నగర యువతలో ఈ-సిగరెట్‌ (ఎలక్ట్రానిక్‌ సిగరెట్‌) వినియోగం భారీగా పెరుగుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి.

సాధారణ సిగరెట్‌తో పోల్చితే ఇది ప్రమాదకరం కాదనే ధీమాతో చాలామంది ఈ-సిగరెట్‌ను అలవాటుగా చేసుకుంటున్నట్లు వైద్యులు చెబుతున్నారు.

ఏ సిగరెట్‌ తాగినా సరే...అనారోగ్యం తప్పదని హెచ్చరిస్తున్నారు. గుండె వ్యాధులతోపాటు నోటి, ఊపిరితిత్తుల క్యాన్సర్లకు ఈ-సిగరెట్లు కూడా కారణమేనని స్పష్టం చేస్తున్నారు.

ప్రభుత్వ ఎంఎన్‌జే క్యాన్సర్‌ ఆసుపత్రికి వస్తున్న క్యాన్సర్‌ కేసుల్లో 25-30 శాతం పొగాకు సంబంధించినవేనని వైద్యులు వెల్లడిస్తున్నారు. 

ముఖ్యంగా 25-40 ఏళ్ల వయస్సులో యువత సైతం నోటి, ఊపిరితిత్తుల క్యాన్సర్ల బారిన పడుతున్నారని పేర్కొంటున్నారు.

సాధారణ సిగరెట్లలో 7 వేల రకాల రసాయనాలుంటాయి. వీటిలో 70 రకాల రసాయనాలు క్యాన్సర్‌ కారకాలు. పలు రసాయనాలు నేరుగా మనిషి దేహంపై ప్రభావం చూపుతాయి.

పొగకు బానిస అయితే... ఆ అలవాటు నుంచి బయటపడలేక ఎంతోమంది సతమతమవుతుంటారు. మరికొందరు ఈ-సిగరెట్‌ తాగేందుకు అలవాటు పడుతున్నారు. 

యువత కూడా.. ఇదో ఫ్యాషన్‌గా ఈ-సిగరెట్లకు అలవాటు పడుతున్నారు. తర్వాత తెలియకుండానే వీటికి బానిసలవుతున్నారు. 

పబ్‌కల్చర్‌ పెరిగిన తర్వాత ఈ-సిగరెట్‌ వాడకం మరింత పెరిగింది. ఈ-సిగరెట్‌ను ఎలక్ట్రానిక్‌ నికోటిన్‌ డెలివరీ సిస్టమ్‌(ఈఎన్‌డీఎస్‌) అని కూడా వ్యవహరిస్తారు. 

ద్రవరూపంలో ఉన్న నికోటిక్‌ సిగరెట్‌ లాంటి ఎలక్ట్రానిక్‌ పరికరంలో ఉంటుంది. అందులో బ్యాటరీ అమర్చి ఉంటుంది. నోట్లో పెట్టుకొని పీల్చినప్పుడు బ్యాటరీ నికోటిన్‌ను మండిస్తుంది. సిగరెట్‌లా మండుతుంది. 

సాధారణ సిగరెట్‌ కంటే ఇందులో దీర్ఘంగా పీల్చే అవకాశం ఉంటుంది. దీంతో ధారాళంగా పొగ ఊపిరితిత్తులను చేరుతుంది.

నికోటిక్‌ ఎక్కువగా తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు, గుండెపోటు ఇతర అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

పొగ తాగడం అనేది క్యాన్సర్‌కు దగ్గర దారి అని అపోలో కేన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ విజయానందరెడ్డి అన్నారు. నగరంలో పొగ తాగే వాళ్ల శాతం బాగా పెరుగుతోందన్నారు.

ఇంట్లో పొగ తాగే వారి కారణంగా మిగతా సభ్యులు కూడా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇంట్లో భర్త లేదా భార్యలో ఎవరికి పొగతాగే అలవాటు ఉన్నాసరే...ఇతర కుటుంబ సభ్యులకు 30 శాతం కేన్సర్, 91శాతం గుండెజబ్బులు వచ్చే ప్రమాదం ఉంది.