ఉల్లి ప్రయోజనాలకు సంబంధించి ఇప్పటికే అనేకం చూశాం. ఎన్నో పోషకాలు ఉన్న ఉల్లిపాయలను ప్రతి వంటింట్లో ఉపయోగిస్తారు.
ఉల్లిపాయ లేని కూరలు అంత రుచిగా ఉండవని కూడా అంటుంటారు. అయితే ఉల్లిపొట్టుతో కలిగే లాభాలు తెలిస్తే.. ఇక మీదట దాన్ని పారేయకుండా దాచిపెట్టుకుంటారు..
ఉల్లిపొట్టులో విటమిన్లు A, K, C పుష్కలంగా ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. మరి దీని ప్రయోజనాలను ఇప్పుడు చూద్దాం..
ఉల్లిపాయ పొట్టులో ఉండే యాంటీఆక్సిడెంట్ లక్షణాలు కండరాల నొప్పిని తగ్గించడంలో ప్రభావవంతంగా ఉంటాయి.
ఒక గ్లాసు నీటిలో కొంచెం ఉల్లిపాయ పొట్టు వేసి పదిహేను నిమిషాలు బాగా మరిగించాలి. ఆ నీటిని వడకట్టి తాగితే కండరాల నొప్పులు తగ్గుతాయి.
జుట్టు సంరక్షణకు ఉల్లిపాయలు ఎంతగానో ఉపయోగపడతాయి, ఉల్లిపాయ పొట్టులు కూడా సహాయపడతాయి. ఇందులో సల్ఫర్ ఎక్కువగా ఉంటుంది.
ఇది జుట్టు పెరుగుదలకు సహాయపడే కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. జుట్టు నెరసిపోకుండా కాపాడుతుంది.
ఒక గ్లాసు నీళ్లలో నాలుగోవంతు తీసుకుని గంటసేపు బాగా మరిగించాలి. ఈ మిశ్రమాన్ని రాత్రంతా అలాగే ఉంచి మరుసటి రోజు ఉదయం అప్లై చేయాలి.
30 నిమిషాల పాటు ఆరబెట్టిన తర్వాత తలస్నానం చేస్తే జుట్టు నెరసిపోవడం తగ్గుతుంది. చుండ్రు కూడా తొలగిపోతుంది. యాంటీ ఫంగల్ గుణాలు కలిగిన ఉల్లిపాయ పొట్టు చర్మ సమస్యలకు చెక్ పెడుతుంది.
ఉల్లిపాయ పొట్టును నీటిలో వేసి మరిగించి దురద, దద్దుర్లు ఉన్న చోట రాస్తే మంచి ఫలితం ఉంటుంది.
ఉల్లిపాయ పొట్టుతో టీ తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. 'ఉల్లిపాయ టీ'... నిద్రలేమిని దూరం చేసి కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
రెండు కప్పుల నీటిలో ఉల్లిపాయ పొట్టులను జోడించండి. నీటి రంగు మారే వరకు మరిగించాలి. ఆ తర్వాత వడగట్టి అందులో ఒక టీస్పూన్ తేనె కలిపితే... 'ఆనియన్ టీ' రెడీ!