వర్షాకాలంలో రోగనిరోధక శక్తి గణనీయంగా తగ్గుతుంది. అప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే.. ఇన్ఫెక్షన్లు, చర్మ అలెర్జీలు, ఫుడ్ పాయిజనింగ్, అజీర్తి, ఇన్‌ఫ్లుఎంజా, వైరల్ ఫీవర్ వంటి సమస్యలొస్తాయి. అవి రాకుండా ఉండాలంటే, ఆరోగ్యంగా ఉండాలి. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి. ఆ శక్తిని పెంచే ఆహారాల గురించే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం...

తులసి: ఇది అనేక ఔషధ ప్రయోజనాలను అందించే అద్భుత మూలిక. దీనివల్ల సీజనల్ వ్యాధులను దూరం చేసుకోవచ్చు. ఇది రోగనిరోధక వ్యవస్థను ప్రోత్సహిస్తుంది. శ్వాసకోశ వ్యాధుల నుండి మిమ్మల్ని రక్షిస్తుంది.

పసుపు: ఇందులో యాంటీఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులోని కర్కుమిన్.. ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి, సెల్ ఆరోగ్యాన్ని పెంపొందించడానికి తోడ్పడుతుంది.

ఇంగువ: ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలున్నాయి. ఇవి కడుపు సమస్యలు, గ్యాస్, మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలను పరిష్కరించడంలో సహాయపడతాయి.

దాల్చిన చెక్క: ఇందులో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించి, గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. గొంతు నొప్పి, జలుబు, దగ్గు చికిత్సకు కూడా సహాయపడుతుంది.

మిరియాలు: వీటిల్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. సైనస్, ఆస్తమా, ముక్కు కారటం వంటి వాటికి చెక్ పెట్టడంతో పాటు.. క్యాన్సర్, గుండె సమస్యలు, కాలేయ వ్యాధి ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి.

వెల్లుల్లి: యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాల్ని కలిగి ఉండే వెల్లుల్లి.. ఛాతీ ఇన్ఫెక్షన్లు, జలుబు, ఫ్లూని నిరోధించడంలో సహాయపడుతుంది.

అల్లం: ఇందులో వైరస్‌లను నిరోధించే సెస్క్విటెర్పెనెస్ అనే సమ్మేళనాలు ఉంటాయి. ఇది గొంతు నొప్పి, శరీర నొప్పులు, వికారం, జలుబు, ఫ్లూ వంటి సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుంది.

అశ్వగంధ: ఇందులో రోగనిరోధక శక్తిని పెంచే యాంటీ ఆక్సిడెంట్లు పెద్ద మొత్తంలో ఉంటాయి. ఇది శ్వాసకోశ వ్యవస్థను మెరుగుపరుస్తుంది.