శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయులు పరిమితికి మించి ఉంటే గుండెపోటు, పక్షవాతం, రక్తంలో గడ్డలు లాంటి వాటి ముప్పు పెరుగుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ఎముక మూలుగలో అసాధారణ పరిస్థితుల కారణంగా రక్తంలో ఎర్ర రక్తకణాలు పెరిగిపోతాయి. దీన్ని పాలిసైథీమియా అని పిలుస్తారు.
ఇలా ఎక్కువైన ఎర్ర రక్తకణాలు రక్తాన్ని మందంగా చేస్తాయి. దీంతో రక్త ప్రవాహం నెమ్మదిస్తుంది.
ఇది రక్తంలో అవరోధాలు (బ్లడ్ క్లాట్స్) లాంటి తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది.
ఎముక మూలుగలో విపరీత పరిస్థితులు మాత్రమే కాకుండా, ధూమపానం లాంటి దుర్వ్యసనాలు, గుండె, ఊపిరితిత్తుల వ్యాధులు, ఎక్కువ కాలంపాటు ఎత్తయిన ప్రదేశాల్లో నివాసం ఉండటం లాంటివి కూడా పాలిసైథీమియాకు దారితీస్తాయి.
ఒక డెసీలీటర్ రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయులు పురుషుల్లో అయితే 16.5 గ్రాములు, స్త్రీలలో అయితే 16 గ్రాములకు మించితే అసాధారణంగా పరిగణిస్తారు.
పాలిసైథీమియా లక్షణాలను గుర్తించలేం. కాబట్టి, రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయులు పెరిగిపోవడాన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. వెంటనే వైద్యుల సాయం తీసుకోవాలి.
లేకుంటే, ఇది బ్లడ్ క్లాటింగ్‌తోపాటు గుండెపోటు, కాళ్లు, ఉదర భాగం (అబ్డామెన్)లో రక్తం ప్రవాహంలో అవరోధాలకు దారితీస్తుంది. ఇక రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి ఎక్కువగా ఉన్నట్టు తేలితే, మరిన్ని వివరాలు, చికిత్స గురించి హెమటాలజిస్టును సంప్రదించాలి.
కాగా పాలిసైథీమియా సమస్య తలెత్తినప్పుడు నిద్రలో శ్వాస సరిగ్గా ఆడని పరిస్థితి అయిన స్లీప్ ఏప్నియాతోపాటు గుండె, ఊపిరితిత్తుల సమస్యలు కూడా చుట్టుముట్టొచ్చు.