం కష్టమే.
మొదటి నెల నుంచి ‘అమ్మా’ అని ఎప్పుడు పిలిపించుకుంటానో అని ఎంత ఆత్రుతగా ఎదురుచూస్తుంటారో..!
కానీ కొన్ని కొన్ని సార్లు ఈ ఆనందం మధ్యలోనే మటుమాయం అవుతుంది. గర్భస్రావం తీరని శోకాన్ని కలిగిస్తుంది. అయితే గర్భస్రావం కావడం వెనుక ఎన్నో కారణాలు ఉన్నాయి తెలుసా?
ప్రెగ్నెన్సీ సమయంలో ఖచ్చితంగా రెండు విషయాలు జరుగుతాయి. మొదటిది ఆరోగ్యవంతమైన బిడ్డ పుట్టొచ్చు.
రెండోది శిశువు పుట్టకముందే కొన్ని సమస్యలు రావొచ్చు. ఇవి ప్రతి ఒక్కరికీ వస్తాయని చెప్పలేం. ప్రస్తుత కాలంలో చాలా మంది ఆడవారు తరచుగా అబార్షన్ సమస్యలను ఫేస్ చేస్తున్నారు.
మొదటి 12 వారాలలో జరిగే గర్భస్రావాలలో సగానికి పైగా క్రోమోజోమ్ల అసాధారణ సంఖ్యే బాధ్యత వహిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ముఖ్యంగా 35 సంవత్సరాల తర్వాత క్రోమోజోమ్ సమస్యలు, గర్భస్రావం సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
ఆరోగ్య సమస్యలతో, మీ అలవాట్ల వల్ల అంటే ధూమపానం, మద్యపానం, మాదకద్రవ్యాల వినియోగం వల్ల గర్భస్రావం ప్రమాదం పెరుగుతుంది.
కొన్ని రకాల మందులు కూడా అబార్షన్ కు దారితీస్తాయంటున్నారు నిపుణులు. తామర వంటి కొన్ని చర్మ సమస్యలకు తీసుకునే మందులు కూడా ఈ ప్రమాదాన్ని పెంచుతాయి.
ఇంట్లో లేదా మీ ఆఫీసుల్లో మీ చుట్టూ ఉన్న వాతావరణం.. నీటి పైపులలో ఉండే పెయింట్ లేదా సీసం వంటి ద్రావకాలు కూడా గర్భస్రావం ప్రమాదాన్ని పెంచుతాయి.
గర్భిణులు రకరకాల వంటలను తినాలనుకుంటారు. కానీ ఈ సమయంలో ఫుడ్ పాయిజన్ కు గురైతే గర్భం పోయే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.
సాల్మొనెల్లా సాధారణంగా ముడి లేదా తక్కువ ఉడికించిన గుడ్లలో కనిపిస్తుంది. ఇది గర్భస్రావంతో పాటుగా ఎన్నో సమస్యలను కలిగిస్తుంది.