ఆస్కార్.. ప్రపంచంలోని ప్రతి సినిమా నటుడు, సాంకేతిక నిపుణుడు ముద్దాడాలని చూసే పురస్కారం.
95వ వసంతంలోకి అడుగుపెడుతున్న ఆస్కార్ వేడుకకు ఘన చరిత్ర ఉన్నట్టే.. ఆస్కార్ పురస్కార ప్రతిమకూ ఓ హిస్టరీ ఉంది.
హాలీవుడ్ నటులు, దర్శకులు, నిర్మాతలు, రచయితలు, సాంకేతిక నిపుణులతో కూడిన 5 విభాగాలతో 1927లో ‘ది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ సంస్థ’ ఏర్పడింది.
1929 నుంచి చలన చిత్ర రంగంలో విశేష ప్రతిభ చూపిన వారికి ‘అకాడమీ అవార్డ్ ఆఫ్ మెరిట్’ పేరిట పురస్కారాలు ఇవ్వడం ప్రారంభించింది. ఆ తర్వాత వీటిని ఆస్కార్గా పిలుస్తున్నారు.
ఆస్కార్ ప్రతిమ.. కాంతులీనే పసిడి వర్ణంతో, ఓ యోధుడు రెండు చేతులతో వీరఖడ్గం చేతపట్టి ఫిల్మ్ రీలుపై ఠీవీగా నిల్చొన్నట్టు కనిపిస్తుంది. ఈ రూపును ఎంజీఎం స్టూడియో ఆర్ట్ డైరెక్టర్ కెడ్రిక్ గిబ్బన్స్ సృష్టించారు.
తొలిసారి ఈ పురస్కార ప్రతిమను చూసిన అకాడమీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మార్గరెట్ హెర్రిక్.. అందులోని యోధుడు అచ్చం తన అంకుల్ ఆస్కార్లా ఉన్నాడని అందట. ఆ తర్వాత హాలీవుడ్ కాలమిస్ట్ సిడ్నీ స్కోల్స్కీ తన వ్యాసంలో వీటిని ఆస్కార్ పురస్కారాలని ప్రస్తావించాడట.
ఎమిలో ఫెర్నాండెజ్ అనే నటుడిని నగ్నంగా నిలబెట్టి అతడి ఆకారం నుంచి స్ఫూర్తిపొంది.. గిబ్బన్స్ ఈ ప్రతిమను రూపొందించాడట. అందుకే ఆస్కార్ ప్రతిమ నగ్నంగా కనిపిస్తుంది.
మొదటిసారిగా ఆస్కార్ అందుకున్న నటుడు ఎమిల్ జన్నింగ్స్. ‘ది లాస్ట్ కమాండ్’ చిత్రానికిగానూ ఆయన ఉత్తమ నటుడిగా ఈ అవార్డు స్వీకరించారు.