సోషల్‌ మీడియా, ఇతర వెబ్‌సైట్లలో వచ్చే ఇలాంటి వార్తలకు ఆకర్షితులై, అదే పనిగా గంటల తరబడి మొబైల్‌తో గడుపుతాం. ‘డూమ్‌ స్క్రోలింగ్‌’గా పిలిచే ఈ వ్యసనం దీర్ఘకాలంలో మన మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని చెబుతున్నారు నిపుణులు. 

ఈ రోజుల్లో ఎవరిని చూసినా మొబైల్‌లోనే లీనమైపోతున్నారు. వ్యక్తిగత పనులనీ, ఆఫీస్ బాధ్యతలనీ, టైంపాస్‌ కోసమనీ.. అంతర్జాలంలోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. ఈ క్రమంలో సోషల్‌ మీడియాతో పాటు ఎన్నో వెబ్‌సైట్స్‌ని ఆశ్రయిస్తుంటాం.

అవాస్తవమైన వార్తలు, మరణాలు, హింస.. వంటి చెడు వార్తలు మన కంట పడినప్పుడు.. అవి మన జీవితంలోనూ జరుగుతాయేమోనన్న ఆలోచనలు మనల్ని మరింతగా కుంగదీస్తాయి.

చెడు వార్తల గురించి లోతుగా విశ్లేషించే క్రమంలో మరింత టెన్షన్‌ పడతారు. దీనివల్ల ఉన్నట్లుండి చెమటలు రావడం, శ్వాస అందకపోవడం, గుండె దడ పెరగడం.. వంటి లక్షణాలు కనిపిస్తాయి. 

ఎక్కువసేపు మొబైల్‌తో గడుపుతూ స్క్రోల్‌ చేయడం వల్ల కలిగే ఒత్తిడి, ఆందోళనలు.. ఆకలి హరించివేస్తాయని, స్వీయ ప్రేరణను దెబ్బతీస్తాయని ఓ అధ్యయనంలో తేలింది.

చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం కంటే ముందే జాగ్రత్తపడడం మంచిది. డూమ్‌ స్క్రోలింగ్‌ తెచ్చే అనర్థాల విషయంలోనూ ఇది వర్తిస్తుందంటున్నారు నిపుణులు. 

ఖాళీ దొరికినప్పుడల్లా చాలా మంది మొబైల్‌తోనే కాలక్షేపం చేస్తుంటారు. కానీ ఈ విషయంలోనూ ఒక కచ్చితమైన టైమ్‌ టేబుల్‌ తప్పనిసరి. 

ఫోన్‌ కోసం రోజంతా సమయం కేటాయించలేకపోయినా.. రాత్రుళ్లు మొబైల్‌కు పని చెప్తుంటారు చాలామంది. ఈ అలవాటుకు స్వస్తి చెప్పాలంటే.. మొబైల్‌ను పడకగది బయటే వదిలి వెళ్లమంటున్నారు నిపుణులు.

కాలక్షేపం కోసం మొబైల్‌ను ఆశ్రయించే వారు.. అందుకు ప్రత్యామ్నాయ మార్గాల్ని వెతుక్కోవడం మంచిదంటున్నారు నిపుణులు. 

భాగస్వామి, పిల్లలు, స్నేహితులతో సమయం గడపడం, అభిరుచులపై దృష్టి, కాసేపు అలా ప్రకృతితో మమేకమవడం, యోగా-ధ్యానం-వ్యాయామాలకు సమయం కేటాయించడం ఇలాంటివి అలవాటు చేసుకోవాలి. 

 అనవసరమైన సమాచారం కోసం వెతుకులాడకుండా కెరీర్‌కు ఉపయోగపడే సమాచారం వెతకడం, మానసిక ప్రశాంతతను అందించే సరదా విషయాలు/పోస్టులు, స్ఫూర్తిదాయక కథలు వంటివి చదవాలి.