శివుడు ఒక అవతారం కాదు సాక్షాత్తు ఈశ్వరుడు, భగవంతుడు. ఆయనే సృష్టికి మూలం. లయకారుడు కూడా ఆయనే. శివతత్వం ఆధ్యాత్మికతకు మూలం. అది అర్థం చేసుకుని సాధన చెయ్యడమే మోక్షమార్గం.
నాగుపాము, త్రిశూలం, చంద్రవంక, ఫాలనేత్రమూ శివ చిహ్నాలుగా భావిస్తారు. ఈ చిహ్నాలు పవిత్రమైనవి మాత్రమే కాదు చాలా ప్రాముఖ్యత కలిగినవి కూడా.
ఈశ్వరుడు తన సిగలో చంద్రవంకను ధరించాడు. అందుకే శివుడు చంద్రశేఖరుడు అని అంటారు. శివుని తలపై చంద్రుడు ఉండటం కాలాన్ని నియంత్రించే ఒక గొప్ప శక్తికి ప్రతీక.
శివుడి మూడో కన్ను భౌతిక ప్రపంచానికి ఆవల అంతకు మించి ఉన్న అధిభౌతిక ప్రపంచానికి చిహ్నం. ఐదు జ్ఞానేంద్రియాలు మాత్రమే కాకుండా.. ఆరో జ్ఞానం.
శివుడి మూడో నేత్రం వల్లనే శివుడు త్రయంబకుడు, అధిభౌతిక జ్ఞాన కారకుడు అయ్యాడు. దీనినే ఇంగ్లీష్ లో సిక్త్ సెన్స్ గా చెప్పవచ్చు.
శివుడి చేతిలో త్రిశూలం ఆయుధంగా ధరించి ఉంటాడు. ఇది మానవ శరీరంలోని మూడు ప్రధాన నాడులకు ప్రతీక.
శివుడి త్రిశూలం జీవితంలో కోరిక, పోరాట పటిమ, జ్ఞానాన్ని సూచిస్తుంది. శివుడి త్రిశూలం వంటి ఈ మూడింటిని సాధించడమే జీవిత పరమార్థం.
శివుడు సుదీర్ఘ ధ్యానం నుంచి మేలుకున్నపుడు ఆయన కంటి నుంచి రాలిన కన్నీటి చుక్క భూమిపై పడిందని అది పవిత్రమైన రుద్రాక్ష వృక్షంగా మారిందని పురాణ గాథ.
పరమశివుడు తన మెడలో నాగుపామును ఆభరణంగా ధరిస్తాడు. శివుడి మెడలో ఉండే నాగు మూడు సార్లు మెడ చుట్టు చుట్టుకుని ఉంటుంది.
ఈ మూడు చుట్లు భూత, వర్తమాన, భవిష్యత్తులకు ప్రతీక. సర్పాన్ని ఆధీనంలో ఉంచుకోవడం ద్వారా శివుడు తమోగుణ లోపాలు, రుగ్మతలను నియంత్రించేవాడు, లయకారుడు అనే విషయాన్ని రుజువు చేస్తుంది.