ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట వయసు వచ్చాక పెళ్లి చేసుకోవాలని అనిపిస్తుంది. పెళ్లయితే చాలు జీవితం పూల పాన్పులాగా మారుతుందని కొందరు అనుకుంటారు. తమ సంతోషానికి భాగస్వామి మాత్రమే కారణమవుతారని భావిస్తారు. 

ఈ ఆలోచనలో తప్పులేదు కానీ వారొక్కరే సంతోషాన్ని అందిస్తారని అనుకోవడం పొరపాటవుతుంది. ఎంత ఉత్తమ పార్ట్‌నర్ అయినా సరే అన్ని విషయాల్లో హ్యాపీగా ఉంచలేకపోవచ్చు. పెళ్లి కాని యువతీయువకులు ఈ తప్పుడు అవగాహనలతో అంచనాలు పెంచేసుకుంటారు. 

తల్లిదండ్రులు వీటిని తొలగించి, పెళ్లి అంటే ఏంటో తెలిసేలా వారికి చెప్పాలి. వైవాహిక జీవితం ఎలా ఉంటుందో వివరించాలి.

పెళ్లి జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాల వంటి అంశాల గురించి నిజాయితీగా చర్చించాలి. ఈ లైఫ్ గురించి పిల్లలతో మాట్లాడటం తల్లిదండ్రుల బాధ్యత. 

ఎలాంటి బంధానికైనా మంచి కమ్యూనికేషన్ చాలా ముఖ్యం. ఇదే విషయాన్ని తల్లిదండ్రులు పిల్లలకు చెప్పాలి. చక్కగా కమ్యూనికేట్ కావడం నేర్చుకోవాలని తెలియజేయాలి. భాగస్వామితో భావాలు, ఆలోచనలు పంచుకోవడం ద్వారా ఒకరినొకరు అర్థం చేసుకోవచ్చని చెప్పాలి.

వైవాహిక జీవితంలో కొన్ని విషయాల్లో రాజీ లేదా కాంప్రమైజ్ అవ్వడం తప్పనిసరి. అయితే నచ్చితేనే కాంప్రమైజ్‌ కావాలి. మనసులో ఇష్టం లేకుండా రాజీ పడితే బాధపడాల్సి వస్తుంది. ఈ విషయాన్ని పిల్లలకు వివరించాలి.

వివాహం అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య భాగస్వామ్యం అని పిల్లలకు తెలపాలి. ఈ భాగస్వామ్యం ఎల్లకాలం దృఢంగా ఉండాలంటే ఇద్దరు వ్యక్తులు సమానంగా సహకరించుకోవాలని చెప్పాలి. 

వివాహం ఒకేలా ఉండదు. ప్రతి దశలో జీవిత భాగస్వామిలో కొత్త కోణాలు చూడాల్సి వస్తుంది. వారి వ్యక్తిత్వం, ఆలోచనలు, ప్రవర్తనలు కాలక్రమేణా మారవచ్చు. కొన్ని మార్పులు నచ్చవచ్చు, మరికొన్ని నచ్చకపోవచ్చు. ఈ మార్పులను అంగీకరించడం ముఖ్యం. 

జీవిత భాగస్వామి ఎప్పటికీ ఒకేలా ఉండరని పిల్లలకు చెప్పాలి. వివాహం అంటే ఒకరినొకరు గౌరవించడం, ఒకరినొకరు అర్థం చేసుకోవడం, ఒకరినొకరు బలపరుచుకోవడం. ఈ విషయాలను గుర్తుంచుకుంటే, సవాళ్లను అధిగమించి, సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని గడపవచ్చు.

పెళ్లి తర్వాత వ్యక్తిగత స్వేచ్ఛను కోల్పోవడం చాలా మందికి జరుగుతుంది. అలా స్వేచ్ఛను వదులుకోకూడదని పిల్లలకు తల్లిదండ్రులు తెలియచెప్పాలి. పెళ్లయ్యాక సొంత వ్యక్తిత్వాన్ని మర్చిపోకుండా ఎల్లప్పుడూ ఆసక్తులు, అభిరుచులను కొనసాగించమని పిల్లలను ప్రోత్సహించాలి.

చాలా మంది జీవిత భాగస్వామి గురించి ఎన్నో కలలు కంటున్నారు. వారిలో ఉత్తమమైన లక్షణాలు ఉండాలని కోరుకుంటారు. కానీ ఎవరూ పర్ఫెక్ట్ పార్ట్‌నర్ కాలేరనే నిజాన్ని పిల్లలకు తెలియజేయాలి. 

ఒక వ్యక్తి ఎంత సానుభూతితో, అవగాహనతో, గౌరవంతో ఉంటే, వారు అంత మంచి జీవిత భాగస్వామి అయ్యే ఛాన్స్ ఉంది. గౌరవం, దయ జీవిత భాగస్వామిలో ఉండాల్సిన ముఖ్యమైన లక్షణాలు.